రెడ్ బుక్ ఎలక్షన్స్ రిగ్గింగ్ మ్యాన్ చంద్రబాబు

ఎలక్షన్స్ ను సెలక్షన్స్ గా మార్చేసారు

మాజీ మంత్రి విడదల రజిని ఫైర్ 

చిలకలూరిపేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి విడదల రజిని 

పోలీసులు, అధికారులు, ఎస్ఈసీతో చంద్రబాబు మరో కూటమి రూపకల్పన

ఈ వ్యవస్థల అధికారాలతో దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమ కేసులు

మాజీ మంత్రి విడదల రజిని మండిపాటు

రాష్ట్రాన్ని సౌత్ బిహార్ గా మార్చేశారు

హైకోర్టు రక్షణ కల్పించినా అభ్యర్థుల అక్రమ నిర్భందాలా..?

విడదల రజిని నిలదీత

తిమ్మాపురం ఘటనలో పోలీసులు స్పష్టత ఇవ్వాలి

హత్యాయత్నంగా ఎస్పీ చెబితే, పోలీసులు 41-ఏ నోటీసులు ఇచ్చి ఎలా పంపేస్తారు?

ప్రెస్ మీట్ లో విడదల రజిని సూటి ప్రశ్న 

చిలకలూరిపేట:  రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ ఎలక్షన్స్ రిగ్గింగ్ మ్యాన్ గా అవతరించారని వైఎస్సార్ సీపీ నాయకులు, మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలకలూరిపేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో ప్రస్తుతం మూడు పార్టీల కూటమి ప్రభుత్వంతో పాటు మరో కూటమి కూడా ఏర్పడిందని,  రాష్ట్ర ఎన్నికల కమిషన్, అధికారులు, పోలీసులు కలిసి ఏర్పడిన కూటమి అధికార పార్టీ కనుసన్నలలో మెలుగుతూ ఎలక్షన్స్ ను సెలక్షన్స్ గా మార్చేసాయని మండిపడ్డారు.  చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నికల్లో గెలిపించడం,  అసలు ఎన్నికలు జరగనీయకుండా  సెలక్షన్లు చేసి తమకు నచ్చిన వారిని గెలిచినట్లు ప్రకటించేందుకు పోలీసు వ్యవస్థ, అధికారులు, ఎస్ ఈసీ కూటమి పని చేస్తోందని ధ్వజమెత్తారు. గత మున్సిపల్ ఎన్నికలు, ఇటీవల పరిషత్ ఎన్నికలు, ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే విధానం కొనసాగుతోందని దుయ్యబట్టారు. టీడీపీ నాయకులు, గూండాలు, రౌడీలు, అధికారులు, పోలీసులు అందరూ కలిసి వైఎస్సార్‌సీపీపై యుద్ధం  సాగిస్తున్నారన్నారు.   రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జులు, ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని వేధింపులు,  అక్రమ నిర్బంధాలు, బెదిరింపులు, దాడులు, అక్రమ కేసులు, కుటుంబ సభ్యులపై ఒత్తిళ్లు వంటి చర్యలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.   
చిలకలూరిపేట నియోజకవర్గంలో  అర్ధరాత్రి వరకు నామినేషన్ ఉపసంహరణ కేంద్రాలను తెరిచి ఉంచడం, అభ్యర్థులను బలవంతంగా తీసుకెళ్లి ఉపసంహరణలు చేయించడం, అభ్యర్థులకు సంబంధం లేని ఉపసంహరణ పత్రాలను కూడా ఆమోదించడం వంటి ఘటనలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.  
ఈ ప్రెస్ మీట్ లో ఆమె ఇంకా ఏం మాట్లాడరంటే..: 

హైకోర్టు రక్షణ కల్పించినా అవే దౌర్జన్యాలా?: 
ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు చివరకు ఆంధ్రప్రదేశ్ ను సౌత్ బిహార్ గా మార్చేశారు.  స్వాతంత్రం  వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు హైకోర్టు నుంచి రక్షణ ఉత్తర్వులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. మా నియోజకవర్గంలో అభ్యర్థుల పేర్లతో సహా హైకోర్టును ఆశ్రయించి రక్షణ పొందాల్సిన దుస్థితి ఏర్పడింది.  హైకోర్టు నుంచి రక్షణ ఉత్తర్వులు తెచ్చుకున్న అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్లినా సరే వేధింపులు ఆగలేదు. అభ్యర్థుల జాబితాలను పోలీసులకు అందించిన తర్వాత పోలీసులే నేరుగా అవాస్తవ అభియోగాలను వారిపై మోపి పోలీస్ స్టేషన్లకు తరలించి అక్రమంగా నిర్బంధించడం ఎంతవరకు సమంజసం?    గతంలో ఎలాంటి కేసులు లేని వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే వారిని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తున్నారు. అభ్యర్థి నామినేషన్ వేయాలంటే అతను నేరస్థుడవుతాడా? భార్య నామినేషన్ వేయడానికి వెళ్తుంటే భర్తను ఎందుకు నిర్బంధిస్తారు?  పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ చూపించమని అడిగినా సరైన సమాధానం ఇవ్వకుండా దురుసుగా మాట్లాడుతున్నారు. పైగా పోలీస్ స్టేషన్లలోనే టీడీపీ నాయకులను పిలిపించి  నిర్భందించిన మా అభ్యర్థులతో రాజీలు చేయించే పరిస్థితి కనిపిస్తోంది.  నేను గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తిని.  జరిగిన అన్యాయంపై నిలదీస్తే, నాతోనే పోలీసు దురుసుగా, అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారంటే సామాన్య ప్రజలకు వారు ఎలాంటి న్యాయం చేస్తారో అర్థం చేసుకోవచ్చు.

తిమ్మాపురం ఘటనపై పోలీసులే సమాధానం చెప్పాలి: 
తిమ్మాపురంలో జరిగిన ఘటనపై ఏఎస్పీ   నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పలు విషయాలు వెల్లడించారు. లోకేష్ పీఏ వర్గానికి, బాలకృష్ణ పీఏ వర్గానికి మధ్య జరిగిన ఆధిపత్య పోరుగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. హత్యాయత్నానికి కుట్ర జరిగిందని, కత్తులు, రాడ్లు ఉన్నాయని చెబుతూ సుమారు 68 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. హత్యాయత్నానికి సంబంధించిన సెక్షన్లు నమోదు చేసిన తర్వాత వారికి 41ఏ నోటీసులు ఇచ్చి పంపించారు. అయితే, ఈ ఘటనలో అసలు ఏం జరిగింది? ఏఎస్పీ   వెల్లడించిన వివరాలు ప్రకారం హత్యాయత్నం ఎంతవరకు వాస్తవం? లేక రెండు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ఒక కథనాన్ని రూపొందించారా? దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉంది.  
ఒకవైపు తిమ్మాపురం ఘటనలో ఇంత తీవ్రమైన సెక్షన్లు నమోదు చేసి 41ఏ నోటీసులు ఇస్తున్నారు. మరోవైపు ఎడ్లపాడు మండలంలో నామినేషన్లు వేయడానికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీ నాయకులపై 40 మందికి పైగా కేసులు పెట్టి, వారిని గ్రామాలకు దూరంగా ఉంచుతున్నారు. వారు హైకోర్టును ఆశ్రయించిన తర్వాతే తిరిగి గ్రామాలకు వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది.  టీడీపీ నాయకులకు ఒక న్యాయం, వైఎస్సార్‌సీపీ నాయకులకు మరో న్యాయమా? పోలీసు వ్యవస్థలో ఈ వివక్ష ఎందుకు?
 
సమయం వచ్చినప్పుడు ప్రజలు సమాధానం చెబుతారు: 
చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎన్నికల పేరుతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, సామాన్య ప్రజలకు కలిగిస్తున్న ఇబ్బందులను ప్రజలు చూస్తున్నారు.  ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను నిర్వహించే ధైర్యం లేకపోవడం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక, ప్రజల్లో విశ్వాసం కోల్పోయి, అధికార బలంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. కూటమి  పార్టీల నేతలు, పోలీసులు, ఇతర అధికారులు ఎన్ని అరాచకాలు సాగిస్తున్నా సరే ధైర్యంగా నిలబడి పోరాటాలు సాగిస్తూ వైఎస్సార్ సీపీ  గెలుపు కోసం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటున్నా సరే ఏమాత్రం వెనుకడు వేయకుండా ముందుకు సాగుతున్న కార్యకర్తలకు, నేతలకు అభినందనలు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. జనం  సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రభుత్వం చేసిన ప్రతి తప్పుకు, ప్రతి అక్రమానికి ప్రజల ముందు సమాధానం చెప్పాల్సిన రోజు తప్పకుండా వస్తుంది. చంద్రబాబు, టీడీపీ నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని విడదల రజిని హెచ్చరించారు.

Back to Top