విజయవాడ: రాజ్యాంగ దినోత్సవం రోజున కూడా రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో రాజ్యాంగ ఉల్లంఘనలు ఆగకపోవడంపై వైయస్ఆర్సీపీ నేతలు మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు ఇవాళ మరోసారి విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికల తొలిదశ, మున్సిపల్ ఎన్నికల రెండో దశ పోలింగ్ లోనూ కూటమి పార్టీలు పోలీసుల సాయంతో దౌర్జన్యాల్ని, దాడుల్ని నిరాంటంకంగా కొనసాగించాయని, అయినా ఎస్ఈసీ మాత్రం చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండిపోయిందని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా ఎస్ఈసీ స్పందించి అక్రమాలు జరిగిన చోట రీపోలింగ్ నిర్వహించడంతో పాటు మిగిలిన ఎన్నికల్ని అయినా స్వేచ్ఛగా నిర్వహించాలని కోరారు. ప్రెస్ మీట్లో నేతలు ఏమన్నారంటే.. అక్రమాలు జరిగిన చోట రీపోలింగ్ పెట్టాల్సిందే : మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే రాజ్యాంగాన్ని, ఎన్నికల ప్రవర్తన నియామళి అమలు కావడం లేదని ఎస్ఈసీకి మరోసారి ఫిర్యాదు చేశాం. ఇప్పటివరకూ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే ఎక్కడా వారిపై చర్యలు తీసుకోలేదు. ఎస్ఈసీ అన్నీ కళ్లప్పగించి చూస్తున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదు. మొదటి దశ మున్సిపల్ ఎన్నికల్లో బూత్ ల ఆక్రమణ, ఏజెంట్లను అనుమతించని ఘటనలు, ఫేక్ ఓటర్ కార్డులు తెచ్చిన వ్యవహారాలపై ఇప్పటికే ఆధారాలతో ఫిర్యాదు చేశాం, ఆయా చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని వైయస్ఆర్సీపీతరఫున ఎస్ఈసీని డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగ దినోత్సవం రోజునా ఆగని ఆక్రమాలు :టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే అదే రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది. ఎస్ఈసీ రాజ్యాంగ సంస్థ. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఏమీ చంద్రబాబు అసిస్టెంట్ కాదు, ఎస్ఈసీ కార్యదర్శి ఏమీ చంద్రబాబుు ప్యూన్ కాదు. అక్కడున్న ఐజీ గారు కూడా తెలుగుదేశం కార్యకర్త ఏమీ కాదు. రాష్ట్రంలో పాలన టీడీపీ నేతల చేతుల్లో ఉన్నా, అధికారులు టీడీపీ చెప్పుచేతల్లో ఉన్నా..ఎస్ఈసీ మాత్రం టీడీపీ ఆధీనంలో లేదు. కానీ మన రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ టీడీపీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల్ని గెలిపించడానికి పనిచేస్తున్నట్లు మేం ఎన్నో సాక్ష్యాలు బయటపెట్టాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల కమిషన్ కు వినతిపత్రాలు సమర్పిస్తూనే వచ్చాం. అయినా ఈ రోజూ వరకూ ఏ ఒక్క అధికారిపై అయినా చర్య తీసుకుందా?, పునేఠా గతంలో చంద్రబాబు దగ్గర సీఎస్ గా నమ్మకంగా పనిచేసారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మేం ఎన్నో ఉదాహరణలు చూపిస్తున్నాం. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ మంత్రి, మా పార్టీ ఏజెంట్ గా ఉన్న ధర్మాన ప్రసాదరావు గారిని అడ్డుకున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ధర్మాన అక్కడికి వెళ్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని ఆపేశారని చెప్తున్నారు. అంటే ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణలో పూర్తిగా విఫలమైంది. శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైంది. చంద్రబాబు ఆదేశాల్ని అమలు చేసే మట్టిబొమ్మల్లా ఎస్ఈసీ అధికారులు ఇక్కడ కూర్చొన్నారు. ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదులు చేస్తున్న మా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు. అంటే అరెస్టులతో ప్రశ్నించే గొంతుల్ని నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మీకూ, మాకూ మధ్య మిగిలి ఉంది 700 రోజులే. మమ్మల్ని బాధపెట్టిన అధికారుల పేర్లు మర్చిపోకుండా మాకు జ్ఞాపకశక్తి ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాం. కూటమికి ఇదీ ఓ గెలుపేనా ? : కల్పలతా రెడ్డి, ఎమ్మెల్సీ పంచాయతీ ఎన్నికల తొలిదశ, మున్సిపల్ ఎన్నికల రెండో దశ ఎన్నికల్ని రాజ్యాంగ దినోత్సవం రోజైనా రాజ్యాంగ బద్దంగా జరిపించమని ఎస్ఈసీని కోరాం. అయినా ఎక్కడా ఎన్నికలు రాజ్యాంగ బద్దంగా నిర్వహించలేకపోయారు. వైయస్ఆర్సీపీ అభ్యర్ధుల ఏజెంట్లను బూత్ లలో నుంచి లాక్కొచ్చి, బూత్ లలో రిగ్గింగ్ కు పాల్పడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంట లోపే పోలింగ్ శాతం అంత ఎక్కువగా ఉందంటే రిగ్గింగ్ చేసుకున్నట్లే కదా. మీరు ఓడిపోతారని తెలిసే ఈ దారుణాలకు పాల్పడ్డారు. ఓటింగ్ జరిగితే కచ్చితంగా ఓడిపోతారని తెలిసే మా అభ్యర్ధుల్ని కొట్టారు, హౌస్ అరెస్టులు చేశారు. శ్రీకాకుళంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారిని జనరల్ ఏజెంట్ గా ప్రకటించాక కూడా తిరిగి ఆయన జనరల్ ఏజెంట్ గా ఉండకూడదంటూ హౌస్ అరెస్టు చేశారు. మిగతా చోట్ల కూడా ఇలాగే హౌస్ అరెస్టులు చేశారు. మంగళగిరిలో కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడ చూసినా ఇదే పరిస్ధితి. ఇలాంటి పరిస్ధితుల్ని నియంత్రించాలని ఎస్ఈసీని కోరుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండిపోయారు. మహిళలని కూడా చూడకుండా వాళ్లను దారుణంగా కొట్టారు. ఎక్కడా ఎన్నికలు న్యాయబద్దంగా జరగలేదు. అధికారం ఉంది కదా అని మా అభ్యర్ధుల్ని భయపెట్టి ఎన్నికలు జరిపించుకున్నారు. ఇది గెలుపని మీరు బలుపుగా తిరిగితే మాత్రం ప్రజలు కచ్చితంగా బుద్ధి చెప్తారు. 2029లో మళ్లీ మా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. పంచాయతీ ఎన్నికల్లో మిగిలిన రెండు దశల్లో అయినా ఎస్ఈసీ కచ్చితంగా అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.