విజయవాడ: గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యం, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రారంభించిన 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, 66 ఏళ్ల సుదీర్ఘ లీజు (పీపీపీ) పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు, తమ అనుయాయులకు ధారాదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ’ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆ చర్యలన్నీ విరమించుకోవాలని, నిర్మాణంలో ఉన్న 10 మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే పూర్తి చేయాలని కమిటీ డిమాండ్ చేసింది. లేని పక్షంలో అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఏకమై పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నిర్మిస్తామని విజయవాడలో నిర్వహించిన సమావేశంలో కమిటీ హెచ్చరించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరేమన్నారంటే..: 66 ఏళ్ల లీజు పేరుతో ప్రజల ఆస్తుల అమ్మకం. :పేర్ని వెంకట్రామయ్య (నాని). మాజీ మంత్రి. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి పాలకులు, ప్రజల ఆస్తులను, భవిష్యత్ జీవితాలను బరితెగించి అమ్మేందుకు తలుపులు తెరిచారు. ప్రజల కోసం నిర్మాణం చేపట్టిన 17 మెడికల్ కాలేజీల్లో మిగిలిన 10 కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి ఎడతెరిపి లేని ప్రయత్నాలు చేస్తున్నారు. 33 ఏళ్ల లీజుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఇప్పుడు ఏకంగా 66 ఏళ్ల పాటు ప్రైవేటుకు ఇచ్చేస్తామంటున్నారు. ఇది చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్, మోదీ లేదా బీజేపీ ప్రైవేట్ ఆస్తులా? 66 ఏళ్ల తర్వాత ఇందులో ఎవరు ఉంటారు? ప్రజల ఆస్తిని అప్పనంగా రాసిచ్చే హక్కు మీకెక్కడిది? ప్రజాధనంతో ప్రైవేటుకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్, జీతాలు: ప్రైవేటు వాళ్లు ముందుకు రాకపోవడంతో కేంద్రంతో మాట్లాడి వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కింద రూ.1,100 – 1,200 కోట్లు తెచ్చి, ఒక్కో కాలేజీకి రూ.230–250 కోట్లు ఇస్తామంటున్నారు. సగంలో ఉన్న ఆసుపత్రులు, కాలేజీ భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి, పరికరాల కొనుగోలుకు ఇచ్చే ఈ డబ్బు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్ము కాదా? అంతే కాకుండా, ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి రెండేళ్ల పాటు ప్రభుత్వమే జీతాలు ఇస్తుందట. ఇవి హెరిటేజ్ సొమ్మా? లేక పవన్ కళ్యాణ్ సినిమాలు చేసి సంపాదించిన డబ్బులా? సొమ్ము అంతా ప్రజలది పెట్టి, కాలేజీలను ప్రైవేటు వాళ్లకు అప్పగించి, సగం సీట్లు బ్లాక్‌లో అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నారు. నియంత్రణ లేని వ్యవస్థతో పేదలకు వైద్యం దూరం: ఇప్పటికే ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బ్లాక్‌లో సీట్ల అమ్మకాలను, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని నియంత్రించలేని అచేతన స్థితిలో ప్రభుత్వం ఉంది. రేపు ఈ కొత్త కాలేజీల్లో 30–40 శాతం ఉచిత వైద్యం అందిస్తున్నారో లేదో ఎవరు పర్యవేక్షిస్తారు? రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ వ్యవస్థను సర్వనాశనం చేశారు. పేదవాడికి జబ్బు చేస్తే ఎమ్మెల్యే లెటర్ కోసం పీఏలకు లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆదోని, పాలకొల్లు వంటి మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తయితే న్యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ వైద్యం సామాన్యుడికి అందుబాటులోకి వస్తుంది. పాలకులకు సొంత వైద్యంపై నమ్మకం లేదు.. ఉద్యమం తప్పదు: చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లకు చిన్న నొప్పి వచ్చినా విమానాల్లో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి, ముంబైకి వెళ్లి వైద్యం చేయించుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్యంపై మీకే నమ్మకం లేదు, కానీ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన కాలేజీలను మాత్రం నిస్సిగ్గుగా అమ్మేస్తున్నారు. స్త్రీలోలుడు, వ్యసనపరుడు, అయోగ్యుడు అంటూ రామారావు గారిని పదవిలో నుంచి కూలదోసావు, పార్టీని లాక్కున్నావు, ఇప్పుడేమో ఆయనకి విగ్రహం పెడతానని చెబుతున్నారు. ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణం కోసం రూ.1,500 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులుంటాయి కానీ, రెండు మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి మనసు రాదా? వచ్చే నెలలో ప్రైవేటీకరణకు టెండర్లు పిలిస్తే, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ ఏకమై, ప్రభుత్వం తోక ముడిచేదాకా రాబోయే రెండున్నరేళ్లు గట్టిగా పోరాటం చేస్తాం. స్పందన లేకపోవడంతో 4 అంశాల ప్రతిపాదన. :కెఎస్.లక్ష్మణరావు. మాజీ ఎమ్మెల్సీ. మార్కాపురం, ఆదోని, పెనుగొండ, నర్సీపట్నం వంటి వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు రావడం వల్ల సీట్లతో పాటు 300 పడకల ఆసుపత్రులు పేదలకు అందుబాటులోకి వస్తాయి. పీపీపీ విధానంలో ఎవరూ ముందుకు రాకపోవడంతో, కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రభుత్వం నాలుగు అంశాలను ప్రతిపాదించింది. అమలాపురం (48 ఎకరాలు), బాపట్ల (50), నర్సీపట్నం (47), పాలకొల్లు (49), పెనుగొండ (50), ఆదోని (50), మదనపల్లి (52), మార్కాపురం (47) తదితర ప్రాంతాల్లోని విలువైన భూములను ఏడాదికి ఎకరం కేవలం రూ.100 నామమాత్రపు లీజుకు కట్టబెడుతున్నారు. అంటే 48 ఎకరాలకు ఏడాది అద్దె కేవలం రూ.4,800 మాత్రమే. ‘క్రోని క్యాపిటలిజం’కు తెర లేపారు: లీజు గడువును 33 ఏళ్ల నుంచి 66 ఏళ్లకు పెంచడం, రూ.1,630 కోట్లు లయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వడం, రెండేళ్ల పాటు డాక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బంది జీతాలు ప్రభుత్వమే భరించడం అనే నిబంధనలతో తమకు కావాల్సిన వారికి పంచిపెట్టే ’క్రోని క్యాపిటలిజం’కు తెరలేపారు. వాస్తవానికి కేంద్రం ఇచ్చే ఈ రూ.1,630 కోట్ల నిధులతో ప్రభుత్వమే ఈ 10 మెడికల్ కాలేజీలను సులభంగా పూర్తి చేయగలదు. ఇప్పటికే 17 కాలేజీల్లో 7 పూర్తయి అడ్మిషన్లు అద్భుతంగా జరుగుతున్నాయి. మిగిలిన 10 కాలేజీలను ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజలను సమాయత్తం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. గిరిజన, సరిహద్దు ప్రాంతాలకు ప్రభుత్వ వైద్యమే ప్రాణాధారం :రామ్‌భూపాల్. సీపీఎం నాయకుడు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన గోపిక, లక్ష్మి నేడు ప్రాణాలతో ఉన్నారంటే అక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల, సీనియర్ డాక్టర్లు ఉండటమే కారణం. అలాగే అల్లూరి జిల్లా ఏజెన్సీలోని జి.కె. వీధి, ముంచంగిపుట్టు, చింతపల్లి ప్రాంతాల్లో విషజ్వరాలు, మలేరియా ప్రబలినప్పుడు నర్సీపట్నం, పాడేరు ఆసుపత్రుల్లో కనీసం 15 శాతం మందికి కూడా వైద్యం అందించే సిబ్బంది లేరు. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ పూర్తయి ఉంటే గిరిజనులకు ఎంతో మేలు జరిగేది. ప్రచార ఈవెంట్లకు వందల కోట్లు.. కాలేజీలకు నిధుల్లేవా?: మరోవైపు కర్ణాటక సరిహద్దులోని పెనుగొండ, ఆదోని ప్రాంతాల ప్రజలు అత్యవసర వైద్యం కోసం 70 కిలోమీటర్ల దూరంలోని బళ్లారికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. పెనుగొండలో కాలేజీ నిర్మాణం దాదాపు పూర్తయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విశాఖ సమ్మిట్, యోగా వంటి ప్రచార ఈవెంట్ల కోసం వందల కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న ప్రభుత్వానికి, పేదల ప్రాణాలు కాపాడే మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలనే చిత్తశుద్ధి లేదు.