పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజాస్వామ్యం ఖూనీ

హైకోర్టు ఆదేశాల్నీ లెక్కచేయని పోలీసులు

ఎన్ని దాడులు చేసినా వెనక్కి తగ్గేది లేదు

తేల్చిచెప్పిన వైఎస్సార్సీపీ నేతలు 

స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుంటున్న తీరుపై విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు రమేశ్ యాదవ్, కల్పలతా రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు.
ఎస్ఈసీ కి వినతి పత్రం అందజేసిన తర్వాత ఆ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీలు రమేశ్ యాదవ్, కల్పలతా రెడ్డి.

విజయవాడ:      రెండో విడత పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్లు వేసే వారికి ఎస్కార్ట్ సాయంతో భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేసాలున్నా.. కేవలం సర్పంచ్ లకు ఎస్కార్ట్ ఇచ్చి, వార్డు మెంబర్లను పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ నేతలు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా పోలీసులు హైకోర్టు ఆదేశాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని వారు ఎస్ఈసీని కోరారు.  
అనంతరం మీడియాతో మాట్లాడుతూ వారేమన్నారంటే..:

పంచాయతీ ఎన్నికల రెండో విడతలోనూ అదే తీరు 
:రమేశ్ యాదవ్, ఎమ్మెల్సీ .

     రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి నారా వారి రక్తచరిత్ర మళ్లీ మొదలైంది. ఎన్నికల్లో నిలబడి గెలవలేం, ప్రభుత్వంలో ఉన్నా ఓడిపోయేలా ఉన్నాం, ప్రజలకు ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు, ఎప్పట్లాగే ప్రజలకు వెన్నుపోటు పొడిచాం, పోలీసు వ్యవస్థ అండలేకపోతే ప్రజలు ఘోరంగా ఓడిస్తారనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ ఎన్నికల్ని అడ్డుకుంటున్నారు. టీడీపీ అభ్యర్ధులు ఇంట్లో కూర్చోండి, వైఎస్సార్సీపీ సానుభూతిపరులు నామినేషన్ వేయడానికి వస్తే రాళ్లు, కట్టెలతో దాడులు చేయండి, అవసరమైతే చంపేయాలని, ఏదైనా కేసులైతే మేం చూసుకుంటాం అని నిస్సిగ్గుగా చంద్రబాబు తన గూండాలకు చెప్తున్నారు. స్థానిక ఎన్నికలు మొదలైనప్పటి నుంచీ వీళ్లు అక్రమాలు చేయడం, మమ్మల్ని కొట్టడం, దౌర్జన్యాలు చేయడం, ఎస్ఈసీకి మేం ఫిర్యాదులు చేసుకోవడం, ఆయన స్పందించకపోవడం జరుగుతూనే ఉంది. మేం తెగించి నామినేషన్ వేసేందుకు వెళ్తే అక్రమ కేసులు పెట్టి హౌస్ అరెస్టులు చేస్తున్నారు. పులివెందులలో అయితే ఈ హింస మరీ దారుణంగా జరుగుతోంది. దీనిపై హైకోర్టును మేం ఆశ్రయిస్తే.. కచ్చితంగా ఎస్కార్ట్ ఇచ్చి నామినేషన్లు వేయించాలని ఆదేశాలు ఇచ్చింది. అయినా మా వేంపల్లెలో సర్పంచ్ లను మాత్రమే తీసుకెళ్లి నామినేషన్లు వేయించి, వార్డు మెంబర్లు లేరని చెప్పి భద్రత ఇవ్వడం లేదు. 

హైకోర్టూ ఆదేశాల్నీ లెక్కచేయట్లేదు: 
ఇవాళ పోలీసుల ముందే నామినేషన్ కేంద్రాల్లోకి వెళ్లి వేంపల్లె సర్పంచ్ నామినేషన్ పత్రాలు చించేందుకు ప్రయత్నిస్తే అధికారులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ గూండాలు వారి కంప్యూటర్లు, ప్రింటర్లు ధ్వంసం చేశారు. మీరు నిజంగానే ప్రజలకు మేలు చేశామనుకుంటే ఎందుకు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించలేకపోతున్నారు. గూండాలన్ని పెట్టుకుని నామినేషన్లు వేసే అభ్యర్ధుల తలలు పగులగొట్టి, ఇళ్లలో కూర్చోబెట్టి ఎన్నికలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని వెన్నుపోటు పార్టీ నాయకుల్ని అడుగుతున్నాం. మీరు ఎప్పటిలాగే ఓ జీవో ఇచ్చి, మా వెన్నుపోటు పార్టీ నాయకులే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మేయర్, మున్సిపల్ ఛైర్మన్లుగా గెలిచారని ఆదేశాలు ఇచ్చేసుకుంటే సరిపోతుంది కదా. దానికి బదులు పోలీసుల అండతో ఈ దౌర్జన్యాలు ఎందుకు? పులివెందులలో వైఎస్సార్సీపీకి చెందిన సమ్ముటూరు ప్రసాదరెడ్డి గారు నామినేషన్ వేయడానికి వెళ్తే నామినేషన్ కేంద్రం బయటికి పంపించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ది ఉంటే పోలీసులకు మీరు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వలేరా ? చిత్తూరు జిల్లా పుంగనూరులో, పల్నాడు జిల్లా, దర్శి నియోజకవర్గంలో, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గూడూరు, కావలిలో ఘోరాతిఘోరంగా మా నాయకుల్ని ఇళ్లలో నుంచి బయటకు రానివ్వని పరిస్ధితులు ఉన్నాయి. దీనిపై అన్ని అధారాలతో ఎస్ఈసీని కలిసి వినతిపత్రం ఇచ్చాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, టీడీపీ గూండాలతో దాడులు చేయించినా మేం వెనకడుగు వేసే పరిస్ధితి లేదు. ప్రజల్లోకి వెళ్లి మేమేంటో ప్రజలకు చూపిస్తాం. 

మా అభ్యర్ధులంతా నామినేషన్లు వేసే వరకూ తగ్గేది లేదు. 
:కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ

     ఇవాళ పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్లు, జడ్పీ ఛైర్మన్ ఎన్నికలు స్వేచ్ఛగా జరిపించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిశాం. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై వినతిపత్రం ఇచ్చాం. ఇవాళ రాష్ట్రంలో చాలా చోట్ల సమస్యలు వస్తున్నాయి. వాటిపై ఆధారాలు సమర్పించాం. మేం దాదాపు ప్రతీరోజూ ఎస్ఈసీని కలుస్తూనే ఉన్నాం. వినతిపత్రాలు ఇస్తున్నాం. ఎన్నికల కమిషన్ జిల్లా అధికారుల్ని ఫోన్ చేసి ప్రశ్నిస్తే అంతా బావుందని చెప్పేస్తున్నారు. అంతా బావుంటే ప్రతీ రోజూ ఇన్ని సమస్యలు ఎందుకు వస్తాయి, ఈరోజు ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసు వ్యవస్థ అంతా కూల్ గా జరుగుతుందని చెప్పడం దారుణం. ఓవైపు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభ్యర్ధులు ఇబ్బందులు పడుతుంటే, నామినేషన్లు వేయలేకపోతుంటే, వాళ్ల ఆస్తులు ధ్వంసం చేస్తుంటే అంతా కూల్ గా ఉందని చెప్పడం దారుణంగా ఉంది. పులివెందుల, వేంపల్లెతో పాటు ఆళ్లగడ్డ, శింగనమలలో చాలా ఘటనలు చోటు చేసుకున్నాయి. వేంపల్లెలో నామినేషన్ కు వెళ్తే సర్పంచ్ లకు ఎస్కార్ట్ ఇచ్చి వార్డు మెంబర్లను పట్టించుకోలేదు. ఆ విధంగా హైకోర్టు ఆదేశాల్నీ పట్టించుకోవడం లేదు. కోర్టు వార్డు మెంబర్లకూ ఎస్కార్ట్ ఇవ్వాలని ప్రత్యేకంగా చెప్పాలా ? నామినేషన్లు వేయడానికి వచ్చే వారికి భద్రత కల్పించడం అధికారులు, పోలీసుల బాధ్యత. చిన్న చిన్న కారణాలతో తొలి దశలో నామినేషన్లు తిరస్కరించారు, ఇప్పుడు రెండో దశలోనూ అలాంటి కారణాలు చూపించేందుకు సిద్దంగా ఉన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్ధులు పోటీలో ఉంటే ఓడిపోతామనే భయంతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. మా అభ్యర్ధులంతా నామినేషన్లు వేసే వరకూ మేం ఎన్నికల కమిషన్ ను ఆశ్రయిస్తూనే ఉంటాం.

Back to Top