య‌ల‌హంక‌లో జ‌ర‌గరానిది జ‌ర‌గాల‌ని త‌ప‌న ప‌డ్డారు 

 చంద్ర‌బాబు, ఎల్లో మీడియా ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి

 అయినా క‌ట్టుక‌థ‌ల‌తో జ‌గ‌న్ గారి వ్య‌క్తిత్వంపై త‌ప్పుడు క‌థ‌నాలు

 మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు తీవ్ర ఆగ్ర‌హం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన గుంటూరు జిల్లా పార్టీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు 

  ష‌ర్మిలను అడ్డుకున్న‌ది క‌ర్నాట‌క పోలీసులు, అక్క‌డ ఉన్న‌ది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే

 కోర్టు ఆదేశాలున్నా జగన్ గారిపై బురదజల్లడమే ఎల్లోమీడియా లక్ష్యం

 రాజకీయ ప్రయోజనాల కోసం కుటుంబ వ్యవహారాలను వాడుకుంటున్నారు

 చంద్రబాబు, ఎల్లోమీడియా తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం

 2024 సార్వ‌త్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కలపై రిపోర్టర్స్ కలెక్టివ్ సంచ‌ల‌న నిజాలు

 చిత్తూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో 31,471 ఓట్ల తేడా

 పార్లమెంట్, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నిక‌లు జరిగినప్పుడు ఈ తేడా ఎలా వచ్చింది 

 సంస్థ వెల్లడించిన వివరాలకు ప్ర‌భుత్వం, ఈసీ సమాధానం చెప్పాలి

  మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు డిమాండ్ 

తాడేపల్లి: యలహంకలో జరిగిన పరిణామాలను అడ్డుపెట్టుకుని ఎల్లో మీడియా జగన్ గారిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వ‌జ‌మెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ యలహంకలో జరగరానిది జరగాలని చంద్ర‌బాబుతోపాటు ఎల్లోమీడియా చాలా కలలు కనింద‌ని, వారి కోరిక నెరవేరకపోవడంతో ఏమీ జరగకపోయినా జరిగినట్లుగా ఊహించుకుని కల్పిత కథనాలతో జగన్‌గారిని దూషించే కార్యక్రమం చేశారని మండిప‌డ్డారు. కుటుంబ వ్యవహారాలను సైతం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ చంద్రబాబు, ఎల్లోమీడియా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కలకు సంబంధించి ది రిపోర్టర్స్ కలెక్టివ్ సంస్థ వెల్లడించిన వివరాలపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు ఈ రెండు సంఖ్యల మధ్య 31,471 తేడా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం కలిగించేలా వాస్తవాలను వెల్లడించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు స్ప‌ష్టం చేశారు. 

ఆయ‌న ఇంకా ఏం మాట్లాడారంటే... 

2024 ఎన్నికల్లో ఓట్ల లెక్కలపై సమాధానం చెప్పాలి: 

2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడాలున్నాయని `ది రిపోర్టర్స్ కలెక్టివ్` అనే జర్నలిస్టుల సంస్థ తన పరిశోధనలో వెల్లడించింది. ఎన్నికల సంఘం రికార్డుల ఆధారంగా దేశవ్యాప్తంగా 51 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ వ్యత్యాసాలు ఉన్నాయని తెలిపింది. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో సాయంత్రం ఆరు గంటల తర్వాత ఓటు వేసేందుకు క్యూలో ఉన్నవారు 56,067 మంది కాగా, అదే పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆ సంఖ్య 24,596గా ఉంది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు ఈ రెండు సంఖ్యల మధ్య 31,471 తేడా ఎలా వచ్చింది? ఈ లెక్కలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి. పరకాల ప్రభాకర్‌గారు గతంలో ఈవీఎంలు, ఓట్ల లెక్కింపుపై లేవనెత్తిన ప్రశ్నలకు కూడా ఇప్పటివరకు సమాధానం లేదు. ది రిపోర్టర్స్ కలెక్టివ్ వెల్లడించిన వివరాలపై ఎన్నికల సంఘం, కూట‌మి పార్టీలు ఎందుకు స్పందించడం లేదు? ప్రజాస్వామ్యంలో ఓటు విలువను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది.

యలహంక పరిణామాలపై ఎల్లోమీడియా తప్పుడు కథనాలు: 

బెంగ‌ళూరులోని జ‌గ‌న్ గారి నివాసం యలహంకలో జరగరానిది జరగాలని ఎల్లోమీడియా చాలా కలలు కంది. పండుగ చేసుకోవాలని ఆశపడింది. చంద్రబాబు ప్రత్యేక స్క్రీన్‌ పెట్టుకుని ఎదురుచూశాడంట. రామోజీరావు కొడుకు కిరణ్, రాధాకృష్ణ కూడా చాలా చాలా ఊహించుకున్నారు. కానీ పాపం వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. వారి కోరిక నెరవేరకపోవడంతో ఏమీ జరగకపోయినా, తామే జరగనివి జరిగినట్టుగా ఊహించుకుని కల్పిత కథనాలతో జగన్‌గారిని దూషించే కార్యక్రమం చేశారు. ఈనాడు వాళ్లేమో మళ్లీ కోర్టులో విచారణ అని రాశారు. ఆంధ్రజ్యోతి వాళ్లేమో షర్మిలకు నో ఎంట్రీ, పెళ్లినగలు కూడా తీసుకోనివ్వరా? విజయలక్ష్మి కంటతడి అంటూ బురద రాశారు. అంతిమంగా ఎల్లో మీడియా లక్ష్యం జగన్ గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమేనని స్పష్టంగా అర్థమవుతోంది. అసలు జగన్ గారు అడ్డుకోవడం ఏంటి? అవి కోర్టు ఇచ్చిన ఆదేశాలు కాదా? కోర్టు ఆదేశాలు ఇస్తే ఆయన మీద పడి ఏడవడం ఏంటి? అసలు వాళ్లు చేస్తున్నది జర్నలిజమేనా? ఓవైపు కోర్టు ఆదేశాలు ఉన్నా యలహంకలో ఆయన నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించడం కరెక్టు కాదని ఎందుకు రాయలేకపోయారు? కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదా? కోర్టు ఆదేశాలను పాటించాలని షర్మిలకు సూచించింది కర్ణాటక పోలీసులే కదా? మరి జగన్ గారి మీద పడి ఏడవడం ఎందుకు? కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. షర్మిలకు నచ్చజెప్పింది కర్ణాటక పోలీసులే. అలాంటప్పుడు జగన్‌ అడ్డుకున్నాడని ఏ రకంగా తప్పుడు మాటలు మాట్లాడతారు?

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టులో ఏపీ పోలీసుల‌కు ఏం ప‌ని? : 
అసలు బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఏపీ పోలీసులకు ఏం పని? షర్మిల బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగేటప్పటికే పదులకొద్దీ ఏపీ పోలీసులు అక్కడ ఎందుకు ఉన్నారు? వారికి అక్కడ పనేంటి? కోర్టు ఉత్తర్వులను ధిక్కరించేలా షర్మిలకు ఏపీ పోలీసులతో చంద్రబాబు స్కెచ్‌ ఎందుకు వేశాడు? ఇది వాస్తవమా? కాదా? ఎయిర్‌పోర్టు నుంచి కొంతదూరం వచ్చిన తర్వాత మళ్లీ యలహంక నివాసానికి షర్మిల వచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా కోర్టు ఉత్తర్వులు చూపించి ఆమెకు సూచనలు చేసింది కర్ణాటక పోలీసులే కదా? మరి షర్మిల య‌ల‌హంక నివాసానికి రాకుండానే జగనే అడ్డుకున్నాడని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు? ఆ ఆస్తి తనది కాదని, తనది కాని ఆస్తిలోకి తాను వెళ్తున్నారని, కోర్టు వెళ్లవద్దని చెప్పిన విషయాలను ఇదే ఎల్లోమీడియా ఎందుకు చెప్పడం లేదు?

పెళ్లి నగలపై ఆధారాల్లేని కథనాలెందుకు?: 

షర్మిల పెళ్లినగలు తీసుకోనివ్వలేదని ఆంధ్ర‌జ్యోతిలో రాధాకృష్ణ రాశాడు. పెళ్లినగలు తీసుకుంటామన్నా వద్దన్నారా? మీతో ఎవరు చెప్పారు? రాధాకృష్ణ సమాధానం చెప్పాలి. ఇంతకన్నా దౌర్భాగ్యమైన రాతలు ఉంటాయా? ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో నువ్వు కట్టిన బిల్డింగ్‌ నాది అంటే ఇచ్చేస్తావా? అసలు నీ అల్లుడిని ఎందుకు అక్కడికి రానివ్వడం లేదు? అది చెప్పు. సొంత అల్లుడే కదా! ఇవి నేను అన్న మాటలు కావు, ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు. రామోజీ ఫిల్మ్‌సిటీలో పదులకొద్దీ విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. మరి వాటిని నావి అంటే ఈనాడు కిరణ్ ఇచ్చేస్తాడా? మీ ఆస్తులైతే ఒక మాట, ఇంకొకరి ఆస్తులైతే మరో మాటా? ఏమిటి ఈ రాతలు? ఏమిటి మీ ఆలోచనలు? సిగ్గుండాలి ఇలాంటి రాతలు రాయడానికి. జగన్‌గారు చట్టానికి బద్ధుడైన వ్యక్తి. చట్టప్రకారమే నడుచుకుంటారు తప్ప మీలా కాదు. విశాఖపట్నంలో లీజుకు ఇచ్చిన ఓనర్‌ భూమిని కార్పొరేషన్‌ వాళ్లు తీసుకుంటే, ఆ డబ్బును కూడా రామోజీరావు కొట్టేశాడు. అలాంటి బుద్ధి మా నాయకుడికి లేదు. అది గుర్తుపెట్టుకోవాల‌ని ఎల్లో మీడియాను అంబ‌టి రాంబాబు హెచ్చ‌రించారు.

Back to Top