తాడేపల్లి: కరువు వేళ రైతు కూలీలకు అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం వారి పొట్టకొడుతోందని వైయస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో అక్టోబర్ నెలలోనే రాష్ట్రంలోని 413 మండలాలను (62 శాతం) కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందని, ఈ పరిస్థితి చూస్తుంటే వచ్చే మార్చి నాటికి వంద శాతం రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. కరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం రైతులకు, రైతు కూలీలకు ఏం న్యాయం చేసిందని ప్రశ్నించారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ చట్టాన్ని రద్దు చేసి తీసుకొచ్చిన వీబీ జీ రామ్‌జీ చట్టం నిబంధనల ప్రకారం పని చేసిన 15 రోజుల్లోనే కూలీలకు వేతనాలు చెల్లించాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని గొప్పలు చెప్పుకునే మీరు.. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న కూలీలకు వేతనాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు" అని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ కూలీలకు పెండింగ్‌లో ఉన్న రూ.493 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని, 413 కరువు మండలాలకు అదనపు కేంద్ర నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కరువు ప్రాంతాల్లో రైతులు, రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు గ్రామాలు, మండలాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని, పశుపక్షాదులకు సైతం నీటి సదుపాయాలు కల్పించాలని వైఎస్సార్సీపీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని రవీంద్రరెడ్డి తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... రూ.493 కోట్ల ఉపాధి హామీ బకాయిలు: ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి రూ.132 కోట్లు, జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన వీబీ జీ రామ్‌జీ చట్టం కింద పనిచేసిన కూలీలకు రూ.361 కోట్లు కలిపి మొత్తం రూ.493 కోట్ల బకాయిలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. రెక్కల కష్టాన్ని నమ్ముకుని కుటుంబాలను పోషించుకునే కూలీలకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం శ్రమదోపిడీ కాదా? కూలీలను శ్రామికులుగా పిలవాలని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వీబీ జీ రామ్‌జీ చట్టం ప్రకారం పని చేసిన కూలీలకు 15 రోజుల్లోగా వేతనాలు చెల్లించాలని చట్టంలో స్పష్టంగా ఉన్నప్పటికీ ఎందుకు అమలు చేయడం లేదు? డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కూలీల కష్టానికి తగిన వేతనాలు కూడా చెల్లించలేకపోవడం సిగ్గుచేటు. 16 ఆర్థిక సంఘం నిధులు కాజేసే కుట్రతోనే స్థానిక ఎన్నికలు: 15వ ఆర్థిక సంఘం కింద జనవరిలో విడుదలైన రూ.1,026 కోట్ల నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగించకుండా చంద్రబాబు ఏం చేసినట్టు? గతంలో పదవీకాలం ఉన్న సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు ఆ నిధులను తమ ఖాతాల్లో జమ చేయాలని తీర్మానాలు చేసి ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదు. కేంద్రం గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం విడుదల చేసిన నిధులు ఎక్కడికి వెళ్లాయో తెలియని పరిస్థితి. అనంతపురం వంటి కరువు జిల్లాలో సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, శ్రీరామిరెడ్డి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుల్లో పనిచేసే కార్మికులకు ఏడు, ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. రూ.1,026 కోట్లలో కేవలం రూ.34 కోట్లు మాత్రమే విడుదల చేసి మిగిలిన నిధులను పెండింగ్‌లో పెట్టారు. కేంద్ర నిధులను వినియోగించకుండా, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా గ్రామాల్లో పన్నులు పెంచడం హేయం. 16వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన దాదాపు రూ.12 వేల కోట్ల నిధులను దృష్టిలో పెట్టుకునే స్థానిక సంస్థల ఎన్నికలను హడావుడిగా నిర్వహిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఆ నిధులను దిగమింగేందుకే చంద్రబాబు ఎస్ఐఆర్తో సంబంధం లేకుండా హడావిడిగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నాడని వెన్నపూస రవీంద్రరెడ్డి ఆరోపించారు.