తాడేపల్లి: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రజలను, విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా పచ్చి అబద్ధాలు చెబుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం ఒక్కో సందర్భంలో ఒక్కో లెక్క చెబుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆక్షేపించారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రూ.1,471 కోట్లు చెల్లించామని ఒకచోట, అసెంబ్లీలో రూ.2,900 కోట్లు అని, కాగ్ లెక్కల్లో రూ.1,771 కోట్లుగా ఉండటం ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలకు, గందరగోళానికి నిదర్శనమన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, బడ్జెట్ సవరణల్లో చూపిస్తున్న మొత్తాలకు పొంతన లేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద సుమారు రూ.9,100 కోట్లు, వసతిదీవెన కింద రూ.3,300 కోట్లు కలిపి రూ.12,400 కోట్ల బకాయిలు ఉండగా, ప్రభుత్వం చెల్లించిన రూ.2,800 కోట్లు మినహాయిస్తే ఇంకా రూ.9,600 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్‌కు నిజంగా చెల్లింపులపై చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి విసిరారు. ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే... గతంలో చంద్రబాబు పెట్టిన రూ. 2 వేల కోట్లు బకాయిలు చెల్లించాం: దివంగత వైఎస్సార్ గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని జగన్ గారు తన ఐదేళ్ల పాలనలో మరింత సమర్థవంతంగా కొనసాగించారు. పేద విద్యార్థుల చదువులకు పేదరికం అడ్డుకాకూడదనే గొప్ప లక్ష్యంతో ప్రతి మూడు నెలలకోసారి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా ఒక్క త్రైమాసికానికి సంబంధించిన బకాయిలు మాత్రమే మిగిలాయి. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం వదిలివెళ్లిన సుమారు రూ.2 వేల కోట్ల బకాయిలను సైతం జగన్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా విద్యార్థులకు రావాల్సిన ఫీజులు చెల్లించకుండా గత ప్రభుత్వంపై నిందలు వేయడం సిగ్గుచేటు. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా వారి చదువులపై తల్లిదండ్రులకు కూడా బాధ్యత కల్పించాం. నేడు కాలేజీలకు ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. పరీక్షలు రాయగలమా? సర్టిఫికెట్లు వస్తాయా? ఉన్నత చదువులు కొనసాగించగలమా? అనే ఆందోళనతో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపే పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించింది. విద్యార్థుల భవిష్యత్తుపై బాధ్యత లేని విద్యాశాఖ మంత్రి పదవిలో కొనసాగడం దురదృష్టకరం. అనవసర ప్రచారాలకు, ఆర్భాటాలకు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం పేద విద్యార్థుల ఫీజులు చెల్లించడానికి మాత్రం ఎందుకు వెనుకాడుతోంది? విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా లేదు: గత ప్రభుత్వంపై నిందలు వేయడం మానేసి విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతిదీవెన బకాయిలను తక్షణమే చెల్లించాలి. జగన్ గారి ప్రభుత్వంలో ఏనాడూ విద్యార్థులు ఫీజుల కోసం రోడ్లపైకి వచ్చే పరిస్థితి రాలేదు. ప్రతి త్రైమాసికానికి నిర్ణీత సమయంలో నిధులు అందించాం. నేడు విద్యార్థుల చదువులు మధ్యలో ఆగిపోతున్నా, కాలేజీ యాజమాన్యాల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ విద్యార్థుల పక్షాన నిలబడి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టడంతో పాటు కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేసింది. బకాయిలు చెల్లించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రూ.9,600 కోట్ల బకాయిలను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి. అవసరమైతే మంత్రి నారా లోకేష్‌తో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఎక్కడైనా, ఎప్పుడైనా ఆధారాలతో చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు జగన్ గారి నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తుందని ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి హెచ్చరించారు.