కూటమి రాక్షస పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ

అధికార బలంతో ఎన్నికల్లో అడుగడుగునా అక్రమాలు

వైయ‌స్సార్‌సీపీ నాయ‌కులు ధ్వ‌జం 

విజ‌య‌వాడ‌లో ఎస్ఈసీని క‌లిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్సార్‌సీపీ నాయ‌కులు 

వైయ‌స్సార్‌సీపీ మ‌ద్ధ‌తు అభ్యర్థుల నామినేషన్లకు అడుగ‌డుగునా అడ్డంకులు

పోలీసుల అండతో వైయ‌స్సార్‌సీపీ శ్రేణుల‌పై దాడులు, బెదిరింపులు

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ల ఉపసంహరణ.. లిబొట్టు లెక్కల పేరుతో నీచంగా తిరస్కరణ

స్క్రూటినీ పేరుతో వైయ‌స్సార్సీపీ మ‌ద్ధ‌తిచ్చిన అభ్యర్థులపై వివక్ష

సుప్రీంకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేస్తున్న అధికారులు

వెయ్యికి పైగా ఫిర్యాదులిచ్చినా స్పందించని ఎస్ఈసీ

2029లో జగనన్న సీఎం కాగానే చట్టబద్ధంగా రిటర్న్ గిఫ్ట్ తప్పదు

వైయ‌స్సార్‌సీపీ నేతల హెచ్చరిక

విజయవాడ: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను కూటమి ప్రభుత్వం పోలీసు, రెవెన్యూ యంత్రాంగాల సహకారంతో పూర్తిగా అపహాస్యం చేస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)ను కలిసి, మూడో విడత నామినేషన్లు, స్క్రూటినీ, విత్‌డ్రాయల్స్‌లో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కల్పలతా రెడ్డి, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్ రెడ్డి, ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలపై నిప్పులు చెరిగారు. పల్నాడు, కడప, తిరుపతి, చిత్తూరు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ గూండాలు, పోలీసులు కలిసి దాడులు చేస్తూ నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు ఉపసంహరింపజేయడం, డిక్లరేషన్ ఫామ్‌లో తాలిబొట్టు వివరాలు అడుగుతూ తిరస్కరించడం వంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా, ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకు వెయ్యికి పైగా ఫిర్యాదులు చేసినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, 2029లో వైఎస్ జగన్ గారు మళ్లీ ముఖ్యమంత్రి కాగానే అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరికీ చట్టబద్ధంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీలు వ‌రుదు క‌ళ్యాణి,  క‌ల్ప‌ల‌తా రెడ్డి, మ‌ల‌సాని మ‌నోహ‌ర్ రెడ్డి, న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిల‌తోపాటు పార్టీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్య‌క్షుడు నారాయ‌ణమూర్తి, పార్టీ బూత్ క‌మిటీ అధ్య‌క్షుడు సుధాక‌ర్ రెడ్డి, పంచాయ‌తీరాజ్ విభాగం అధ్య‌క్షుడు వెన్న‌పూస ర‌వీంద్రారెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు. 

నాయ‌కులు ఎవ‌రెవ‌రు ఏం మాట్లాడారంటే... 
 
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి పాలన
- వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ

రాష్ట్రంలో అధికారులు, పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైయ‌స్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారు. పల్నాడు, కడప, తిరుపతి, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో పోలీస్ స్టేషన్లలోనే మా అభ్యర్థుల వేళ్లు తెగి రక్తాలు కారేలా కొట్టి, నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. కడప జమ్మలమడుగు, సంకేపల్లిలో నామినేషన్లు స్వీకరించడం లేదు, చిత్తూరు, తిరుపతిలో అధికారులే ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు ఉపసంహరింపజేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలున్నా పట్టించుకోకుండా, మహిళలపై దాడులు చేస్తూ, వాహనాలు తగలబెడుతూ కూటమి నేతలు రాక్షస పాలన సాగిస్తున్నారు. మూడేళ్ల పాలనలో ఏ ఒక్క హామీ అమలు చేయకపోవడంతో ప్రజల తిరస్కరణకు భయపడే చంద్రబాబు ఇలాంటి విధ్వంసం సృష్టిస్తున్నారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, 2029లో జగనన్న ముఖ్యమంత్రి కాగానే అక్రమాలకు సహకరించిన అధికారులందరికీ చట్టబద్ధంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయమని హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా అధికారులు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలి.

  తాలిబొట్టు లెక్కల పేరుతో నామినేషన్ల తిరస్కరణ సిగ్గుచేటు
- కల్పలతా రెడ్డి, ఎమ్మెల్సీ

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రతి దశలోనూ నిబంధనలను తుంగలో తొక్కుతూ రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థను నడిపిస్తున్నారు. అనంతపురం, కడప, చిత్తూరు, శ్రీకాకుళం, పల్నాడు జిల్లాల్లో మా అభ్యర్థుల తలలు పగలగొట్టి, నామినేషన్ పత్రాలను చింపేస్తున్న ఫోటోలను కమిషనర్ గారికి చూపించాము. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయకుండా, వ్యవస్థలను కాపాడాల్సిన పోలీసులే కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తున్నారు. పులివెందుల వేంపల్లిలో డీఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ, కనీసం ఎంపీ గారికీ రక్షణ లేకుండా చేస్తున్నారు. మరీ నీచంగా, డిక్లరేషన్ ఫామ్‌లో తాలిబొట్టు బరువు, ధర రాయలేదంటూ అభ్యర్థి నామినేషన్‌ను రిజెక్ట్ చేయడం సిగ్గుచేటు. చిత్తూరులో అధికారులే ఆమోదించిన ఫామ్‌ను స్క్రూటినీలో 'అవును' నుంచి 'కాదు'గా మార్చి అన్యాయం చేశారు. మా అభ్యర్థులకు న్యాయం జరిగి, స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే వరకు ఎస్ఈసీ వద్దకు వస్తూనే ఉంటాము.

 కోట్లాది రూపాయలతో వ్యవస్థలను కొనేసి ఏకగ్రీవాల డ్రామా
- మలసాని మనోహర్ రెడ్డి, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు

మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి, చట్టాలకు, న్యాయస్థానాల తీర్పులకు కూటమి ప్రభుత్వం తిలోదకాలిచ్చింది. అధికార దుర్వినియోగం జరుగుతోందని గుర్తించే సుప్రీంకోర్టు సీసీటీవీల పర్యవేక్షణలో, పోలీసు బందోబస్తుతో ఎన్నికలు జరపాలని ఆదేశించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. తెలుగుదేశం కూటమి నాయకులు ఏకగ్రీవాల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి రెవెన్యూ, పోలీసు యంత్రాంగానికి ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నామినేషన్ వేయడం, స్క్రూటినీ దాటడం, విత్‌డ్రాయల్, పోలింగ్.. ఇలా ప్రతి దశ ప్రతిపక్ష అభ్యర్థులకు ఒక గండంగా మారింది. పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్ చేయిస్తూ, హింసాత్మక వాతావరణం సృష్టించి 94 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలిచామని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తోంది; ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఎన్నికలపై ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం కొనసాగిస్తాము.

 దాడులతో అభ్యర్థులను అడ్డుకుని గెలిస్తే అది గెలుపా?
- నలమారు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు

ఈరోజు 17 నామినేషన్లకు సంబంధించి ఎస్ఈసీకి ఫిర్యాదులు ఇచ్చాము. ఎన్నికలు మొదలైనప్పటి నుంచి దాదాపు వెయ్యికి పైగా ఫిర్యాదులు చేసినా సరైన స్పందన లేదు. టీడీపీ గూండాలు, పోలీసులు కలిసి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే అధికారులు, ఎస్ఈసీ కేవలం కాలయాపన చేస్తున్నారు. ముఖ్యమంత్రి టెలీ కాన్ఫరెన్స్ పెట్టి ఏకగ్రీవాల కోసం మంత్రులకు సూచనలు ఇచ్చి, మా అభ్యర్థులపై దాడులు, అక్రమ కేసులు పెట్టించి గెలిచి సంకలు తట్టుకుంటున్నారు. గ్రామంలోని అన్ని పార్టీల వారు కూర్చొని ఏకగ్రీవం చేస్తే అది గెలుపు అవుతుంది కానీ, ప్రతిపక్షాన్ని అడ్డుకుని డిక్లేర్ చేసుకోవడం గెలుపు ఎలా అవుతుంది? ఈ ఎన్నికల ఫలితాలను చూసి కూటమి సత్తా తెలుసుకోవాలన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. లాఠీలు, రాళ్లు, బాంబులతో దాడులు చేసి పోలింగ్ బూత్‌కు రానివ్వకుండా జరిపే వీటిని సాధారణ ఎన్నికలతో పోల్చడం సబబు కాదు; వచ్చే ఎన్నికల్లో ప్రజలే వీరికి తగిన బుద్ధి చెబుతారు.

Back to Top