కూటమి నేతల అవినీతిని ఎండగడతాం

 అనంతపురాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం: అనంత వెంకటరామిరెడ్డి

 అనంతపురం : అనంతపురం కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నగరానికి కాపలాదారులుగా ఉంటామని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. కూటమి నేతల అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ, అనంతపురం అభివృద్ధికి బలమైన ప్రతిపక్షంగా పనిచేస్తామని తెలిపారు. కార్పొరేషన్‌ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో మేయర్‌గా ఎన్నికైన రమేష్‌గౌడ్‌తో పాటు 21 మంది కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం అనంత వెంకటరామిరెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

అనంతపురం నగరంలో ప్రజలకు ప్రశాంతత కరువైందని, ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. మేయర్‌ రమేష్‌గౌడ్‌ నాయకత్వంలో నగర అభివృద్ధికి సహకరిస్తూనే ప్రజలకు అన్యాయం జరిగితే బలంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కౌన్సిల్‌లో సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉంటామని తెలిపారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనంతపురం నగరంలో రూ.1,200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తల కృషితో ఈ విజయం సాధ్యమైందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా మేయర్‌ రమేష్‌గౌడ్‌ నాయకత్వంలో 21 మంది కార్పొరేటర్లు ముందుకు సాగుతారని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. 

Back to Top