కర్నూలు జిల్లా: పత్తికొండ పట్టణంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారుల సమక్షంలోనే వైయస్ఆర్‌సీపీ మద్దతుదారుడు జి. సోమశేఖర్ నామినేషన్ పత్రాలను టీడీపీ నాయకులు చించివేశారని వైయస్ఆర్‌సీపీ వర్గాలు ఆరోపించాయి. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రజాస్వామ్యానికి విఘాతమని పేర్కొన్నారు. ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, పత్రాలను చించివేయడం వంటి చర్యలతో ఎన్నికల్లో గెలవాలని చూడటం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. ఘటనపై రిటర్నింగ్ అధికారిపై సంబంధిత ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. అభ్యర్థులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.