నంద్యాల జిల్లా: శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం ఏ.కోడూరు గ్రామంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు, 50 కుటుంబాలు టీడీపీని వీడి వైయస్ఆర్‌సీపీలో చేరారు. శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సమక్షంలో నంద్యాల పద్మావతినగర్‌లోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మాజీ సాగునీటి సంఘం అధ్యక్షుడు వడ్డు వెంకటరెడ్డి, ఏ.కోడూరు సొసైటీ సింగిల్ విండో చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డితో పాటు చాగంటి రామేశ్వరరెడ్డి, చాగంటి నాగేశ్వరరెడ్డి, వడ్డు నాగిరెడ్డి, వడ్డు ప్రతాప్‌రెడ్డి, జమాల్‌బాషా, చెన్నయ్య, సుబ్బు, ఎం.వెంకటేశ్వర్లు తదితరులు వైయస్ఆర్‌సీపీలో చేరారు. టీడీపీ విధానాలు నచ్చకనే ఆ పార్టీ పదవులకు రాజీనామా చేసి వైయస్ఆర్‌సీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. సాగునీరు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులకు సకాలంలో నీరు అందక ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. శిల్పా చక్రపాణిరెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.