వినుకొండ: మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ప్రజాబలంతో కాకుండా పోలీసుల అండతో, రిగ్గింగ్‌కు పాల్పడి గెలిచారని వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. వినుకొండలో గెలిచిన వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైయస్ఆర్‌సీపీ తరఫున తొమ్మిది మంది కౌన్సిలర్లు ప్రజల మద్దతుతో గెలిచారని తెలిపారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైయస్ఆర్‌సీపీ నాయకులు, అభ్యర్థులను అడ్డుకోవడం, రౌడీషీటర్లను వినియోగించడం, గృహ నిర్బంధాలు, దొంగ ఓట్లతో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశారని ఆరోపించారు. ఈ అక్రమాలపై ఎన్నికల కమిషన్, కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదులు చేసినట్లు చెప్పారు. చైర్‌పర్సన్ అభ్యర్థి పీఎస్ ఖాన్‌తో పాటు పలువురు అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారని, అనేక వార్డుల్లో ఇదే పరిస్థితి కొనసాగిందని బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. వైయస్ఆర్‌సీపీ తరఫున గెలిచిన తొమ్మిది మంది కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు నిరాశ చెందవద్దని సూచించారు. భవిష్యత్తులో వైయస్ఆర్‌సీపీ మరింత బలోపేతమై అధికారంలోకి వస్తుందని, ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.