తాడిపత్రిలో కొనసాగుతున్న జేసీ వర్గీయుల దాష్టీకం

 సర్పంచ్ అభ్యర్థి వాహనానికి నిప్పు.. మాజీ ఎంపీటీసీపై దాడి 

అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాడిపత్రి మండలం దిగువపల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని భావిస్తున్న సంగటి విజయలక్ష్మికి చెందిన బొలెరో వాహనానికి టీడీపీ వర్గీయులు నిప్పు పెట్టారని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. ఘటన సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆరోపించారు.

మరోవైపు బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎంపీటీసీ నాగయ్యపై గత రాత్రి టీడీపీ వర్గీయులు దాడి చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఒంటరిగా వెళ్తున్న నాగయ్యను అడ్డుకుని దాడికి పాల్పడ్డారని, ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఈ ఘటనకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటనతో చెన్నంపల్లి గ్రామంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం గ్రామంలో పోలీసుల పర్యవేక్షణ కొనసాగుతోంది.

Back to Top