కూటమి ప్రభుత్వం చేతిలో ఎస్ఈసీ కీలుబొమ్మ

ఎన్నికల అక్రమాలపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఒక్కరిపైన కూడా చర్యలు లేవు

 వైఎస్సార్ సీపీ నేతలు ధ్వజం

స్థానిక ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలు, అరాచకాలు, బెదిరింపులు, దౌర్జన్యాలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లు వరుదు కళ్యాణి, కల్పలత రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు బండి పుణ్యశీల, నాగ మల్లీశ్వరి, బీవై రామయ్య, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్ రెడ్డి, పార్టీ పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్ర రెడ్డి, పార్టీ బూత్ కమిటీ విభాగం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు నలమారు చంద్ర శేఖర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణ మూర్తి, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, తదితరులు పాల్గొన్నారు.

 ఎలక్షన్ కోడ్ ను అధికార పార్టీ నేతలు బహిరంగంగా ఉల్లంఘిస్తున్నా కేసులు లేవు  

 వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు, అక్రమ నిర్భందాలు

 ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపాటు

 కుప్పం కంటే ఎక్కువ రిగ్గింగ్  చేసామన్న మంత్రి రామ్ ప్రసాద్ ను భర్తరఫ్ చేయాలి

 సీసీ కెమెరాలు పోలింగ్ కేంద్రాల్లో పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ఖాతరు చేయడం లేదు

 వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి ఆగ్రహం

 రిగ్గింగ్ చేయడంలో చంద్రబాబు స్ట్రైక్ రేట్ సూపర్

 బెదిరింపులతో ఎలక్షన్స్  చేసి గొప్పలా..?

 ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ఎద్దేవా

 వేలంపాటలతో ఏకగ్రీవాల స్ఫూర్తిని ఖూనీ చేస్తున్నారు

 అధికార పార్టీకి దాసోహమైన ఆర్డీఓలపై డిజిటల్ బుక్ ద్వారా చర్యలు తప్పవు

 మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హెచ్చరిక

విజయవాడ: అధికారంలో ఉన్నామనే అహంకారంతో స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను నామినేషన్ వేయనీయకుండా  అడ్డుకోవడం, బెదిరించడం, అక్రమ కేసులు బనాయించడం, అక్రమ నిర్భంధాలు చేయడం,  జరుగుతున్న దాడులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పదే పదే వైఎస్సార్ సీపీ ఫిర్యాదు చేస్తున్నా సరే ఎస్ ఈసీ  ఏమాత్రం పట్టించుకోకపోవడం విచారకరమని నాయకులు మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్స్ లో రాష్ట్రవ్యాప్తంగా కూటమి పార్టీల నేతలు సాగిస్తున్న అరాచకాలు, అక్రమాలపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కల్పలతా రెడ్డి, పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కలసి ఎస్ఈసీకి ఫిర్యాదు చేసారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ
 ఎన్నికల ప్రవర్తనా నియామవాళిని అధికార పార్టీ నేతలు బహిరంగంగా ఉల్లంఘిస్తున్నా సరే  స్టేట్ ఎలక్షన్ కమిషన్   చర్యలు తీసుకోకుండా చోద్యం చూడటం తగదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇటీవల పరిస్థితులను పరిశీలిస్తుంటే, కూటమి పార్టీ నేతలు, కొందరు అధికారులతో కలసి రాష్ట్ర ఎస్ ఈసీ కూడా ఈ ఎన్నికల్లో కుమ్మక్కు అయిందని కూటమి ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని ధ్వజమెత్తారు. దొంగలు.. దొంగలూ కలసి ఊళ్లను పంచుకున్న రీతిలో ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ గ్రామాల సర్పంచ్ పదవులను వేలం పాటలు నిర్వహిస్తుంటే ఎస్ఈసీ కనీసం చర్యలు తీసుకోకుండా కళ్లు మూసుకోవడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికల అన్ని విడతల్లో జరుగుతున్న ఎన్నికల అక్రమాలపై మేము ప్రతిసారీ రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్తున్నాసరే కనీసం ఖాతరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.  కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్రస్థాయిలో పరిస్థితులను నియంత్రించలేకపోతున్నారని,  ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న ఎస్ ఈసీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని,  సమయం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎన్నికల సంఘం ఇప్పటికైనా తక్షణమే స్పందించి, రాష్ట్రంలో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేసారు. ఈ ప్రెస్ మీట్ లో ఏయే నేతలు ఏవేం మాట్లాడరంటే...

ఎస్ఈసీ ఇప్పటికైనా సరే కళ్లు తెరవాలి
: వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ

రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తూ, నామినేషన్ల దశ నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు సాగిస్తున్న దౌర్జన్యాలు, బెదిరింపులపై ఎప్పటికప్పుడు మేము ప్రతిరోజూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చి కమిషనర్‌కు ఫిర్యాదులు చేస్తున్నాం. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారడం లేదు. మున్సిపల్ ఎన్నికలు, పరిషత్ ఎన్నికల సమయంలోనే కాకుండా ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ నాయకులు ఇంతటి దౌర్జన్యాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.  ప్రకాశం జిల్లాలో పాణిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తన కార్యకర్తలకు బహిరంగంగా మాట్లాడుతూ, మీరు కొడితే కేసులు ఉండవు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరిగి కొడితే మాత్రం కేసులు ఉంటాయని చెప్పడం పరిస్థితులకు నిదర్శనం. కూటమి అభ్యర్థులకు  ఓట్లు వేస్తే ఉద్యోగాలు, సీఎం రిలీఫ్ ఫండ్ వస్తాయని చెప్పడం ఎంతవరకు సమంజసం? అధికార పార్టీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవన్నట్లు మాట్లాడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.  ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని భోగాపురం గ్రామంలో 10 వార్డులకు గాను 9 వార్డుల అభ్యర్థుల నామినేషన్లను స్క్రూటినీ పేరుతో అన్యాయంగా తిరస్కరించారు. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడం గమనార్హం.  నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లను ఉపసంహరించారని ఫిర్యాదులు అందుతున్నాయి. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలోని ఆరు పంచాయతీల్లో ఓటర్లు కానివారు సైతం వచ్చి ఎన్నికల సమయంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఓటర్లను బెదిరిస్తున్నారని సమాచారం ఉంది.  కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో స్క్రూటినీ కేంద్రంలోనే మా పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించివేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. నామినేషన్లు చించేస్తే వాటిని తిరస్కరించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో మా అభ్యర్థి భర్తపై అక్రమ కేసు నమోదు చేయడమే కాకుండా, నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఎస్ఐ బెదిరిస్తున్నట్లు ఫిర్యాదు అందింది.  కడప జిల్లాలోని పలు మండలాల్లో ఎస్ఐలు, సీఐలే అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేస్తున్నారు. బ్రహ్మంగారి మఠం మండలంలో 19 మంది సర్పంచ్ అభ్యర్థుల్లో 18 మంది మా పార్టీ మద్దతుదారుల నామినేషన్లను తిరస్కరించారు. అలాగే 46 మంది వార్డు సభ్యుల అభ్యర్థుల్లో 26 మంది నామినేషన్లను తిరస్కరించారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేందుకు ఇంతకంటే ఏం ఉదహరణలు కావాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా సరే కఠిన చర్యలు తీసుకోని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి.  

 
మంత్రి రామ్ ప్రసాద్ పై ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలి
: మనోహర్ రెడ్డి, లీగల్ సెల్

రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. నామినేషన్లను అనుమతించడం లేదు. అనుమతించినా సరే స్క్రూట్నీలో అనర్హులుగా వేటు వేస్తున్నారు. లేకుంటే ఎన్నికల పోలింగ్ లో రిగ్గింగ్ చేస్తున్నారు. ఇంకా అవసరమైతే మా ఏజెంట్లను భయపెట్టి, బెదిరించి, ఓట్ల కట్టలను తారుమారు చేసి వారికే వారే విజేతులుగా ప్రకటించుకున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు రౌడీలుగా మారి అధికారులతో కుమ్మక్కై వైఎస్సార్ సీపీ నేతలను బెదిరించి, దౌర్జన్యాలు చేసి ఎన్నికలు సాగిస్తున్నారు.  వారే దాడులు చేసి మా నేతలు, కార్యర్తలపై కేసులు నమోదు చేస్తున్నారు.  మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతూ, మేము కుప్పంలో కంటే ఎక్కువ   రౌడీయిజం, రిగ్గింగ్ చేసాం. ఎన్నికల్లోమెజార్టీ స్థానాలు కుప్పం కంటే ఎక్కవ గెలిచాం. రిగ్గింగ్ చేస్తాం.. సునాయసంగా గెలుస్తాం అని బహిరంగంగా చెప్పినా సరే మంత్రి గా ఆయన కొనసాగడం సిగ్గు చేటు. ఆయన్ను చంద్రబాబు ఈపాటికే భర్తరఫ్ చేయాలి. ఎస్ ఈసీ కూడా కనీసం చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. ఎన్నికల కమిషన్ ఎక్కడైనా సరే కొరడా ఝుళిపించిందా..?. ఏ ఒక్క అదికారిపై నైనా సరే చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. పోలీసు యంత్రాంగమే బరితెగించి అధికార కూటమిని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకుని  ప్రజాసామ్యాన్ని ఖూనీ చేస్తోంది. సుప్రీంకోర్టు చెప్పినా సరే సీకీ కెమెరాలు పెట్టకపోవడం రాష్ట్రంలో ఎటువంటి దుస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
రిగ్గింగ్ చేయడంలో బాబు స్ట్రైక్ రేట్ సూపర్
: కల్పలతా రెడ్డి, ఎమ్మెల్సీ

ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి తప్పితే ఎక్కడా తగ్గడం లేదు. ఎస్ఈసీకి ప్రతీ ఆంశానికి సంబంధించి ఆధారాలతో ఫిర్యాదు చేశాం. కఠిన చర్యలు తీసుకోవాలని సరే పట్టించుకోవడం లేదు. అంతేగాక మమ్మల్ని కన్వీన్స్ చేసేందుకు ప్రయత్నాలు చేయడం ఏ తగదు. సీఎం చంద్రబాబు నాయుడు స్ట్రైక్ రేట్ కోసం మాట్లాడుతున్నారు. ఏవిథంగా స్ట్రైక్ రేట్ సాధించారు..? నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడంలో, స్క్రూట్నీ పేరుతో అనర్హులను ఎరివేయడంలో, పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ చేయడంలో, స్ట్రైక్ రేట్ సాధించారా అని నేను ప్రశ్నిస్తున్నా. కొందరు అధికారులు కీలుబొమ్మలుగా మారి మా అభ్యర్థులను బెదిరించి ఎలక్షన్స్ చేస్తున్నారో వారిని ఎస్ఈసీ వదిలి పెట్టవచ్చు. కానీ వైఎస్సార్ సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోదు.    రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోయేది జగన్. అప్పుడు అడ్డగోలుగా వ్యవహరించిన ప్రతీ అధికారిపైనా చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. 
 
ఆ ఆర్డీఓలపై వైఎస్సార్ సీపీ డిజిటల్ బుక్ లో నమోదు చేసి చర్యలు తీసుకుంటాం
: మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే

రాష్ట్రంలో ఎక్కడా ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఎస్ఈసీ ఎక్కడా అమలు చేయడం లేదు. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను పకడ్బందీగా అమలు చేయాల్సిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆ పని చేయడం లేదు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డీఓలు ప్రవర్తనా నియామళిని అమలు చేయడం లేదు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను అపహస్యం చేస్తోంది. దౌర్జన్యాలు, దాడులు చేస్తూ అన్యాయంగా నామినేషన్లు రిజెక్టు చేస్తున్నారు. దీనిపై అప్పీల్ చేసుకోవడానికి కూడా అభ్యర్థులకు అవకాశం లేకుండా పోయింది. ఒక్క రోజు పరిధిలో ఎలక్షన్ కమిషన్ ట్రిబ్యునల్ కు వెళ్లి న్యాయం కోసం పోరాడే శక్తి గ్రామస్థాయిలో అభ్యర్ధులకు ఎక్కడ ఉంటుంది..?  ఆర్డీఓకి ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసు  వ్యవస్థతో నిర్బంధం చేస్తున్నారు.  ఏకగ్రీవాలు అనేవి రాష్ట్రంలో కుంభకోణాలుగా మారాయి. పోలీసులు, ఎస్ఈసీ, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆర్డీఓలు కలసి ఓ పంచాయతీకి ఏకగ్రీవం చేసేందుకు వేలం పాటలు నిర్వహిస్తుండటం. రాజ్యాంగానికి తూట్లు పోడవటం కాదా..? ఏకగ్రీవాల స్ఫూర్తిని అధికార పార్టీ ఏవిధంగా దెబ్బ తీస్తోందో  చెప్పడానికి నగరిలో వైస్ చైర్మన్ పదవిని అమ్మేయడం కుంభకోణం కాదా..? దొంగలు.. దొంగలు కలిసి ఊళ్లు పంచుకుంటున్నారడానికి ఇది నిదర్శనం కాదా..?  కూటమి ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిగా  కులుషితం చేసింది. ఏ ఆర్డీఓ అయితే ఉద్దేశ్యపూర్వకంగా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారో వారిని గుర్తు పెట్టుకుని వైఎస్సార్ సీపీ డిజిటల్ బుక్ లో నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం అని మాజీ మల్లాది విష్ణు హెచ్చరించారు.

Back to Top