ఫీజు బకాయిల పాపం కూటమి ప్రభుత్వానిదే.. 

తక్షణమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి 

మాజీ మంత్రి పేర్ని  వెంకట్రామయ్య (నాని) డిమాండ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య( నాని).

రూ. 9,600 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ , వసతి దీవెన బకాయిలతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

టీసీల కోసం తల్లిదండ్రులు నగలు తాకట్టు పెట్టే దుస్థితి

అబద్ధాల శాఖ మంత్రిగా మారిన నారా లోకేష్

కాగ్ లెక్కలు, అసెంబ్లీ సమాధానాలతో బయటపడ్డ కూటమి సర్కార్ బండారం 

మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టీకరణ.

తాడేపల్లి : కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరులో ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో కరోనా కాలంలో మినహా 18 త్రైమాసికాలకు విద్యా దీవెన, వసతి దీవెన నిధులను సకాలంలో చెల్లించారని, ఎన్నికల కోడ్ వల్ల ఆగిన చివరి క్వార్టర్ నిధులు రూ. 1,800 కోట్లతో సహా వివిధ పథకాలకు రూ. 7 వేల కోట్లకు పైగా ఖజానాలో ఉంచి ప్రభుత్వాన్ని అప్పగించారని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బయట ఒక మాట, అసెంబ్లీలో మరో మాట చెబుతూ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని,  రూ. 12,400 కోట్ల బకాయిలకు గాను కాగ్ లెక్కల ప్రకారం కేవలం రూ. 2,800 కోట్లు మాత్రమే చెల్లించి రూ. 9,600 కోట్లు బకాయి పెట్టారని  స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తూ విద్యాశాఖను గాలికొదిలేసిన నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా అయన ఏమన్నారంటే... 

చిత్తూరు విద్యార్థిని ఘటనకు చంద్రబాబు, లోకేష్‌లే బాధ్యులు: 
డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వ ఏలుబడిలో పేద విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. చిత్తూరులోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం ఫీజుల కోసం పెట్టిన ఒత్తిడి, అవమానం భరించలేక ఒక సామాన్య కుటుంబానికి చెందిన విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేయడం అత్యంత దురదృష్టకరం. జీవితం గురించి ఎన్నో కలలు కనే వయసులో ఒక ఆడపిల్ల ప్రాణం తీసుకునేంత తెగింపుకు వచ్చిందంటే దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ల నిర్లక్ష్యమే. ఈ ఘటనకు తండ్రీకొడుకులు ఇద్దరూ పూర్తి బాధ్యత వహించాలి. విద్యాశాఖను గాలికొదిలేసిన నారా లోకేష్‌ను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలి.

ప్రశ్నిస్తే బాబాయ్ హత్య అంటూ డైవర్షన్ పాలిటిక్స్: 
ఫీజులు కట్టకపోవడం వల్ల విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోందని, తక్షణమే బకాయిలు చెల్లించాలని వైఎస్ జగన్ గట్టిగా కోరితే సమాధానం చెప్పకుండా నారా లోకేష్ 'బాబాయ్ హత్య' అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వైఎస్ జగన్‌కు ఏమాత్రం సంబంధం లేదని సాక్షాత్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, సుప్రీంకోర్టు స్పష్టం చేసినా తండ్రీకొడుకులు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లతో వాదించినా సీబీఐ ఒకటే మాట చెప్పింది. అయినా సరే తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ జగన్‌పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు.

ఖజానాలో రూ. 7 వేల కోట్లు ఉంచితే జల్సాలకు వాడేశారు:
గత ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు ఫీజు బకాయిలు పెట్టిందని విద్యాశాఖ మంత్రి లోకేష్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో మొత్తం 20 క్వార్టర్లకు గాను కరోనా కాలంలో మినహా 18 క్వార్టర్లకు విద్యా దీవెన, వసతి దీవెన నిధులను క్రమం తప్పకుండా చెల్లించారు. ఎన్నికల కోడ్ రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవడం వల్ల చివరి క్వార్టర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ. 700 కోట్లు, వసతి దీవెన రూ. 1,100 కోట్లు కలిపి మొత్తం రూ. 1,800 కోట్లను ఖజానాలోనే సిద్ధంగా ఉంచారు. విద్యా దీవెన, వసతి దీవెన, ఇతర పథకాల కోసం మొత్తం రూ. 7 వేల కోట్లకు పైగా నిధులు ఖజానాలో పెట్టి ప్రభుత్వాన్ని అప్పగిస్తే, ఆ డబ్బును విద్యార్థులకు ఇవ్వకుండా పప్పుబెల్లాల్లా జల్సాలకు వాడేశారు. 2019లో చంద్రబాబు దిగిపోయేటప్పుడు ఖజానాలో కేవలం రూ. 100 కోట్లు మాత్రమే ఉంచి, రూ. 48 వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిన విషయం మర్చిపోయారా? 2017-19 మధ్య రెండేళ్లకు గాను రూ. 2,006.92 కోట్ల ఫీజు బకాయిలు పెట్టి వెళ్లామని స్వయంగా లోకేష్ అసెంబ్లీలోనే అంగీకరించారు.

రూ. 9,600 కోట్ల బకాయిలు.. కాగ్ లెక్కలే నిదర్శనం: 
ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 13 త్రైమాసికాలకు విద్యా దీవెన కింద రూ. 9,100 కోట్లు, మూడేళ్ల వసతి దీవెన కింద రూ. 3,300 కోట్లు కలిపి మొత్తం రూ. 12,400 కోట్లు విద్యార్థులకు చెల్లించాల్సి ఉంది. కాగా, కాగ్ (CAG) నివేదిక ప్రకారం కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఒకసారి రూ. 1,700 కోట్లు, మరోసారి రూ. 1,100 కోట్లు కలిపి మొత్తం రూ. 2,800 కోట్లు మాత్రమే విదిల్చింది. అంటే ఇంకా రూ. 9,600 కోట్లు పేద విద్యార్థులకు బకాయి ఉంది. బయట ఒక అంకె, అసెంబ్లీలో మరో అంకె చెబుతూ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా కాకుండా 'అబద్ధాల శాఖ మంత్రి'గా వ్యవహరిస్తున్నారు.

వైఎస్‌ జగన్‌ 5 ఏళ్లలో విద్యారంగానికి సుమారు రూ.75 వేల కోట్లు ఖర్చు.  
వైయస్.జగన్ ఐదేళ్లలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.12,609 కోట్లు, వసతి దీవెనకు రూ.5,392 కోట్లు, యూనిఫారాలు, బ్యాగులకు రూ.3,366 కోట్లు, ట్యాబ్‌లకు రూ.1,300 కోట్లు ఖర్చు చేశారు. డిజిటల్‌ బోధనకు రూ.838 కోట్లు,నాడు-నేడు కింద రూ. 11,700 కోట్లతో 16 వేల స్కూళ్లను అభివృద్ధి చేసి, మొత్తంగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం రూ. 75 వేల కోట్లు ఖర్చు చేశారు. విద్యారంగంలో ఇన్ని మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వారెవరు? గొప్పలు చెప్పుకుంటున్న వారెవరు? ప్రజలే తేల్చాలి.

నగలు తాకట్టు పెట్టి టీసీలు తెచ్చుకునే దుస్థితి: 
ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో తల్లిదండ్రులు తమ ఇంట్లోని బంగారు నగలను తాకట్టు పెట్టి కాలేజీలకు ఫీజులు కట్టి టీసీలు తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి నేడు రాష్ట్రంలో ఏర్పడింది. బంగారు నగలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకోవడంలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో (రూ.2.23 లక్షల కోట్లు) ఉందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. గుంటూరు, తాడేపల్లిగూడెంలకు చెందిన ఇద్దరు కాలేజీ ఓనర్లను తెచ్చి ఫీజులు అందుతున్నాయని అబద్ధాలు చెప్పిస్తూ 'పిల్లికి ఎలుక సాక్ష్యం' అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఒకవైపు నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతుంటే, మరోవైపు 20 లక్షల ఉద్యోగాలు, రూ. 3 వేల నిరుద్యోగ భృతి అంటూ 'యువగళం' పేరుతో 'వంచన గళం' వినిపించి యువతను మోసం చేశారు. విద్యాశాఖను గాలికొదిలేసి, పరిశ్రమల శాఖ మంత్రిని డమ్మీ చేసి బిజినెస్ సమ్మిట్ల పేరుతో లోకేష్ పెత్తనం చెలాయిస్తున్నారు.

స్థానిక ఎన్నికల్లో రక్తపాతం.. టెలీ కాన్ఫరెన్సులతో అక్రమాల పాఠాలు: 
రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం గూండాలు, పోలీసులు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకుంటూ దాడులు చేసి రక్తపాతం సృష్టిస్తున్నారు. గుడివాడలో అఫిడవిట్లు పూర్తిగా ఖాళీగా ఉన్న టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఆమోదించి నిబంధనలకు తూట్లు పొడిచారు. కౌంటింగ్ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలీసులతో బయటకు గెంటేసి, గెలిచిన అభ్యర్థుల ఓట్లను ఇన్వాలిడ్ చేసి టీడీపీ గెలిచినట్లు ప్రకటించుకుంటున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, డిపాజిట్లు కూడా దక్కవని భయపడే చంద్రబాబు టెలీ కాన్ఫరెన్సుల పేరుతో గూండాలను హైర్ చేసుకోవాలని, ప్యాకేజీలతో ఏకగ్రీవాలు చేయాలని పార్టీ శ్రేణులకు అక్రమాల పాఠాలు నేర్పుతున్నారు.

కుటుంబ బంధాలపై చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదు: 
తల్లికి, చెల్లికి అగౌరవం అంటూ చంద్రబాబు నీతులు చెబుతున్నారని... పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి, తోడల్లుడిని నట్టేట ముంచిన చరిత్ర ఉన్న చంద్రబాబుకు కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత ఉందా? అసలు ఏనాడైనా చంద్రబాబు తన తల్లితో, చెల్లితో, తమ్ముడితో కలిసి ఉన్నారా?,  మీ తల్లి పేరు మీద ఉన్న ఐదెకరాలను మీ అబ్బాయి పేరు మీద రాయించుకున్నారు తప్ప, మీ తమ్ముడికి ఏనాడైనా ఆస్తిలో వాటా ఇచ్చారా?  
     మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్‌ను వైఎస్సార్‌సీపీ గెలిచినా, డబ్బు ఎరవేసి సభ్యులను కొనుగోలు చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని..ఇలాంటి దుర్మార్గపు చరిత్ర ఉన్న చంద్రబాబు పాలకుడిగా ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టమని పేర్ని నాని మండిపడ్డారు. కాగా క్యాంపు రాజకీయాలు వద్దని, ప్రలోభాలకు లొంగి ఎవరైనా వెళ్తే వదిలేయాలన్న శ్రీ వైఎస్ జగన్, ఎప్పుడూ విలువలతో కూడన రాజకీయం చేశారని గుర్తు చేశారు.

Back to Top