చంద్రగిరిలో నామినేషన్ల తిరస్కరణపై తిరుగుబాటు

తిరుపతి ఆర్డీఓ కార్యాలయానికి పోటెత్తిన 542 మందికి పైగా అప్పీల్‌దారులు

తిరుపతి జిల్లా: చంద్రగిరి నియోజకవర్గంలో సర్పంచ్, వార్డు అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణపై పెద్ద ఎత్తున అప్పీళ్లు దాఖలయ్యాయి. ఒక్క నియోజకవర్గంలోనే 542 మందికి పైగా అభ్యర్థులు అప్పీల్‌ చేయడంతో తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద భారీగా బాధిత అభ్యర్థులు తరలివచ్చారు. నామినేషన్ల తిరస్కరణపై ఆర్డీఓ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. న్యాయం కోసం తరలివచ్చిన అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అండగా నిలిచారు. అభ్యర్థులను ఆర్డీఓ కార్యాలయంలోకి పంపిస్తూ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి వారికి సహకరించారు.

ప్రజాక్షేత్రంలో గెలవలేమనే భయంతో నామినేషన్లను తిరస్కరింపజేసి ఏకగ్రీవాలకు మార్గం సుగమం చేసుకునే కుట్ర జరుగుతోందని వైయ‌స్ఆర్‌సీపీ ఆరోపిస్తోంది. అధికార బలంతో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక్క నియోజకవర్గం నుంచే 542 మందికి పైగా అప్పీళ్లు రావడం నామినేషన్ల తిరస్కరణపై నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోందని పేర్కొంటున్నాయి.

Back to Top