ఏలూరులో స్వ‌ర్ణ‌ల‌త‌పై దాడి అమానుషం

దాడి చేసిన వారిని క‌ఠినంగా శిక్షించాలి

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగమల్లీశ్వరి డిమాండ్‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్ర‌తినిధి నాగ‌మ‌ల్లీశ్వ‌రి 

ప్రజా సమస్యలను ప్రశ్నించడ‌మే ఆమె చేసిన నేర‌మా? 

బాధితురాలి ఫిర్యాదు తీసుకోకుండా ఆమెపైనే పది కేసులు

పోలీసుల ముందే దాడి జరిగినా బాధితురాలికి రక్షణ కరువు

హోంమంత్రి అనిత, మహిళా కమిషన్ సమాధానం చెప్పాలి

స్వర్ణలతకు న్యాయం జరిగే వరకు వై స్సార్‌సీపీ అండగా ఉంటుంది

నాగ‌మ‌ల్లీశ్వ‌రి స్పష్టీక‌ర‌ణ 

తాడేపల్లి: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాల్సిన కూటమి ప్రభుత్వం, మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తూ దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని వైయ‌స్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగమల్లీశ్వరి తీవ్రస్థాయిలో విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను ప్రశ్నిస్తే బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారని, ఇదేనా మహిళలకు కల్పిస్తున్న రక్షణ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏలూరులో సామాజిక కార్య‌క‌ర్త నిట్టా స్వర్ణలతపై జరిగిన దాడి ఘటన ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే ఆమెను నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టడం, దాడికి పాల్పడటం అత్యంత ఆందోళనకరమన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ఏలూరు ఎమ్మెల్యేకు సన్నిహితుడిగా చెప్పబడుతున్న చల్లా వెంకట సత్య వరప్రసాద్ అలియాస్ కంప్యూటర్ ప్రసాద్‌పై స్వర్ణలత చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ, ఏలూరులో జరుగుతున్న దందాలు, అక్రమాలపై ప్రశ్నించినందుకే ఆమెపై దాడి జరిగిందని ఆరోపించారు. మహిళల భద్రతపై హోంమంత్రి అనిత, మహిళా కమిషన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. స్వర్ణలతకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, ఆమెకు న్యాయం జరిగే వరకు బాధితురాలి పక్షాన నిలబడతామని నాగ‌మ‌ల్లీశ్వ‌రి స్పష్టం చేశారు.

ఆమె ఇంకా ఏమ‌న్నారంటే... 

ఏలూరులో దారుణాల‌ను ప్ర‌శ్నించినందుకే దాడి: 

ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను నిలదీసినందుకే స్వర్ణలతపై దాడికి పాల్పడ్డారు. ఏలూరులో గత 30 నెలలుగా జరుగుతున్న దౌర్జన్యాలు, దందాలు, అక్రమ వసూళ్ల గురించి స్వర్ణలత 22 పేజీల ఫిర్యాదులో వివరించారు. డిప్యూటీ మేయర్ పదవిలో కొనసాగాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలంటున్నారు. మద్యం దుకాణాల నుంచి ఒక్కో షాపుకు రూ.5 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రశ్నించకూడదా? పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేసినా న్యాయం జరగకపోగా, బాధితురాలిపైనే పది కేసులు నమోదు చేయడం దారుణం. పోలీసుల కళ్ల ముందే దాడి జరుగుతున్నా అడ్డుకోలేని పరిస్థితి నెలకొంది.

హోంమంత్రి అనిత, మహిళా కమిషన్ సమాధానం చెప్పాలి: 
రాష్ట్రంలో సోషల్ యాక్టివిస్టులుగా, ప్రజా సమస్యలపై ప్రశ్నించే మహిళలుగా ముందుకొస్తున్న ఆడబిడ్డలకు రక్షణ క‌రువైంది. మహిళలపై దాడులు జరుగుతున్నా మహిళా కమిషన్ స్పందించక‌పోవ‌డం దారుణం. రెడ్‌బుక్ పేరుతో మహిళలను భయభ్రాంతులకు గురిచేసే రాజకీయాలకు స్వస్తి చెప్పాలి. భారత రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలి. స్వర్ణలతకు తక్షణమే పోలీసు రక్షణ కల్పించాలి. ఆమె ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి, దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలి. బాధితురాలిపైనే పెట్టిన కేసులను సమీక్షించాలి. పోలీసుల సమక్షంలో జరిగిన దాడిపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలి. మహిళలపై జరిగే దాడులను మహిళా కమిషన్ రాజకీయాలకు అతీతంగా స్పందించి అరికట్టాలి. స్వర్ణలతకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ ఆమెకు అండగా నిలుస్తుందని నాగమ‌ల్లీశ్వ‌రి స్ప‌ష్టం చేశారు.

Back to Top