తిరుపతి: రామోజీరావు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం దారుణమని వైయస్ఆర్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చేసిన సేవలకు పరిహారంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. పత్రికను అడ్డుపెట్టుకుని తనకు నచ్చని వారిపై విషం చిమ్మిన వ్యక్తి పుట్టినరోజును రాష్ట్ర పండుగగా నిర్వహించడం అత్యంత హేయమైన చర్య అన్నారు. జర్నలిజం విలువలకు విరుద్ధం రామోజీరావు ఐదు దశాబ్దాలుగా తన పత్రికను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారని భూమన పేర్కొన్నారు. అహంకారపూరిత చర్యలను ప్రశ్నించిన జర్నలిస్టులపై దాడులు చేయించారని, రామోజీ ఫిల్మ్‌సిటీ పేరుతో వేల ఎకరాలు ఆక్రమించుకున్నారని విమర్శించారు. పత్రికను అడ్డుపెట్టుకుని భారీగా ఆస్తులు సంపాదించిన వ్యక్తి జన్మదినాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనన్నారు. రామోజీ పండుగ అంటే దుర్దినమే “రాక్షసుల సంహారాన్ని పండుగగా చేసుకుంటున్నాం. ఇక రాక్షసుల పుట్టినరోజులను కూడా పండుగలుగా చేసుకునే పరిస్థితి వస్తుంది. రామోజీరావు జన్మదినాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం అంటే నరకాసుర, మహిషాసుర, దుశ్శాసన జయంతులను కూడా ప్రకటించినట్టే” అని భూమన కరుణాకరరెడ్డి వ్యాఖ్యానించారు. 1995లో ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే, రామోజీరావు పెన్నుపోటు పొడిచారని భూమన అన్నారు. నార్ల వెంకటేశ్వరరావు, కాశీనాధుని నాగేశ్వరరావు, ఏబీకే వెంకటేశ్వరరావు వంటి జర్నలిస్టులు కాపాడిన పత్రికా విలువలను రామోజీరావు దిగజార్చారని విమర్శించారు. తెలుగు ప్రజలు, తెలుగు జర్నలిజం పట్ల గౌరవం తగ్గేలా వ్యవహరించిన వ్యక్తి జయంతిని రాష్ట్ర పండుగగా చేయడం కంటే దుర్దినం మరొకటి లేదన్నారు.