ఆలయం కోసం రోడ్డు మళ్లించలేరా? కూల్చేస్తారా?

అదే ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి మాత్రం రోడ్డు మళ్లిస్తారా?

పవిత్ర ఆలయ చరిత్రను వక్రీకరిస్తూ అబద్ధపు ప్రకటనలు ఎందుకు?

ప్రభుత్వ తీరుపై భూమన కరుణాకర్‌రెడ్డి ఫైర్‌

తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి.

అభయాంజనేయ స్వామి ఆలయ కూల్చివేత క్షమించరాని పాపం

తాగుబోతులతో మూలవిరాట్‌ను తొలగించి, వైదిక సంప్రదాయాలని అబద్ధాలు చెబుతారా?

జిల్లా కలెక్టర్, మంత్రి ప్రకటనలపై మండిపడ్డ భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి: తిరుపతి సమీపంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని కూటమి ప్రభుత్వం కూల్చివేసిన తీరుపై వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. తిరుపతిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వేల సంవత్సరాల చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి క్షేత్ర పాలకుడి ఆలయాన్ని నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేయడాన్ని హిందూ ధర్మంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. సనాతన ధర్మ పరిరక్షణ అని నిత్యం నినదించే సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ దీనిపై ఇప్పటికీ స్పందించకపోవడాన్ని తీవ్రంగా తప్పు బట్టారు. ఆలయ కూల్చివేతపై వాస్తవాలను ఆధారాలతో సహా బయటపెడితే, కలెక్టర్‌ మరియు దేవాదాయ శాఖ మంత్రి పచ్చి అబద్ధాలతో కూడిన ప్రకటనలు ఇస్తూ భక్తులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించారు.
ప్రెస్‌మీట్‌లో భూమన కరుణాకర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

పల్లవుల కాలం నాటి పవిత్ర క్షేత్రాన్ని నేలమట్టం చేశారు:
    శ్రీ వేంకటేశ్వర స్వామి క్షేత్ర పాలకుడిగా, దట్టమైన అటవీ ప్రాంతంలో స్వయంభూగా వెలసిన అభయమూర్తి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా కూల్చివేసింది. 14వ శతాబ్దంలో పల్లవ రాజులు ఇక్కడ రాతి మంటపాన్ని, పక్కనే పుష్కరిణిని నిర్మించారు. సాక్షాత్తు అగస్త్య మహాముని, లోపాముద్రలు స్వామివారికి అభిషేకం చేసిన క్షేత్రమిది. అన్నమాచార్యులు తన కీర్తనల్లో ఈ స్వామిని కీర్తించారని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, వేటూరి ప్రభాకర్‌ శాస్త్రి వంటి మహనీయులు ఉటంకించారు. కంచి పీఠాధిపతులు మహా కుంభాభిషేకం నిర్వహించిన, రమణ మహర్షి దర్శించుకున్న ఇంతటి ప్రాశస్త్యం గల గుడిని అభివృద్ధి పేరుతో నేలమట్టం చేయడం అత్యంత దుర్మార్గం.

కలెక్టర్, మంత్రి ఆనం రామనారాయణరెడ్డివి పచ్చి అబద్ధాలు:
    ఆలయ కూల్చివేతను రుజువులతో సహా నేను నిరూపించాక, కలెక్టర్‌ వెంకటేశ్వర్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు అబద్ధపు ప్రకటనలు విడుదల చేశారు. ఐఏఎస్‌ అధికారి అయి ఉండి కలెక్టర్‌ రాజకీయ నాయకుడిలా వైఎస్సార్‌సీపీ పేరు ఎత్తి ప్రకటన ఇవ్వడం సరికాదు. వైదిక మంత్రోచ్చారణల మధ్య మూలవిరాట్‌ను భద్రంగా బాలాలయానికి తరలించామని వీరు చెబుతున్నారు. కానీ, నేను విడుదల చేసిన వీడియోలు, ఫోటోలు చూడండి.. మద్యం, గంజాయి సేవించిన కూలీలు సుత్తులు, గుణపాలతో మూలవిరాట్‌ను కొడుతూ, ద్రౌపదికి వస్త్రాపహరణం చేసినట్లుగా స్వామివారి వస్త్రాన్ని తొలగిస్తున్నారు. బయట ఉన్న ఉత్సవ విగ్రహాన్ని, రాములవారి విగ్రహాన్ని జేసీబీలతో తొలగించారు. ఇదేనా మీరు చెప్పే వైదిక సంప్రదాయం?

70 ఏళ్ల నాటి గుడి అనడం మంత్రి అజ్ఞానానికి నిదర్శనం:
    ఆ ఆలయం కేవలం 70 ఏళ్ల క్రితం గ్రామస్తులు కట్టిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం. 1861లో బ్రిటిష్‌ వారు మద్రాసు–బాంబే రైలు మార్గం వేసినప్పుడు, మామండూరు, రేణిగుంట మధ్య కేవలం 10 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ, ఈ ఆలయ వైశిష్ట్యం తెలిసే ఆంజనేయపురం రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. 1940లో రేణిగుంట రైల్వే స్టేషన్‌లో పనిచేసిన మా తండ్రి 65 ఏళ్ల క్రితమే నన్ను ఈ ఆలయానికి తీసుకెళ్లారు. మూలవిరాట్‌ స్వయంభూ కాదని మంత్రి మాట్లాడటం భక్తుల విశ్వాసాలను చెప్పుతో నలిపేయడమే. ఆలయం చిన్నదైతే కూల్చేస్తారా? అయ్యప్ప స్వామి విగ్రహం కూడా చిన్నదే కదా, తొలగిస్తారా? ఆ స్థానంలో మసీదు ఉంటే కూల్చే ధైర్యం మీకు ఉండేదా?

కార్పొరేట్‌ ఆసుపత్రి కోసం రోడ్డు మళ్లించి, ఆలయాన్ని కూల్చారు:
    జాతీయ రహదారి విస్తరణ కోసం తప్పలేదని సాకులు చెబుతున్నారు. ఆలయాన్ని కాపాడటానికి రోడ్డును మళ్లించే అవకాశం ఉన్నా మీరు మళ్లించలేదు. కానీ, కరకంబాడి దాటాక కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలో ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి వంద మీటర్ల దూరంలోనే ఆ హైవేను ఎందుకు మలుపు తిప్పారో సమాధానం చెప్పాలి. కార్పొరేట్‌ సంస్థల కోసం అలైన్‌మెంట్‌ మార్చిన మీరు, వేల ఏళ్ల నాటి ఆలయాన్ని మాత్రం కూల్చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు సమయంలో స్థపతి గణపతి, ఈమని శివనాగిరెడ్డిల నేతృత్వంలో ఎంతో శ్రమించి ఆలయాలను యథాతథంగా తరలించారు. మీరు మాత్రం జేసీబీలతో విగ్రహాలను ధ్వంసం చేశారు.

బాలాలయ పవిత్రతను మంటగలిపారు:
    అర్చకులు తప్ప మరెవ్వరికీ ప్రవేశం ఉండకూడని బాలాలయంలోకి మద్యం సేవించిన కూలీలు, చెప్పులు వేసుకున్న వ్యక్తులు, పచ్చ మీడియా సైన్యం దూరుతున్నారు. పూజా ద్రవ్యాలను తాగుబోతులతో మోయించడమే మీ సనాతన ధర్మమా? మేము గత ఐదేళ్లలో శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా 3,500కు పైగా ఆలయాలు నిర్మిస్తే, మీరు ఉన్న ఆలయాలను కూలుస్తున్నారు. ఆంజనేయుడి తల నరికిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ల చేతులు పాపపంకిలమయ్యాయి. మీరు దైవాగ్రహానికి గురి కాక తప్పదు. ఈ ఘోర కలిపై ప్రధానమంత్రి, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్‌ నేతలు తక్షణమే స్పందించాలి. కూటమి ప్రభుత్వం వెంటనే హిందూ జాతికి క్షమాపణలు చెప్పాలి,

పార్టీ అధ్యక్షుడి ఇంట్లో మహిళ మృతిపై విచారణ ఏదీ?:
    శ్రీనివాసం ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వెనుక ‘లక్ష్మీ నిలయం’ అనే ఇంట్లో గత నెల 27న ఒక మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. అది అపార్ట్‌మెంట్‌ కాదు. ఓ ప్రముఖ రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఉంటున్న సొంత ఇల్లు. ఆ ఇంటి మిద్దిపై మహిళ చనిపోతే, పోలీసులు గుర్తు తెలియని మహిళ ఆత్మహత్యగా కేసు కట్టి, ఎవరినీ విచారించకుండానే గుట్టుచప్పుడు కాకుండా దహన సంస్కారాలు చేయడం దారుణం. ఆ పార్టీ అధ్యక్షుడికి, చనిపోయిన మహిళకు ఉన్న అక్రమ సంబంధం గొడవల కారణంగానే ఆమెను హత్య చేశారనే నిజాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. అయితే, ఎప్పటికైనా నేరం చేసిన వారు బయట పడక తప్పదని భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top