సముద్రంలో ఆరుగురు మత్స్యకారుల గల్లంతుపై మీడియాలో వస్తున్న కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయి

 వైయస్ జగన్

గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేయాలి

మత్స్యకారులను క్షేమంగా తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు చేపట్టాలి

కాకినాడ జిల్లా ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు మీడియాలో వస్తున్న కథనాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ నెల 4న చేపల వేటకు వెళ్లిన రెండు బోట్లలో ఒకటి తిరిగి రాగా, మరో బోటులోని ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం కలవరపాటుకు గురిచేస్తోందన్నారు. రోజుల తరబడి తమవారి కోసం ఎదురుచూస్తున్న మత్స్యకార కుటుంబాల ఆవేదనను అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.

గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ సహకారంతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే పొరుగు దేశాల అధికారులతోనూ సమన్వయం చేసుకుని మత్స్యకారులను క్షేమంగా తిరిగి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని కోరారు.

గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించిన శ్రీ వైయస్ జగన్, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

Back to Top