తాడేపల్లి: రాష్ట్రానికి రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పించామంటూ చంద్రబాబు, లోకేష్ గాలి మాటలు చెబుతున్నారని.. ప్రభుత్వానికి దమ్ముంటే ఆయా పెట్టుబడులు ఎక్కడ పెట్టారో, ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో అన్ని వివరాలతో రికార్డులు బయట పెట్టాలని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ సవాల్ విసిరారు. పెట్టుబడుల సదస్సు విఫలమైన తర్వాత మంత్రి లోకేష్ పిచ్చి పట్టినట్లు మాజీ సీఎం శ్రీ వైయస్ జగన్‌పై అవాకులు చెవాకులు పేలుతున్నారని, ఇదే కొనసాగిస్తే తామూ థీటుగా స్పందిస్తామని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కొండా రాజీవ్‌గాంధీ హెచ్చరించారు. ప్రెస్ మీట్లో కొండా రాజీవ్ గాంధీ ఇంకా ఏమన్నారంటే..: కూటమి పాలనలో అబద్దాల ప్రచారం: కూటమి రెండున్నరేళ్లుగా సాగిస్తున్న అక్రమాలు, అరాచకాల పాలన కాస్తా ఇప్పుడు అబద్దాల పాలనగా మారిపోయింది. సకల శాఖ మంత్రి అయిన నారా లోకేష్ పొద్దున లేస్తే అబద్ధాలు, మధ్యాహ్నం అబద్దాలు, రాత్రయితే అబద్దాలతో కాలం గడుపుతున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇలా అబద్దాలు మాట్లాడుతుంటే.. ఇక రాష్ట్రంలో విద్యాశాఖ పరిస్ధితి ఎలా ఉంటుందో మనం అర్దం చేసుకోవచ్చు. నిన్న కాక మొన్న విశాఖలో పెట్టిన పెట్టుబడుల సదస్సు తర్వాత చంద్రబాబు, లోకేష్ అనేక అబద్ధాలను ప్రచారం చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు, లోకేషే పరిశ్రమలు తీసుకొచ్చారనేలా ఈ ప్రచారం ఉంది. వీరి పిచ్చి పరాకాష్టకు చేరిందనడానికి ఈ అబద్దపు ప్రచారమే నిదర్శనం. జగన్‌గారిపై లోకేష్ పిచ్చి మాటలు: జగన్‌గారిని ఉద్దేశించి బర్నాల్ పేరుతో నారా లోకేష్ ఎక్స్ లో ఓ ట్వీట్ పెట్టారు. జగన్‌గారిని విమర్శించే స్దాయి తనది కాదని లోకేష్ గుర్తు పెట్టుకోవాలి. ఓ మంత్రి, ముఖ్యమంత్రికి కొడుకు అయిన మీరు.. ఓ మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు 40 శాతం ఓటు బ్యాంకు కలిగిన ఓ పార్టీ అధినేత, ఓ ప్రజా నాయకుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎందుకంటే, మాట అనడం చాలా సులువు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికీ మీ ఇల్లూ అంతే దూరమని గుర్తు పెట్టుకోండి. మీరు బర్నాల్ గురించి ప్రస్తావించారు, మేం జెల్యుసిల్ గురించి చెప్తున్నాం. మీ తల తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకుంటారు? మీరు ఇలా అవాకులు, చవాకులు పేలితే మేం వాస్తవాలతోనే కాదు, ఘాటైన విమర్శలు చేసేందుకూ వెనుకాడం. దమ్ముంటే ఆ రికార్డులు బయట పెట్టాలి: మీరు అధికారంలోకి వచ్చాక ఈ రెండున్నరేళ్ల కాలంలో మీరు ఎన్ని పెట్టుబడుల సదస్సులు పెట్టారు, మీ నాన్న గతంలో ఎన్ని పెట్టుబడుల సదస్సులు పెట్టారు. మీరు ఐదు పెట్టుబడుల సదస్సులు పెట్టారు. ఈసారి సదస్సు వదిలేస్తే , గతంలో పెట్టిన సదస్సుల ద్వారా రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 20 లక్షల పైచిలుకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఇంతకీ ఆ పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ఏంటి, అవి ఎక్కడున్నాయి, అవి ఇచ్చిన ఉద్యోగాలను ఎంత మంది చేస్తున్నారో వివరాలు వెల్లడించాలి. రెండున్నరేళ్లలో తెచ్చిన కంపెనీలు సున్నా: మీరు ఈ రెండున్నరేళ్లలో తెచ్చిన కంపెనీలు ఏంటని అడిగితే గుండు సున్నా. కేవలం నారా లోకేష్ అనే వ్యక్తి అబద్దాలను 2.0కి తీసుకెళ్లారు. నేనే కంపెనీలు తెచ్చానని చెప్తున్న లోకేష్.. అవేంటో అడిగితే చెప్పలేరు. పార్లమెంట్‌లో ఇదే ప్రశ్న మా ఎంపీ మిధున్‌రెడ్డి గారు అడిగితే కేంద్రమంత్రి జితిన్ ప్రసాద్ 10 ప్రాజెక్టులు మాత్రమే ప్రారంభం అయ్యాయని తేల్చేశారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ. 6962 కోట్లు అని, ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 22 అని కేంద్ర మంత్రి చెప్పారు. కానీ మీరు లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలని ఊదర గొడుతున్నారు. మీరు పెట్టిన పెట్టుబడుల సదస్సుల్లో ఏనాడైనా ఒక్క పారిశ్రామికవేత్తనైనా తీసుకొచ్చిన చరిత్ర మీకు ఉందా? జగన్‌గారు తన హయాంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పెడితే రిలయన్స్ అంబానీ, కరణ్ అదానీ, కుమార మంగళం బిర్లా, సజ్జన్ జిందాల్, నవీన్ జిందాల్, సంజీవ్ బజాజ్, పునీత్ దాల్మియా, అర్జున్ ఒబెరాయ్, సుమన్ సిన్హా, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది. ఇలాంటి గొప్ప పారిశ్రామిక వేత్తల్ని తీసుకొచ్చిన రికార్డు జగన్‌గారిది. కానీ మీరు పెట్టిన సదస్సులకు హాజరైన ఇలాంటి పారిశ్రామిక వేత్తల్ని చూపించగలరా? ఎన్టీఆర్ నుంచి జగన్ వరకూ అందరిపైనా విషప్రచారాలే: విద్యుత్ వాడకం ఆధారంగా పరిశ్రమల్ని లెక్కిస్తే 2023–24 కన్నా 2025–26లో తక్కువగానే ఉంది. ఆర్థిక వృద్ధి రేటులోనూ 0.15 శాతం మాత్రమే వృద్ధి ఉంది. ఆర్ధిక వృద్ధి రేటు పెరగలేదు. పన్నుల ఆదాయం పెరగలేదు. నిరుద్యోగిత తగ్గలేదు. అటువంటప్పుడు పెట్టుబడులు వచ్చాయని ఎలా చెబుతారు? అంటే మీ పెట్టుబడులన్నీ గాల్లో మేడలు, నీటిపై రాతలేనా? జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమలు తెస్తే, అవి పారిపోయాయని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరిమేస్తున్నారు: కానీ, నిజానికి ఇప్పుడు రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకపోవడం వల్ల, రాష్ట్రంలో ఎల్ ట్యాక్స్, ఎన్ ట్యాక్సులు డిమాండ్ చేయడం వల్ల పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారు. గత ఏడాది పెట్టుబడుల సదస్సులో వచ్చిన పెట్టుబడులు గ్రౌండ్ అయిన వివరాలను బయటపెట్టే దమ్ము చంద్రబాబు, లోకేష్ కు ఉందా? మొన్న విశాఖలో చిన్న పిల్లల్ని, విద్యార్దుల్ని తీసుకొచ్చి, సూటు, బూట్లు వేసి పారిశ్రామిక వేత్తలుగా చూపించారు. మీరు పెట్టిన పెట్టుబడుల సదస్సు విశాఖపై ప్రేమతో కాదు. రూపాయి పన్నుకు వేయి రూపాయలు ఖర్చు పెట్టడానికి, మొబిలిటీ అడ్వాన్స్ దోచుకుందామనే ఇదంతా చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు తేవాలనే ఉద్దేశం చంద్రబాబు, లోకేష్‌కు లేదు. నాడు జగన్‌గారి హయాంలో రెన్యూ పవర్‌తో 2023 జూన్ 20న 300 మెగావాట్ల విండ్ పవర్ కోసం జీవో ఎంఎస్ నెం:15 ఇచ్చాం. 2024 ఫిబ్రవరి 6న మరో 600 మెగావాట్ల పవర్ కోసం జీవో ఎంఎస్ నెం:16 ఇచ్చారు. కానీ చంద్రబాబు, లోకేష్ అధికారంలోకి వచ్చాక అదే రెన్యూ పవర్ 2025లో జీవో నెం:56 జారీ చేసి, 600 మెగావాట్ల విండ్ పవర్ అనుమతి రద్దు చేసిన మాట నిజం కాదా? ఇంకా హీరో ఫీచర్స్ కూడా రూ.30 వేల కోట్ల పెట్టుబడులతో వస్తే దాన్ని కాస్త రూ.15 వేల కోట్లకు తగ్గించేసి, రాకుండా అడ్డుకున్నారని కొండా రాజీవ్ గుర్తు చేశారు.