శ్రీసత్యసాయి జిల్లా: అమడగూరు మండలం మహమ్మదాబాద్‌లో వైయస్ఆర్‌సీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పాల శ్రీనివాసులు కిడ్నాప్‌కు గురయ్యారని వైయస్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ బెదిరింపులు చేసినా ఆయన వెనక్కి తగ్గకపోవడంతో ఈ ఘటనకు పాల్పడ్డారని పేర్కొన్నారు. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనివాసులను అర్ధరాత్రి 12 గంటల సమయంలో కొందరు వ్యక్తులు ఇంటికి వచ్చి ఆయన భార్య ఈశ్వరమ్మ ఎదుటే బలవంతంగా తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వైయస్ఆర్‌సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మహమ్మదాబాద్‌కు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకే టీడీపీ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారని దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. పల్లె రఘునాథరెడ్డికి ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని సవాల్ చేశారు. కిడ్నాప్‌కు గురైన అభ్యర్థి భార్య ఈశ్వరమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైయస్ఆర్‌సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.