అవినీతికి ప్రిప‘రేషన్‌’! 

రేషన్‌ సరుకుల టెండర్ల ఖరారులో ఆలస్యం  

డిసెంబర్‌ నుంచి పామాయిల్, కందిపప్పు, గోధుమ పిండి సరఫరా లేనట్టే 

పామాయిల్‌ సరఫరా కోసం రూ.600 కోట్ల టెండర్‌

ఏపీ ఆయిల్‌ఫెడ్‌ ఉండగా ప్రైవేటు కంపెనీల కోసం వెంపర్లాట 

బ్లాక్‌లిస్ట్‌ కంపెనీలు బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు పచ్చజెండా 

45వేల టన్నుల కందిపప్పు కోసం రూ.450 కోట్లతో టెండర్‌ 

ఏపీ వ్యాపారులను కాదని పొరుగు రాష్ట్రాలవారికి రెడ్‌కార్పెట్‌ 

టెండర్‌ లేకుండానే గోధుమపిండి సరఫరా కాంట్రాక్టు 

పర్సంటేజ్‌ల కోసం మంత్రి నాదెండ్ల బృందం బేరసారాలు  

అమరావతి: భారీ కుంభకోణాలు, అవినీతికి పాల్పడుతున్న చంద్రబాబు సర్కారు పేదలకు రేషన్‌ కార్డుల ద్వారా సరఫరా చేసే సరుకుల టెండర్లలోనూ అక్రమాలకు తెగబడుతోంది. పామాయి­ల్, కందిపప్పు, గోధుమపిండి సరఫరాలో కమీష­న్లు దండుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. పౌరసరఫరాల శాఖ మంత్రి బృందం కమీషన్ల కోసం సాగించిన బేరసారాల్లో ఆలస్యం కారణంగా ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. దీంతో సబ్సిడీపై దీపావళికే పామాయిల్, కందిపప్పు, గోధుమపిండి సరఫరా కావాల్సి ఉండగా, తీవ్ర జాప్యం జరిగింది. డిసెంబరులోనూ ఈ సరకుల పంపిణీ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. గత ఎన్నికల సమయంలోనే ఈ సరుకులు పంపిణీ చేస్తానన్న చంద్రబాబు హామీ వట్టి బూటకంగానే మిగిలిపోయింది.  

నిరుపేదల జీవితంతో చెలగాటం
చుక్కలనంటుతున్న నిత్యావసర ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు సర్కారు నిరుపేదల జీవితాలతో చెలగాటమాడుతోంది. రాష్ట్రంలో 1.49 లక్షల రేషన్‌ కార్డులు ఉండగా, 4.35 కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారు. ఇప్పటివరకు కార్డుదారులకు బియ్యం, చక్కెర మాత్రమే సర్కారు పంపిణీ చేస్తోంది. ఇకపై పామాయిల్, కందిపప్పు, గోధుమ పిండి కూడా సబ్సిడీపై సరఫరా చేస్తామని గత ఎన్నికల సమయంలో­నే చంద్రబాబు ప్రకటించారు. అయితే అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ధరలు చుక్కలనంటాయి.

రిటైల్‌ మార్కెట్‌లో పా­మాయిల్‌ లీటర్‌ గరిష్టంగా రూ.134,  కందిపప్పు కిలో రూ.­160, గోధుమపిండి కిలో రూ.55 వరకు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు మూడు నెలల పాటు పామాయిల్‌ లీటర్‌ రూ.125కు, కందిపప్పు కిలో రూ.100కు గోధుమపిండి కిలో రూ.25కు సరఫరా చేస్తామంటూ ఇటీవల చంద్రబాబు గొప్పగా ప్రక­టించారు. దీపావళి కల్లా వీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలూ జారీచేశారు. అయితే ఆచరణలో అది అమలుకు నోచుకోలేదు.    

ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్‌ఫెడ్‌ను కాదని.. 
ప్రస్తుతం కందిపప్పు, పామాయిల్‌ కోసం పౌరసరఫరాల సంస్థ టెండర్లు పిలవ­గా, కమీషన్ల కోసం సాగించిన బేరసారాలు దాదా­పు కొలిక్కివచ్చాయి. గోధుమపిండి కాంట్రాక్టును మాత్రం టెండర్లు లే­కుండానే నేరుగా కట్టబెట్టేందు­కు యత్నిస్తున్నారు. రేషన్‌కార్డు­ల ద్వారా పంపిణీ కోసం 44,644 కిలో లీటర్ల పామాయిల్‌ కొనుగోలు కోసం నవంబర్‌ 13న టెండర్లు పిలిచారు. 

ప్యాకింగ్, రవాణా, లో­డింగ్, అన్‌లోడింగ్‌ అన్నీ కలిపి దాదా­పు రూ.600 కోట్లకుపైగా విలువైన ఈ టెండర్‌ను వాస్తవానికి 23వ తేదీనే ఈ–ఆక్షన్‌ ద్వారా ఖరారు చే­యాల్సి ఉంది. వాస్తవానికి పామాయిల్‌తో సహా వే­రుశనగ తదితర వంటనూనెల సరఫరా చేసేందు­కు ప్రభుత్వరంగ సంస్థ అయిన ఏపీ ఆయిల్‌ఫెడ్‌ అందు­బా­టులో ఉంది. ఏటా లక్షలాది టన్నుల ఆయిల్‌ను రి­ఫైన్‌ చేసి విజయ బ్రాండ్‌ పేరిట మార్కెట్‌లోకి తీసుకొచ్చే ఈ సంస్థను కాదని కమీషన్ల కోసం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారు. 

కందుల టెండర్‌లోనూ నిబంధనలకు నీళ్లు  
రూ.450 కోట్ల విలువైన 45 వేల టన్నుల కందుల కోసం పిలిచిన టెండర్‌లోనూ నిబంధనలకు తిలోదకాలొదిలినట్టు కన్పిస్తోంది. జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్‌సీసీఎఫ్‌) ద్వారా టెండర్లు పిలిచారు. గతంలో రూ.10 కోట్లు ఉన్న వార్షిక టర్నోవర్‌ నిబంధనను ఏకంగా రూ.300 కోట్లకు పెంచడం, రోజుకు రూ.450 టన్నుల మిల్లింగ్‌ సామర్థ్యం, 90 కోట్ల బ్యాంక్‌ సాల్వెన్సీ, రూ.కోటి ఎర్నెస్ట్‌డ్‌ మనీ డిపాజిట్‌ (ఈఎండీ) కోరడం వంటి నిబంధనలు చేర్చడం చిన్న, మధ్యతరహా వ్యాపారులను తప్పించడానికేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా అక్టోబర్‌ 26న నోటిఫికేషన్‌ ఇచ్చి, 28వ తేదీ చివరి గడువుగా నిర్ణయించడం వెనుక మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేషీ మంత్రాంగం నెరిపినట్టు చెబుతున్నారు. 

టెండర్‌ లేకుండానే గోధుమ పిండి సరఫరా కాంట్రాక్టు 
నెలకు రూ.10.50కోట్ల విలువైన గోధుమపిండి సరఫరాకు టెండర్లు పిలవకుండానే నేరుగా తమ తాబేదార్లకు కట్టబెట్టేందుకు మంత్రి బృందం చక్రం తిప్పినట్టుగా తెలియవచ్చింది. కాగా కాంట్రాక్టు విలువలో కనీసం 10–15 శాతం కమీషన్‌ కోసం మంత్రాంగం జరుపుతున్నట్టు చెబుతున్నారు. దీంట్లో 50 శాతం నేరుగా మంత్రి బృందం, మిగిలిన 50 శాతం అధికార యంత్రాంగం పంచుకునేలా ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది.  

బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన కంపెనీలకు పెద్దపీట 
గతంలో బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టిన కంపెనీలనూ ఈ టెండర్‌లో పాల్గొనేందుకు పచ్చజెండా ఊపడం చూస్తుంటే కమీషన్ల కోసం నిబంధనలకు ప్రభుత్వ పెద్దలు ఏ స్థాయిలో పాతరేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏపీలో వ్యాపారులను కాదని, కమీషన్‌ ఎక్కువగా ముట్టజెప్పేందుకు సిద్ధమైన పొరుగు రాష్ట్రాల కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు పథక రచన చేసినట్టుగా చెబుతున్నారు. ఎలాంటి పరిశ్రమలూ లేని కేంద్రీయ బండార్‌ పేరిట ఏళ్ల తరబడి పామాయిల్‌ సరఫరా చేసే కాంట్రాక్టర్‌ ఎల్‌–1గా వచ్చేలా నిబంధనలనూ మార్చినట్టు స్పష్టమవుతోంది. పైగా ఫిబ్రవరి తర్వాత కూడా ఈ సరకులు పంపిణీ కొనసాగించే పక్షంలో ఆ మేరకు ఇప్పటికే టెండర్‌ దక్కించుకున్న వారికే సరఫరా కాంట్రాక్టును కట్టబెట్టేలా నిబంధనను మార్చారు. 

Back to Top