తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన బెంగళూరు ఇంటి నుంచి తాడేపల్లి ఇంటికి వస్తుంటే లెక్కలేసి వందోసారి అంటూ విష ప్రచారాలు చేస్తున్న ఈనాడు పత్రికాధిపతి కిరణ్ పై పార్టీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో ప్యాలెస్ లు కట్టుకున్న చంద్రబాబు, పచ్చళ్లు అమ్ముకుని కోట్లు సంపాదించిన రామోజీరావు గురించి కథనాలు రాస్తే ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకుంటారని యనమల నాగార్జున యాదవ్ ఈనాడు కిరణ్ కు తెలిపారు. అది మానేసి జగన్మోహన్ రెడ్డి గారిపై విష ప్రచారాలు చేస్తే చంద్రబాబు, ఈనాడు ఇద్దరి బండారాలు బయటపెట్టాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ప్రెస్ మీట్లో యనమల నాగార్జున యాదవ్ ఇంకా ఏమన్నారంటే.. - రోజురోజుకీ ఈనాడు దిగజారుడు కథనాలు ఆంధప్రదేశ్ రాష్ట్రంలో నేరుగా రాజకీయాలు చేయడం చంద్రబాబుకు రాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నడిచి గెలిచిన ముఖ్యమంత్రి అయితే, చంద్రబాబు పొడిచి అధికారం లాక్కున్న ముఖ్యమంత్రి. రాష్ట్రంలో కొన్ని చెత్త పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారిపై నిత్యం విషం కక్కడం చూస్తూనే ఉన్నాం. అచ్చంగా 420గానే పుట్టి, 420గానే ఎదిగి, చనిపోయిన వ్యక్తి రామోజీరావు అయితే ఆయన కుమారుడు కిరణ్ 840లా తయారయ్యాడు. కింద నలుపు, పైన ఎరుపు ఉండే గురివింద గింజను ఎలా పిలవాలని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏమైనా అనుమానాలు ఉంటే కిరణ్ ను చూసి తెలుసుకోవచ్చు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వందోసారి బెంగళూరు నుంచి తాడేపల్లికి అని ఈనాడు కిరణ్ ఇవాళ ఓ వార్త రాశాడు. ఆయన ఇంటికే ఆయన వెళ్లింది, ఎందుకింత తత్తరపాటు? మీ గురివింద గింజ నలుపు గుర్తుచేయకపోతే ఎదుటి వారి విలువ తెలియదు కాబట్టి మేం స్పందించాల్సి వస్తోంది. మిస్టర్ 840.. మీ తండ్రి గట్టున ఎగిరితే, నువ్వు చెరువున ఎగురుతున్నట్లున్నావ్. గతంలో చంద్రబాబు అధికారం కోల్పోయి, తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే వరకూ మొత్తం 1840 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కేవలం 183 రోజులు మాత్రమే. మిస్టర్ డబుల్ 420 కిరణ్.. బెంగళూరు నుంచి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటి నుంచి మరో ఇంటికి వస్తే చాలా బాధపడిపోతున్నావ్. మరి చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా కేవలం 183 రోజులు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఎందుకు వార్త రాయలేకపోయావ్? చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు కేవలం 183 రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉండగా.. అందులో తాను చేసిన పాపాలకు 53 రోజులు రాజమండ్రి జైలు స్నేహ బ్లాక్ లో ఉన్నాడు. - చంద్రబాబు అవినీతి ప్యాలెస్ లు ఈనాడుకు కనిపించవా? కిరణ్ కు మరో మానసిక రుగ్మత కూడా మీకు ఉంది. మీ తండ్రి నుంచి విలువలు, సంప్రదాయాలు మీకు రాలేదేమో కానీ ఆయనకు ఉన్న ఓ మానసిక రుగ్మత మాత్రం మీకు వచ్చింది. అది పక్కింట్లో ఏం కూర వండుకున్నారు, వాళ్లింట్లో ఏం గొడవలు ఉన్నాయి, వాళ్లింట్లో ఎన్ని బాత్ రూమ్ లు ఉన్నాయి, ఎన్నిసార్లు ఊడుస్తున్నారు ఇవన్నీ తెలుసుకోవాలనుకునే పైశాచిక మానసిక రుగ్మత ఉందని భావిస్తాం. అలాంటి మానసిక రుగ్మత నీకు వారసత్వంగా వచ్చినట్లుంది. లేకపోతే ప్యాలెస్ అంటూ ఆ రాతలేంటి ? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోని రెండున్నర ఎకరాల ప్రాంగణంలో సగం వైఎస్సార్సీపీ కార్యకలాపాలకు, మరో సగం ఆయన నివాసానికి వాడుకుంటుంటే, ప్యాలెస్ అని ఎలా రాస్తారు? కిరణ్ నీకు చంద్రబాబు కింద ఉన్న నలుపు కనిపించడం లేదా ? జగన్మోహన్ రెడ్డి గారికి ఇడుపులపాయలో, హైదరాబాద్, తాడేపల్లిలో ఉన్న నివాసాలన్నీ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మించుకున్నవే తప్ప చంద్రబాబులా అధికారంలో ఉన్నప్పుడు నిర్మించుకున్నవి కాదు. బెంగళూరులో ఉన్న ఇల్లు మాత్రమే ఇందుకు మినహాయింపు. కరకట్ట కొంపతో పాటు వెలగపూడిలో కడుతున్న అవినీతి అంతఃపురం అయినా మీరు అధికారంలో ఉన్నప్పుడు వచ్చినవేగా. జగన్మోహన్ రెడ్డి గారు విపక్షంలో ఉండగా ఇళ్లు కట్టుకుంటే, మీరు అధికారంలో ఉండగా అవినీతి సొమ్ముతో కట్టుకున్న ఇళ్లను మేం ఏమని పిలవాలి ? - హైదరాబాద్ లో ఈనాడు, చంద్రబాబుకు ఆస్తులెక్కడివి ? హైదరాబాద్ లో రామోజీరావు సైకిల్ తొక్కుతూ, చైన్ పడిపోతే, దానికి గ్రీజు కోసం రోశయ్య గారి ఇంటి ముందు వంగొని నీళ్లు పోసుకున్న సంగతి కిరణ్ కు తెలియదా ? ఢిల్లీలో మీరు వెలగబెట్టిన రాచకార్యాలు మీకు తెలియదా ? జగన్మోహన్ రెడ్డి గారి నివాసం రెండున్నర ఎకరాల్లో ఉంటే ప్యాలెస్ అంటున్న కిరణ్.. అమరావతిలో ఐదు ఎకరాల్లో చంద్రబాబు కట్టుకుంటున్న నిర్మాణాన్ని ఇంద్రభవనం అని పిలవాలా, చంద్ర భవనం అని పిలవాలా, లేక నీ స్థాయికి దిగజారి అవినీతి కొంప అనాలా? అలాగే లింగమనేని గిఫ్టుగా ఇచ్చిన కరకట్ట కొంపకు ప్రతిగా ఆయన భూముల్ని ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయించారు. కుప్పంలో చంద్రబాబు నివాసం రెండున్నర ఎకరాల్లో ఉంది. అమరావతిలో కట్టుకుంటున్న ఇల్లు, కుప్పంలో కట్టుకుంటున్న ఇల్లు, హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో వెయ్యి కోట్లతో కట్టుకున్న ఇల్లు, వీటికితోడు లింగమనేని నుంచి గిఫ్టుగా తీసుకున్న కరకట్ట కొంప ఉన్నాయిగా. వీటిపై మేం ఏం మాట్లాడాలి ? జూబ్లీహిల్స్ చంద్రబాబు ప్యాలెస్ లోకి వెళ్లిన నరమానవుడు ఎవరైనా ఉన్నారా ? హైదరాబాద్ లో హైటెక్ సిటీ, కొండాపూర్ మధ్యలో ఉన్న మదీనా గూడలో చంద్రబాబుకు ఉన్న ఐదున్నర ఎకరాల ఫాం హౌస్ ప్రస్తుతానికి నారా లోకేష్ పేరు మీద ఉంది. మేకలు మేపుకొనే ఆయన నానమ్మ అమ్మణ్ణమ్మ గారు హైటెక్ సిటీ ప్రాంతంలో ఐదున్నర ఎకరాలు కొని లోకేష్ కు గిఫ్ట్ డీడ్ లో రిజిస్టర్ చేసారంట. బంజారాహిల్స్ లో మరో భవనం కూడా ఇలాగే కొని, తర్వాత వేరే వ్యక్తికి అమ్మేసి, ఆ డబ్బులతో హైటెక్ సిటీలోనే మరో స్ధలం కొన్నారంట. పాల వ్యాపారం చేస్తే ఇలా కూడా లాభాలు వస్తాయా ? మేం కూడా చాలా పాల వ్యాపారాలు చేశాం. కానీ మేం ఇలాంటి స్థలాలు, భవనాలు కొనలేకపోయాం. చంద్రబాబు తల్లికి ఐదుగురు పిల్లలు ఉంటే ఆమె.. భర్త, మరిదితో కలిసి మేకలు మేపుకొంటూ పాలవ్యాపారంలో వచ్చిన డబ్బులతో లోకేష్ కు స్థలం గిఫ్ట్ గా ఇచ్చింది. కిరణ్ గింజ మీ కింద ఉన్న నలుపు ఇది. చంద్రబాబునో, ఆయన కుటుంబ సభ్యులను తక్కువ చేయాలనే ఉద్దేశం మాకు లేదు. మేం కూడా మధ్యతరగతి కుటుంబాల నుంచే వచ్చాం. కానీ నీ కింద ఉన్న నలుపు చూసుకోకుండా.. మా నాయకుడు బెంగళూరు నుంచి తాడేపల్లికి వస్తే వందోసారి అని లెక్కలేసుకుంటున్నావంటే సిగ్గుపడాలి. మనిషి పుట్టుక పుట్టిన వారెవరైనా ఇలాంటి జర్నలిజాన్ని ప్రోత్సహిస్తారా ? - విష ప్రచారాలు ఆపకపోతే మీ బండారం బయటపెడతాం 1988లో చంద్రబాబు నాయుడిని కర్షక పరిషత్ ఛైర్మన్ గా ఎన్టీఆర్ నియమిస్తే.. దాన్ని సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి చెంగల్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్లారు. దీనిపై స్పందిస్తూ.. నా కుటుంబం నుంచి విడిపోయాను, నేను, నా భార్య నాకు ఉన్న పొలంలో స్వయంగా వ్యవసాయం చేస్తూ ఏడాదికి 36 వేలు సంపాదిస్తున్నట్లు చంద్రబాబు హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో చెప్పారు. ఆ వ్యాపారాలతోనే ఇన్ని ఇంద్రభవనాలు, చంద్ర భవనాలు, మయసభలు ఎలా నిర్మించారో ఆ కిటుకు చంద్రబాబు చెప్తే.. ఈనాడు కిరణ్ తన పత్రిక పతాక శీర్షికలో రాస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు కదా. ఆ పాల వ్యాపారం, పన్నీరు వ్యాపారం గురించి మాకూ చెప్తే మేం కూడా చేస్తాం కదా. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి పోతాయి, మీ నివాసాలు మాత్రం గాల్లో పైపైకి పోతాయి. వెలగపూడిలో చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్న స్థలం దళితుల స్మశాన వాటిక కాదా, ముఖ్యమంత్రిగా ఉంటూ దళితుల స్మశానంలో ఇల్లు కట్టుకుంటున్నారు. మీ అవినీతి అంతఃపురాన్ని ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్స్ అనే సంస్థ దీన్ని పైసా తీసుకోకుండా ఊరికే నిర్మిస్తోంది. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ ను ఈ సంస్థకు ఇచ్చినందుకు క్విడ్ ప్రోకో కింద వెలగపూడి అవినీతి అంతఃపురాన్ని ఆ సంస్ద నిర్మిస్తోంది. సొంత నివాసాన్ని సైతం కమిషన్ డబ్బులకు కక్కుర్తి పడి నిర్మించుకుంటున్నారు. ఇంటీరియర్ సైతం సచివాలయ కాంట్రాక్టు తీసుకున్న జెనిసిస్ సంస్థతో చేయించుకుంటున్నారు. ఏమాత్రం సిగ్గు, శరం, మానం, మర్యాద లేకుండా అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇవన్నీ దాచేసి ఈనాడు కిరణ్.. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా కట్టుకున్న ఇళ్లకు తిరుగుతుంటే వేలం పాటల తరహాలో వందోసారి అంటూ విష ప్రచారాలు చేస్తున్నారు. మళ్లీ కిరణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, ఇలాంటి కథనాలు రాస్తే ఈసారి ప్రియ పచ్చళ్ల నుంచి విదేశాలకు మనం ఎగుమతి చేసిన అభరణాల దాకా, మీ హోటల్లో గ్లాసుల నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో మీరు చేసిన పనులు మీడియా ముందుకు తీసుకొచ్చి కడిగేస్తామని హెచ్చరిస్తున్నాం.