విశాఖపట్నం : జీవీఎంసీ ఎన్నికల్లో పోలింగ్ రోజు ప్రకటించిన ఓట్ల శాతానికి, ఫలితాల తర్వాత అధికారులు వెల్లడించిన ఓట్ల లెక్కలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటం ఎన్నికల్లో జరిగిన అవకతవకలకు నిదర్శనమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. అధికార కూటమి అక్రమాలతో పీఠం దక్కించుకున్నా, ప్రతిపక్షంగా తాము మాత్రం ‘సేవ్ విశాఖ’ నినాదంతో నగర ప్రజల తరఫున, విలువైన విశాఖ భూములను కాపాడుకోవడానికి రాజీలేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని వైయస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన జీవీఎంసీ కార్పొరేటర్ల అభినందన, దిశానిర్దేశ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొని మీడియాతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎవరేమన్నారంటే.. జీవీఎంసీ ఓట్ల లెక్కల్లో భారీ వ్యత్యాసం.. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు కేకే రాజు, వైయస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు విశాఖ నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వంపై గౌరవప్రదమైన ప్రతిపక్షంగా పోరాడాల్సిన బాధ్యత నూతనంగా ఎన్నికైన మన కార్పొరేటర్లపై ఉంది. ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగి, రాష్ట్రానికి ఆర్థిక వెన్నెముకగా నిలిచే సత్తా ఉన్న విశాఖలో కూటమి పార్టీలు అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి అనడానికి అధికారుల లెక్కలే నిదర్శనం. పోలింగ్ రోజు రాత్రి, మరుసటి రోజు 10 లక్షల 37 వేల ఓట్లు ( ముందు 51%, ఆ తర్వాత 55.63%) పోలయ్యాయని అధికారులు ప్రకటించారు. అంటే దాదాపు 48 వేలకు పైగా ఓట్లు అదనంగా ఎలా వచ్చాయి? గతంలో గీతం సంస్థ భూములను క్రమబద్ధీకరించుకోవడానికి 32 మంది వైయస్సార్సీపీ కార్పొరేటర్లను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి, బెదిరించి దించారు. నేడు కూడా ఉరు పేరు లేని 'ఉర్సా' లాంటి కంపెనీలకు వేల కోట్ల విలువైన భూములను కట్టబెట్టి, కౌన్సిల్ ద్వారా ఆ ఫైళ్లను ఆమోదించుకునేందుకే ఎన్నికల్లో ధన ప్రవాహం సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రజా సమస్యలపై కనీస అవగాహన లేదు. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచిన మన 13 మంది కార్పొరేటర్లు 120 వార్డుల్లోని ప్రజా సమస్యలపై, గతంలో ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, మౌలిక వసతుల కల్పన కోసం కలిసికట్టుగా పోరాడుతారు. 13 మందే అయినా 30 లక్షల మంది తరఫున వీరోచిత పోరాటం చేస్తాం – గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి నూతనంగా ఎన్నికైన వైయస్సార్సీపీ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న సందర్భంగా వారిని సత్కరించి, కౌన్సిల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశాం. ఎన్నికల ప్రచారంలో మేయర్ అభ్యర్థి సోదరి వరద కళ్యాణి గారు, నేను, ఇతర అభ్యర్థులం ప్రజల్లోకి తీసుకెళ్లిన ‘సేవ్ విశాఖ’ నినాదంతోనే రేపటి నుంచి కౌన్సిల్లోనూ పోరాటం కొనసాగుతుంది. 120 వార్డుల్లో 13 మంది కార్పొరేటర్లే గెలిచినప్పటికీ, విశాఖ జిల్లాలోని 30 లక్షల మంది ప్రజల తరఫున గళమెత్తేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. సంఖ్య తక్కువైనా విశాఖ భవిష్యత్తును కాపాడేందుకు వీరోచిత పోరాటం చేస్తారు. విశాఖ పేరుతో విలువైన భూములను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులను, భూములను దోచి తినే రాబందులను అడ్డుకుని తీరుతాం. రాబోయే రోజుల్లో ప్రతి కౌన్సిల్ సమావేశానికి ముందు ఒక 'షాడో మీటింగ్' నిర్వహించుకుని ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అడ్డుకునే ప్రణాళికలు రచిస్తాం. సీనియర్ల అనుభవం, కొత్తగా గెలిచిన వారి ఉత్సాహం కలగలిపి వైయస్.జగన్ గారి నాయకత్వంలో విశాఖ ప్రజల ప్రయోజనాల కోసం అహర్నిశలు పనిచేస్తారు.