శావల్యాపురంలో అర్ధరాత్రి అరెస్టులు

పోలీస్‌స్టేషన్‌ ఎదుట గ్రామస్థుల నిరసన

పల్నాడు జిల్లా: శావల్యాపురం మండలం గుంటుపాలెం గ్రామంలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో సర్పంచ్‌ అభ్యర్థులు, వార్డు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై భాస్కర్‌నగర్‌ గ్రామస్థులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసన చేపట్టారు. బైండోవర్‌ కేసుల పేరుతో అభ్యర్థులను రాత్రివేళ అరెస్టు చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాత్రి సమయంలో ఇళ్లకు వెళ్లి మహిళలపై కూడా పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే ప్రజల్లో భయాందోళనలు కలిగించడం సరికాదని పేర్కొంటూ జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ వెంటనే స్పందించి ఘటనలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అంగలూరులో మీడియా ప్రతినిధులపై దాడి

అంగలూరు గ్రామంలో దొంగ ఓట్ల కోసం బయటి ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని చిత్రీకరిస్తున్న యూట్యూబ్‌ మీడియా ప్రతినిధులపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు.

వినుకొండ నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ నేత గుంటూరులోని సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి బౌన్సర్లను తీసుకొచ్చి ఘర్షణకు పాల్పడ్డారని బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోందని పేర్కొన్నారు.

ఈ ఘటనను అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, దాడికి పాల్పడిన వారికి పోలీసులు సహకరించారని బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు.

Back to Top