రిగ్గింగ్ చేసినా ఓడిన చరిత్ర కూటమి ప్రభుత్వానిది

దాన్ని క‌ప్పి పుచ్చుకునేందుకే అనంత‌పై దిగజారుడు మాట‌లు

కోర్టుకి వెళ్తే వారి అరాచ‌కాలు, బాగోతాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి

అనంత‌పురం న‌గ‌ర మేయ‌ర్ ర‌మేష్ గౌడ్ ఫైర్ 

అనంత‌పురంలోని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన అనంత‌పురం న‌గ‌ర మేయ‌ర్, 
వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ ర‌మేష్ గౌడ్‌

దొంగ ఓట్లు వేసిన రాజేష్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటు

పోలింగ్ రోజున కూట‌మి నాయ‌కుల అరాచ‌కాలు అన్నీ ఇన్నీ కావు

రిగ్గింగ్‌లు, బూత్ క్యాప్చ‌రింగ్‌లు, దాడులకు మావ‌ద్ద ఆధారాలున్నాయి

అనంత‌పై రాజేష్ చేసిన దిగ‌జారుడు వ్యాఖ్య‌ల‌కు బీజేపీ స‌మాధానం చెప్పాలి

బీజేపీ మేనిఫెస్టో హామీలను అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి

మేయ‌ర్ ర‌మేష్ గౌడ్ డిమాండ్ 

అనంతపురం:  రిగ్గింగ్ చేసినా ఓడిపోయిన చరిత్ర కూటమి ప్రభుత్వానిదని, ఆ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి ఊగిపోతూ, ఆవేశపడుతూ నోటికొచ్చిన‌ట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారని అనంతపురం నగర మేయర్, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ మండిపడ్డారు. అనంతపురంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు అనంతపురం నగర ప్రథమ పౌరుడిగా అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాల్సిన సమయంలో కూటమి నేతల దిగజారుడు వ్యాఖ్యల వల్ల ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగుసార్లు ఎంపీగా సేవలందించిన సీనియర్ నేత అనంత వెంకటరామిరెడ్డిని ఉద్దేశించి ‘లుచ్చా, లోఫర్’ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడటం దారుణమని రమేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించలేని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనుకొండ్ల రాజేష్ మాటలకు అనంతపురం జిల్లా బీజేపీ నాయకత్వం స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న బీజేపీ నాయకులు ముందుగా ఎన్నికల సమయంలో తాము వ్యవహరించిన తీరుపై ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఎన్నికల్లో బూత్ క్యాప్చరింగ్‌లు, దొంగ ఓట్లు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడింది కూటమి నాయకులేనని ర‌మేష్ గౌడ్ స్ప‌ష్టం చేశారు. 

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే... 

పార‌ద‌ర్శ‌కంగా పోలింగ్ జ‌రిగితే 35 వేల మెజారిటీ వ‌చ్చేది: 

భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే కొనుకొండ్ల రాజేష్ పోలింగ్ రోజు చేసిన నిర్వాకాలన్నీ మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. పోలింగ్ బూత్‌లోకి దూరి తలుపులు వేసి లోపల వ్యక్తులను పెట్టి రిగ్గింగ్ జరిపిస్తూ బయట కాపలాదారుడిగా ఉన్న వ్యక్తి రాజేష్. అనంతపురంలో ఉదయం ఏడు గంటలకే క్యూలో నిలబడి ఓటు వేసి, మళ్లీ కూడేరు మండలం కదరకుంట గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల్లోనూ రెండో ఓటు వేశారు. రెండు చోట్ల ఓట్లు వేసిన వ్య‌క్తి రాజ్యాంగం గురించి మాట్లాడ‌టం సిగ్గుచేటు. వారి కుటుంబ సభ్యులు, బావమరిది దొంగ ఓట్లు వేసిన వీడియోలు, ఫొటోలు మా దగ్గర ఉన్నాయి. పోలింగ్ రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా బూత్‌లలోకి వెళ్లి దౌర్జన్యాలకు పాల్పడ్డారు. వారి దాడుల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మోకాళ్లు, కాళ్లు, చేతులు విరిగి, తలలు పగిలి నేటికీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కౌంటింగ్ రోజు మొదటి రౌండ్ నుంచే వైఎస్సార్‌సీపీకి ఆధిక్యం వస్తుండటాన్ని ఓర్చుకోలేక బీజేపీ ఏజెంట్లు సంతకాలు చేసిన తర్వాత కూడా నాలుగు టేబుళ్ల లెక్కింపును ఆపేశారు. తెల్లవారుజామున ఐదు గంటల వరకు అధికారులు, మా నాయకులు, ఏజెంట్లకు నరకం చూపించారు. రిగ్గింగ్‌లు, బూత్ క్యాప్చరింగ్‌లు జరగకపోయి ఉంటే, కౌంటింగ్‌లో మా ఓట్లను అన్యాయంగా ఇన్వాలిడ్ చేయకపోయి ఉంటే వైఎస్సార్‌సీపీకి 35 వేలకుపైగా మెజారిటీ వచ్చేది. కౌంటింగ్ రోజు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ తరహాలో 10 వేల మందికిపైగా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి రావడమే ప్రజాతీర్పుకు నిదర్శనం.

పార్టీ మార‌మ‌ని జేసీ చెప్ప‌డం స‌రికాదు: 

ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఓటమిని అంగీకరిస్తున్నామని మంత్రి సత్యకుమార్ ట్వీట్ చేశారు. అభ్యర్థి కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాంటిది పది రోజుల తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వారి గందరగోళానికి నిదర్శనం. కోర్టుకు వెళ్తే మీ బాగోతాలు, దౌర్జన్యాలు, సీసీ ఫుటేజీలన్నీ బయటపడతాయి. మాకు మరింత న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. గెలిచామనే గర్వం లేకుండా కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అందరినీ కలుపుకొని ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని మా నాయ‌కులు వైఎస్ జ‌గ‌న్ గారు స్పష్టంగా చెప్పారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షానే ఉంటుంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని విర్రవీగిన బీజేపీ నాయకులు ఓడిపోయామనే సాకుతో తప్పించుకోకుండా తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విమానాశ్రయం, అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుళ్లు, రైల్వే జంక్షన్, మదనపల్లి తరహా హార్టికల్చర్ హబ్‌ను అనంతపురానికి తీసుకురావాలి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు యువతను ప్రోత్సహిస్తూ అధికారులను సహకరించమని సలహా ఇస్తారని ఆశించాం. కానీ పార్టీ మారమని చెప్పడం సరికాదు. అలా పార్టీలు మారుకుంటూ పోతే చివరికి ఒకే పార్టీ మిగులుతుంది. ప్రజల ఓట్లతో గెలిచిన మేయర్‌కు అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలి. సహకరించకపోతే ప్రజల అభిప్రాయాన్ని అవమానించినట్లే. అధికారులు సహకరించకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో మా కార్యాచరణ ఉంటుంది. కార్పొరేటర్లందర్నీ కలుపుకొని అనంతపురం నగర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామ‌ని ర‌మేష్ గౌడ్ స్ప‌ష్టం చేశారు.

Back to Top