కర్నూలు జిల్లా: కోడుమూరు మండల పరిషత్ అధ్యక్ష పదవిని వైయస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి రఘునాథరెడ్డి ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైయస్ఆర్‌సీపీకి 11 మంది ఎంపీటీసీలు మద్దతు ఇవ్వగా, టీడీపీకి 9 మంది ఎంపీటీసీలు మద్దతు పలికారు. మాజీ ఇన్‌చార్జి, మాజీ కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో ఈ విజయం సాధించింది. ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు: డాక్టర్ ఆదిమూలపు సతీష్, వైయస్ఆర్‌సీపీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త “ఈ విజయాన్ని అందించిన కోడుమూరు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ప్రతి కార్యకర్తకు పేరుపేరునా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జిల్లాలో మరో ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి గారి నాయకత్వానికి గీటురాయిగా భావిస్తున్నాం. ఈ విజయంలో ప్రతి కార్యకర్త కృషి ఉంది. జగనన్న చెప్పినట్టు 2.0లో ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది. ఎంతో ప్రేమతో పిలుచుకున్న మా రఘన్న జెడ్పీటీసీ స్థానం నుంచి మళ్లీ ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉంది. నూతనంగా ఎన్నికైన ఎంపీపీ రఘునాథరెడ్డితో పాటు ఎంపీటీసీలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మండల కన్వీనర్ రమేష్ అన్న, సర్పంచ్ అభ్యర్థి ప్రవీణ్ , శ్రీనివాస్‌రెడ్డి తో పాటు ప్రతి ఒక్కరి కృషి ఉంది. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కూడా న్యాయంగా, ఎలాంటి దౌర్జన్యం లేకుండా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. ప్రజల తీర్పు వైయస్ఆర్‌సీపీ పక్షానే.. “ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరగకపోయినా ప్రజలు ఎంతో ఉత్సాహంగా వైయస్ఆర్‌సీపీకి అండగా నిలిచారు. రఘన్న చెప్పినట్టుగా అవినీతికి తావులేకుండా, కోట్ల కుటుంబానికి మచ్చ రాకుండా, వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పడం హర్షణీయం. మిగిలిన మండలాల్లో కూడా మేము గెలిచినట్టే భావిస్తున్నాం. దౌర్జన్యంతో, అప్రజాస్వామికంగా జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో మేము వెనుకబడాల్సి వచ్చింది. ప్రజల తీర్పు మాత్రం కోడుమూరు నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ పక్షానే ఉంది. ఈ బాధ్యతను స్వీకరించి ప్రజల పక్షాన పోరాడతాం. ప్రజలకు అర్ధరాత్రి పిలిచినా అందుబాటులో ఉండే హర్షన్న సారథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోడుమూరులో వైయస్ఆర్‌సీపీ విజయం సాధించబోతోంది. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి ప్రవీణ్ అన్నకు విజయం చేకూర్చాలి.” 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదు: కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి “స్థానిక సంస్థల ఎన్నికల్లో గత నెల, నెలన్నరగా జరుగుతున్న పరిస్థితులను చూస్తే.. ఈరోజు కోడుమూరు మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక మా రాజకీయ జీవితంలో మరచిపోలేని రోజు. 30, 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం. మా నాన్న, పెద్దనాన్నలు కూడా రాజకీయాలు చేశారు. కానీ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాజకీయాలు చేయాల్సి వస్తుందని అనుకోలేదు. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్ వేసిన మొదటి క్షణం నుంచి ఈరోజు ఎంపీపీ ఎన్నిక పూర్తయ్యే వరకు ఎన్నో వేధింపులు, ప్రలోభాలు, అధికారుల ద్వారా బెదిరింపులు ఎదురయ్యాయి. సామాన్య రైతులను కూడా ఇబ్బందులకు గురిచేసి, టీడీపీకి ఓటు వేస్తేనే పొలాలకు నీళ్లు ఇస్తామనే పరిస్థితులు సృష్టించారు. అయినా వీటన్నింటినీ ఎదుర్కొని ప్రజలు వైయస్ఆర్‌సీపీకి అండగా నిలబడి కోడుమూరును వైయస్ఆర్‌సీపీ కంచుకోటగా నిరూపించారు.” 62 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేశాం “ఎన్ని బెదిరింపులు, ప్రలోభాలు వచ్చినా మా కార్యకర్తలు ప్రతి గ్రామంలో నామినేషన్లు వేశారు. నియోజకవర్గంలో దాదాపు 67 ఎంపీటీసీ స్థానాలు ఉంటే 62 స్థానాల్లో మా అభ్యర్థులు చివరి వరకు పోటీలో నిలిచారు. కొన్ని గ్రామాల్లో బెదిరించి, భయపెట్టి, డబ్బులు ఇచ్చి కొంతమందితో ఉపసంహరణ చేయించారు. అధికార పార్టీ దౌర్జన్యం చేయడం సాధారణంగా చూశాం. కానీ ఇక్కడ అధికార యంత్రాంగంతోనే దౌర్జన్యం చేయించి ఎన్నికలను ఏకపక్షంగా మార్చాలని చూశారు. అయినా బెలగల్ మండలంలో 16 స్థానాలకు గాను వైయస్ఆర్‌సీపీ ఏడు స్థానాలు గెలుచుకుంది. టీడీపీ తొమ్మిది స్థానాలు గెలిచింది. రెండు, మూడు చోట్ల కౌంటింగ్‌లో కూడా అక్రమాలు జరిగాయి.” అధికారులకు హెచ్చరిక “అధికారులకు ఒకటే చెబుతున్నా. మీరు చేసిన దుర్మార్గాల వల్ల ఎన్నో ఆశలతో పోటీ చేసిన అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లారు. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇదే పరిస్థితి రేపు మీకు ఎదురైతే ఆ ఒకటి, రెండు సీట్లు కూడా రావు. ఎన్నికల్లో మా కుటుంబానికి, మా పార్టీకి, మాకు సహకరించిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.” రాబోయే సర్పంచ్ ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యం “ఈరోజు రఘునాథరెడ్డి ఎంపీపీగా గెలిచిన స్ఫూర్తితో ప్రతి గ్రామంలోనూ మనం గెలిచే పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ దౌర్జన్యాలు, అకృత్యాలను ఎదుర్కొని మనం నిలబడాలి. ఇంకో రెండు సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. కళ్లుమూసి తెరిచేలోపు ఆ సమయం పూర్తవుతుంది. వచ్చేది మన టైమే. జగన్మోహన్‌రెడ్డి గారు మనందరికీ భరోసా ఇచ్చారు. టీడీపీ చేసిన, చేస్తున్న తప్పులను మన అధికారం వచ్చిన తర్వాత సమర్థవంతంగా తిప్పికొడదాం. ఏ ఒక్క కార్యకర్తా భయపడాల్సిన అవసరం లేదు, నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ముందుండి వైయస్ఆర్‌సీపీ జెండాను, ప్రజల్లో ఉన్న స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి” అని కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు.