తాడేపల్లి: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం అంజనేయపురంలో శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడంపై వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన ఆలయాలను ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించకుండానే కూల్చివేయడం దారుణమని పేర్కొన్నారు. ఆలయాల విధ్వంసంపై జగన్ ఆగ్రహం తిరుమలలో చారిత్రక వేయికాళ్ల మండపం నుంచి విజయవాడలో కృష్ణా పుష్కరాల సమయంలో 40 ఆలయాల కూల్చివేత, బద్వేలులోని కాశినాయన జ్యోతి క్షేత్రంలో కూల్చివేతల వరకు ఆలయాలపై విధ్వంసం కొనసాగుతోందని వైయస్ జగన్ పేర్కొన్నారు. పవిత్ర కట్టడాలను తొలగించే ముందు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. శ్రీవాణి ట్రస్టుతో ఆలయాల అభివృద్ధి వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం చారిత్రక, వారసత్వ కట్టడాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తోందని విమర్శించారు. సనాతన ధర్మ పరిరక్షణ ఇదేనా? ఆలయాలను కూల్చివేస్తూ సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని వైయస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఆలయాలు, భక్తుల విశ్వాసాల పరిరక్షణపై నిజమైన చిత్తశుద్ధి ఉందా అని నిలదీశారు. “హే రామ్.. ఆలయాలను కాపాడండి.. ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి” అంటూ పిలుపునిచ్చారు. హే రామ్! ఆలయాలను కాపాడండి! ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి! చంద్రబాబు గారి పాలనలో ఆలయాల విధ్వంస పరంపర కొనసాగుతూనే ఉంది! అంజనేయపురంలో శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది కోట్లాది భక్తుల విశ్వాసాలపై జరిగిన దాడి. తిరుమలలో చారిత్రక వేయికాళ్ల మండపాన్ని ధ్వంసం చేయడం మొదలుకొని, కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో 40 ఆలయాలను కూల్చివేయడం, బద్వేలులోని కాశినాయన జ్యోతి క్షేత్రంలో కూల్చివేతల వరకు.. ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించకుండానే పవిత్ర కట్టడాలను ధ్వంసం చేయడం కొనసాగుతూనే ఉంది. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేస్తే, చంద్రబాబుగారి ప్రభుత్వం మాత్రం చారిత్రక వారసత్వ కట్టడాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తోంది. మీ ప్రభుత్వ దృష్టిలో సనాతన ధర్మాన్ని పరిరక్షించడం అంటే ఇదేనా?