పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే..రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏం చేస్తోంది? 

  నామినేషన్లను అడ్డుకుని లాఠీచార్జ్‌లు, హౌస్‌ అరెస్టులు చేస్తున్న పోలీసులపై చర్యలేవీ?

 వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఫైర్ 

విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో అధికారుల‌కు పంచాయతీ ఎన్నికల్లో చోటుచేసుకుంటున్న అప్రజాస్వామిక ఘటనలపై వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఆధారాలతో వినతిపత్రం అందజేశారు. అనంతరం అక్కడే మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి, లీగ‌ల్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు మ‌నోహ‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

 పంచాయతీ ఎన్నికల్లో కూటమి నేతలు వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారుల నామినేషన్లు అడ్డుకున్నారు

 పులివెందుల, రాయచోటి, పెదకూరపాడు, పుంగనూరులో యథేచ్ఛగా దాడులకు తెగబడ్డారు

 కూటమి నేతలకు పోలీసులు అండగా నిలిచి లాఠీచార్జ్‌లు, హౌస్‌ అరెస్టులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నా..  ఎన్నికల కమిషన్‌ నో యాక్షన్‌

 పులివెందులలో 119 పంచాయతీల నామినేషన్ల ప్రక్రియపై ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక దృష్టి పెట్టాలి

 నామినేషన్లు వేసే అభ్యర్థులకు పోలీసు భద్రతతో పూర్తి రక్షణ కల్పించాలి

 క్షేత్రస్థాయిలో ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు అమలవుతున్నాయో స్వయంగా పరిశీలించాలి

 పోలీసులు, రెవెన్యూ అధికారుల నివేదికలకే పరిమితం కాకుండా స్వతంత్ర పరిశీలకులను నియమించాలి

 ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యాన్ని, నిష్పక్షపాతాన్ని కాపాడేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సమర్థంగా వ్యవహరించాలి

 మీడియా స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు డిమాండ్‌

విజ‌య‌వాడ: పంచాయతీ ఎన్నికల్లో కూట‌మి నేత‌లు నామినేషన్లు వేయకుండా వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారులను అడ్డుకోవడం, దాడులకు పాల్పడటం, పోలీసులు లాఠీచార్జ్‌లు, హౌస్‌ అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. పులివెందుల, రాయచోటి, పెదకూరపాడు, పుంగనూరు తదితర ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించిన ఆధారాలతో విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేసి, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్‌ నాగిరెడ్డి, లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయని పోలీసు, అధికారులపై చర్యలు తీసుకోకపోతే ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. 
మీడియాతో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఏమ‌న్నారంటే..

- ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు: మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే

 మొదటి దశ నుంచే పంచాయతీ ఎన్నికల్లో జరుగుతున్న అప్రజాస్వామిక ఘటనలపై మేము ప్రతిరోజూ ఎన్నికల కమిషన్‌కు ఆధారాలతో ఫిర్యాదులు ఇస్తూనే ఉన్నాం. అయినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేల అండతో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, గ్రామాల్లో ఘర్షణలకు తెరతీయడం కొనసాగుతోంది. పల్లెల్లో పచ్చదనం పోయి రౌడీయిజం వచ్చింది. ప్రజలు దౌర్జన్యాలకు, పోలీసుల దాష్టికానికి గురవుతున్నారు. 

- పులివెందుల నుంచి పెదకూరపాడు వరకు అదే తంతు

 రెండో దశలో పులివెందులలో హింస, రౌడీయిజం, హౌస్‌ అరెస్టులపై వీడియో ఆధారాలతో ఫిర్యాదు చేశాం. పులివెందులలో బీటెక్‌ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి వర్గాలు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నా అక్కడి అధికారులు ఏం చేస్తున్నారు? ఒక మండలంలో 17 పంచాయతీలు ఉంటే ఐదు పంచాయతీల్లో మాత్రమే నామినేషన్లు వేయగలిగిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పెదకూరపాడులో మహిళలపై పోలీసులు లాఠీచార్జ్‌ చేసిన దృశ్యాలు కూడా ఉన్నాయి. రైతు నాయకుడు ప్రసాద్‌రెడ్డిపై దాడి జరిగింది. వైయ‌స్ఆర్‌సీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేస్తూ, అడ్డుకునే వారిని మాత్రం స్వేచ్ఛగా వదిలేయడం ఏ న్యాయం? ఎక్కడ నామినేషన్లు అడ్డుకున్నారో అక్కడ రేపు పోలీసు భద్రతతో నామినేషన్లు వేయించాలి. 

- పోలీసుల తీరుపై స్వతంత్ర పరిశీలన అవసరం: ఎం. మనోహర్‌రెడ్డి, లీగ‌ల్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు

ఎన్నికల కమిషన్‌ మాటలను కింది స్థాయి పోలీసు అధికారులు,  ఎన్నిక‌ల అధికారులు పట్టించుకోవడం లేదనేది మా ప్రధాన సమస్య. ఇది కేవలం మాట కాదు.. ఆధారాలతో చెబుతున్నాం. పోలీసు, ఎస్పీ, కలెక్టర్‌ నివేదికలపైనే ఆధారపడకుండా ఎన్నికల కమిషన్‌ స్వయంగా పరిశీలించాలి. స్వతంత్ర దర్యాప్తు బృందాలు లేదా ఎన్నికల పరిశీలకులను నియమించి ఎక్కడ అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారో తేల్చాలి. బాధ్యులైన ఎస్పీలు, డీజీపీ స్థాయి అధికారులపై చర్యలు తీసుకుని ఎన్నికల విధులకు దూరం చేయాలి. రెండో దశలో మిగిలిన నామినేషన్‌ రోజుల్లో అన్ని కేంద్రాల్లో స్వేచ్ఛగా నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలి. 

- ఎన్నికల ప్రక్రియపై నమ్మకం నిలబెట్టాలి

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం ప్రతి అభ్యర్థి హక్కు. ఆ హక్కును అడ్డుకునేలా నామినేషన్ల దశలోనే దౌర్జన్యాలు, హౌస్‌ అరెస్టులు, లాఠీచార్జ్‌లు చోటుచేసుకుంటే ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది? ఇప్పటికే ఫిర్యాదులు, వీడియో ఆధారాలు ఎన్నికల కమిషన్‌ దృష్టికి వెళ్లాయి. కాబట్టి క్షేత్రస్థాయిలో పరిస్థితిని స్వయంగా పరిశీలించి, నామినేషన్లు అడ్డుకున్న ప్రాంతాల్లో పోలీసు భద్రత కల్పించి ప్రక్రియను పూర్తి చేయాలి. ప్రజాస్వామ్య ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తన స్వతంత్రతను చాటుకోవాలి.

- రేపటిలోగా పరిస్థితిని సరిచేయాలి: ఎంవీఎస్ నాగిరెడ్డి, వైయ‌స్సార్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి(రైతు విభాగం)

ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. కానీ ఆ చర్యలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఈరోజు కూడా ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామంలో సమస్య జరుగుతుందో స్పష్టమైన ఆధారాలతో ఇచ్చాం. నామినేషన్‌ వేసే అభ్యర్థులను పోలీసు భద్రతతో కేంద్రానికి తీసుకెళ్లి నామినేషన్లు వేయించాలి. నామినేషన్‌ కూడా వేయలేని పరిస్థితి ఉంటే ప్రజాస్వామ్యం మొత్తం ఖూనీ అవుతుంది. రేపటిలోగా పరిస్థితిని సరిచేయాలి. లేకపోతే ప్రజలతో కలిసి మేము తదుపరి కార్యాచరణలోకి వెళ్లాల్సి వస్తుంది. 

ఎస్ఈసీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన వారిలో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు కల్పలత,  రమేష్‌యాదవ్, గ్రీవెన్స్‌ సెల్ అధ్య‌క్షుడు నారాయణమూర్తి, బూత్‌ కమిటీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, రైతు విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వంగల భరత్‌కుమార్‌రెడ్డి, బొందిలి విభాగం నేత నరేందర్‌సింగ్‌, ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ యోహాన్‌రాజు ఉన్నారు.

Back to Top