ఆంజనేయస్వామి ఆలయం కూల్చడం దారుణం

టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమన కరుణాకరరెడ్డి

తిరుపతి జిల్లా: రేణిగుంట మండలం ఆంజనేయపురంలో వేల ఏళ్ల చరిత్ర కలిగిన అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కూల్చివేయడంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప–రేణిగుంట జాతీయ రహదారి 716 విస్తరణలో భాగంగా ఆలయాన్ని తొలగించే చర్యలను భూమన కరుణాకరరెడ్డి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. జాతీయ రహదారి డిజైన్‌లో మార్పులు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆలయాన్ని కూల్చివేయడం కక్ష సాధింపు చర్యగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

 సనాతన ధర్మ పరిరక్షణ ఇదేనా? 

సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్‌కు హిందూ ఆలయాల పరిరక్షణపై ఇదేనా చిత్తశుద్ధి అని భూమన ప్రశ్నించారు. హిందూ ఆలయాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. పల్లవ రాజుల కాలం నాటి పురాతన ఆలయంగా భావించే ఆంజనేయపురం అభయ ఆంజనేయస్వామి ఆలయంలో అగస్త్య మహాముని, అన్నమయ్య, కంచి చంద్రశేఖర్ స్వామీజీ పూజలు చేసినట్లు భూమన పేర్కొన్నారు. ఇంతటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న ఆలయాన్ని కూల్చివేయడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాన్ని పరిరక్షించే మార్గాలు ఉన్నప్పటికీ వాటిని పరిశీలించకుండా తొలగించడం సరికాదని భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. 

Back to Top