తాడేపల్లి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలన సాగిందని, రాజ్యాంగం కల్పించిన సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చారని వైయస్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగుతోందని, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తూ రెడ్‌బుక్ విధానాలకు పెద్దపీట వేస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం, అంబేద్కర్ ఆశయాలను విస్మరించడం సరికాదని పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వైయస్ఆర్‌సీపీ నేతలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దేశానికి రాజ్యాంగాన్ని అందించడంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన విశిష్ట కృషిని స్మరించుకున్నారు. రాజ్యాంగం అందించిన సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ స్ఫూర్తితో ముందుకు సాగాలని నేతలు పేర్కొన్నారు. అనంతరం ఆయన చేసిన కృషిని నేతలు కొనియాడారు. వైయస్ఆర్‌సీపీ నేతలు ఎవరెవరు ఏమన్నారంటే.. - రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు: వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ మంత్రి కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని పక్కనపెట్టి నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పరిస్థితులు తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా పాలన సాగిస్తున్నారు. 2024 నుంచి అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రెడ్‌బుక్ విధానాలే అమలవుతున్నాయి. చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని ఒకసారి చదివి గౌరవించాలి. 2019–24 మధ్య శ్రీ వైయస్ జగన్ గారి పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలకు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా అవకాశాలు, పదవులు, రిజర్వేషన్లు కల్పించారు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పాలన తిరిగి రావాలంటే అది వైయస్ జగన్‌తోనే సాధ్యం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. - అంబేద్కర్ రాజ్యాంగమే దేశాభివృద్ధికి పునాది: మురుగుడి హనుమంతరావు, ఎమ్మెల్సీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగం దేశ భవిష్యత్తు, అభివృద్ధికి పునాది వేసింది. సరైన విద్య, సాగునీరు, తాగునీరు కూడా లేని నాటి పరిస్థితుల నుంచి దేశాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసే దిశగా పంచవర్ష ప్రణాళికలు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు ముందుకు వచ్చాయి. రిజర్వేషన్ల ద్వారా అట్టడుగున ఉన్న ప్రజలను పైకి తీసుకురావాలన్న అంబేద్కర్ ఆలోచన దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ప్రపంచంలో గుర్తింపు పొందిన దేశంగా భారత్ ఎదిగింది. అయితే ప్రస్తుతం ప్రాంతీయ తత్వాలు, రాజకీయ మార్పుల వల్ల దేశ భవిష్యత్తుకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలు తమ బాధ్యతను గుర్తించాలి. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని గౌరవిస్తూ దేశ అభివృద్ధి, రాజ్యాంగ స్ఫూర్తి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి. - అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూపించిన నాయకుడు వైయస్ జగన్: కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, విద్య, సామాజిక న్యాయం అందాలనే లక్ష్యంతో రాజ్యాంగాన్ని రచించారు. అట్టడుగున ఉన్న ప్రతి ఒక్కరినీ పైకి తీసుకురావడం, కులమత భేదాలు లేకుండా సమాన అవకాశాలు కల్పించడం ఆయన ఆశయం. వైయస్ జగన్ పాలనలో పేదలు, విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో చూపించారు. కానీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని పక్కనపెట్టి రాష్ట్రాన్ని అశాంతి, అరాచక పరిస్థితుల వైపు తీసుకెళ్తోంది. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సందర్శించారా? అంబేద్కర్ ఆశయాలను గౌరవిస్తూ పాలన సాగిస్తున్నామని చెప్పుకునే వారు కనీసం ఆయన విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారా?. - అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ స్ఫూర్తి నిలవాలంటే వైయస్ జగన్ నాయకత్వం మళ్లీ రావాలి : టీజేఆర్ సుధాకర్‌బాబు, వైయస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్‌లో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులుగా రెడ్‌బుక్ రాజ్యాంగం, పోలీసు రాజ్యాంగం నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కుల, కార్పొరేట్ ఆధిపత్యాన్ని పెంచే విధానాలతో ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు, దాడులు, నామినేషన్ల అడ్డగింతలు, ఓటర్లను భయపెట్టే చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీ వైయస్ జగన్ గారి పాలనలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, గ్రామస్వరాజ్యం, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, నాడు–నేడు, ఆస్పత్రులు, పోర్టుల వంటి కార్యక్రమాలతో అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూపించారు. విజయవాడలో వైయస్ జగన్ ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం వివక్ష కాదా? అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ స్ఫూర్తి నిలవాలంటే వైయస్ జగన్ నాయకత్వం మళ్లీ రావాలి. - చంద్రబాబు పాలనలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు : కొమ్మూరి కనకారావు, వైయస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు విభిన్న సంస్కృతులు, భాషలు, మతాలు, ప్రాంతాలతో కూడిన భారతదేశాన్ని ఒక్కటిగా నిలిపిన గొప్ప శక్తి రాజ్యాంగం. అంబేద్కర్ స్ఫూర్తితో రూపొందిన రాజ్యాంగం కళ్లముందే బలహీనపడుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థ, ఎన్నికల కమిషన్ వంటి సంస్థలను పక్కనపెట్టి ఎన్నికల్లో రెడ్‌బుక్ విధానాలను అమలు చేస్తున్నారు. కూటమి పాలనలో అట్టడుగు వర్గాల్లో అభద్రత పెరిగింది. వైయస్ జగన్ పాలనలో పేదలు, మహిళలు, రైతులకు విద్య, వైద్యం, ఆత్మగౌరవం లభించాయి. ఇప్పుడు రైతులు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. రాజ్యాంగాన్ని రక్షించి దానికి అర్థం తీసుకురావాలంటే ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ జగన్ తిరిగి రావాల్సిందే. అప్పుడే అంబేద్కర్ ఆశయాలకు నిజమైన గౌరవం లభిస్తుంది. - రాజ్యాంగం గాడిలో పడాలంటే వైయస్ జగన్ పాలన మళ్లీ రావాలి: నందిగం సురేష్, మాజీ ఎంపీ భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు సైతం గౌరవిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దాన్ని పక్కనపెట్టి విధ్వంసకర వాతావరణంతో పాలన సాగిస్తున్నారు. విజయవాడ నడిబొడ్డున వైయస్ జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్నో అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గకుండా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహంపై జరిగిన దాడులను ప్రజలు మర్చిపోలేదు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కనీసం 10 శాతం కూడా నెరవేర్చకుండా, ప్రశ్నించే ప్రజలపై దాడులు, కేసులు, బెదిరింపులు చేస్తోంది. స్థానిక ఎన్నికల్లో నామినేషన్ పత్రాలు చింపడం, అభ్యర్థులను కొట్టడం, మహిళలను సైతం బెదిరించడం వంటి ఘటనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో రాజ్యాంగం, శాంతిభద్రతలు, మహిళల రక్షణ తిరిగి గాడిలో పడాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కన్న కలలు నిజమవుతాయి. కార్యక్రమంలో గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి, ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి, అధికార ప్రతినిధులు నాగ మల్లేశ్వరి, బీవై రామయ్య, షరీఫ్, రాష్ట్ర నూర్ బాషా/దూదేకుల విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ దస్తగిరి, యోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు.