అనంతపురం జిల్లా: వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను వైయస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ ఖండించారు. స్థాయికి మించి మాట్లాడటం బీజేపీ నేతలకు తగదని, ప్రజల తీర్పును గౌరవించడం నేర్చుకోవాలని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ఘన విజయం సాధించిందని, ఓటమిని జీర్ణించుకోలేక బీజేపీ నేతలు చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల తీర్పును గౌరవించకుండా అనవసర వ్యాఖ్యలకు దిగడం సరికాదని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో, భారీ వర్షాలతో అనంతపురం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు బీజేపీ నేతలు ఎక్కడ ఉన్నారని షేక్ బాబా సలామ్ ప్రశ్నించారు. ప్రజలకు అవసరమైన సమయంలో అందుబాటులోకి రాని నేతలు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం కేంద్ర మంత్రుల సహకారం ఉందంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు అందుబాటులో ఉండకుండా కేవలం ప్రెస్‌మీట్లకే పరిమితమవుతున్న బీజేపీ నేతలు ముందుగా ప్రజా సమస్యలపై పనిచేసి చూపించాలని షేక్ బాబా సలామ్ అన్నారు. అనంత వెంకటరామిరెడ్డిపై చౌకబారు వ్యాఖ్యలు చేయడం మానుకుని ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు.