తెలంగాణ రాజకీయాల్లోకి జగన్ గారిని లాగొద్దు

ఏపీ కేటాయింపుల ప్రకారమే రాయలసీమ లిఫ్ట్ 

 చంద్రబాబు ఈ ప్రాజెక్టును తక్షణం పూర్తి చేయాలి

 వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ డిమాండ్ 

తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్

 కృష్ణా జలాలపై తెలంగాణ నేతల వాగ్వాదాలు

 మధ్యలో జగన్ ను లాగడం ఎందుకు ?

 రాయలసీమ కోసమే రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం

 బ్రజేష్, బచావత్ కేటాయింపుల ప్రకారమే నిర్మాణం

 పుత్తా శివశంకర్ స్పష్టీకరణ

 రాయలసీమపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష?

 రాయలసీమ లిఫ్ట్ ను 90శాతం పూర్తి చేసిన జగన్

 మిగతా 10 శాతం కూడా చంద్రబాబు పూర్తిచేయలేరా?

 పూర్తి చేయకపోగా శిష్యుడు రేవంత్ తో కలిసి కుట్రలు

 పుత్తా శివశంకర్ ఫైర్ 

 తాడేపల్లి:    రాయలసీమ లిప్ట్ విషయంలో తెలంగాణ పార్టీలు వాదులాడుకుంటూ, మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని లాగడం సరికాదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ స్పష్టం చేశారు. తాగునీరు, సాగునీరు అందని రాయలసీమ ప్రాంతం కోసమే, గతంలో ఉన్న కేటాయింపుల ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు చేపట్టారని, ఇది కొత్త ప్రాజెక్టు కూడా కాదని తెలిపారు. ఈ ప్రాజెక్టులో 90 శాతం పనుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తే.. మిగిలిన 10 శాతం పనులు కూడా పూర్తి చేయకుండా చంద్రబాబు తన శిష్యుడు రేవంత్ రెడ్డితో కలిసి కుట్రలు చేస్తున్నారని పుత్తా శివశంకర్ ఆక్షేపించారు. ఇప్పటికైనా ఈ పనులు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
ప్రెస్ మీట్లో పుత్తా శివశంకర్ ఇంకా ఏమన్నారంటే..    

- మీ రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారిని లాగుతారా ?

కృష్ణా జలాల అంశంపై తెలంగాణలో పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ లు పరస్పరం కౌంటర్లు ఇచ్చుకుంటూ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తెస్తున్నారు కాబట్టి మేం స్పందించాల్సి వస్తోంది. గత 30 ఏళ్లుగా కృష్ణా నదిలో నీటి లభ్యత తగ్గిపోతోంది. అప్పుడప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆ నీటిని విద్యుత్ అవసరాల కోసం వాడుకుని, ఇష్టానుసారంగా కిందకు వదిలేస్తుంటారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా పూర్తి స్ధాయిలో నీళ్లు తీసుకెళ్లాలంటే కనీసం 881 అడుగుల నీటి నిల్వ ఉండాలి. 854 అడుగులకు నిల్వ పడిపోతే మాత్రం కేవలం 7 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. దీని వల్ల రాయలసీమ ప్రాంతానికి సాగునీరే కాదు, ప్రజలకు తాగునీరు కూడా లభించని పరిస్ధితి. శ్రీశైలంలో 881 అడుగుల నీటి మట్టం కనీసం వారం రోజులు కూడా లేని పరిస్ధితి 30 ఏళ్లుగా ప్రతీ ఏడాదీ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్ధితుల్లో రాయలసీమ లిఫ్ట్ మాకు కనీస గ్యారంటీ పథకం. మేం కొత్త ప్రాజెక్టులు కట్టడం లేదు, కొత్త రిజర్వాయర్లు కట్టడం లేదు, మాకు కేటాయించిన నీటి నుంచే మేం తీసుకోవాలనుకుంటున్నాం. బచావత్, బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్స్ గతంలో చేసిన కేటాయింపుల ప్రకారమే నీటిని తీసుకెళ్లేందుకు రాయలసీమ లిఫ్ట్ ను మేం అడుగుతున్నాం. గతంలోనూ తెలంగాణ ప్రాంత నేతలు రాజశేఖర్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 క్యూసెక్కులకు పెంచుతుంటే ఇలాగే రాద్దాంతం చేశారు. 

- రేవంత్ తో కలిసి రాయలసీమ లిఫ్ట్ అడ్డుకుంటున్న చంద్రబాబు 

రాజశేఖర్ రెడ్డి గారు చేవెళ్ల-ప్రాణహిత ద్వారా తెలంగాణ ప్రాంతానికి, పోతిరెడ్డి పాడు సామర్ధ్యం పెంచి రాయలసీమ ప్రాంతానికి, పోలవరం ద్వారా ఉత్తరాంధ్రకు, పులిచింతల ద్వారా డెల్టా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నించారు. ప్రకాశం-నెల్లూరు ప్రాంతాలకు వెలిగొండ ప్రాజెక్టును కూడా ఇలాగే చేపట్టారు. ఇలా రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి తాగునీటి, సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఆయన ప్రయత్నించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ చేపడితే, దాన్ని 90 శాతం పూర్తి చేస్తే.. నేడు అధికారంలో ఉన్న చంద్రబాబు 2024లో వచ్చీ రాగానే తెలంగాణలో తన శిష్యుడు రేవంత్ రెడ్డి మెప్పు కోసం, ఆయన అవసరాల కోసం కుట్రలు మొదలుపెట్టారు. రాయలసీమ లిఫ్ట్ కు జస్ట్ పంపులు బిగించి, మోటార్లు రన్ చేస్తే నీళ్లు తెలుగుగంగ, గాలేరు-నగరి, కేసీ కెనాల్ కు నీళ్లు పారించే అవకాశం ఉన్నా.. చంద్రబాబుతో కలిసి తామే అడ్డుకున్నట్లు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పుకున్నారు. రాయలసీమ వంటి వెనుకపడిన ప్రాంతానికి నీరు అందించే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు గురించి తెలంగాణ నాయకులకు ఇన్ని రాజకీయాలు అవసరం లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరురాష్ట్రాల ప్రజల శ్రేయస్సే ముఖ్యం, మా రాష్ట్రం విషయంలో రాజీపడబోమని పదే పదే చెప్పారు. విశాఖలో ప్రధాని మోడీ వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని తేల్చిచెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అదనంగా కొత్త ఆయకట్టు తెచ్చేదీ కాదు, కేటాయింపులు లేకుండా నీళ్లు తీసుకునేందుకు కూడా కాదు. 

- ఇప్పటికైనా రాయలసీమ లిఫ్ట్ ను పూర్తి చేయాలి

తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి ద్వారా 800 అడుగుల నుంచే మొత్తం నీళ్లు తోడేస్తున్నారు. 787 అడుగులు నీళ్లు ఉండి, డెడ్ స్టోరేజ్ ఉన్నా నీళ్లు వాడేసుకుంటున్నారు. కాబట్టి మీరు, మీరు రాజకీయాలు మాట్లాడుకోండి. కానీ మధ్యలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని లాగడం సరికాదని మీకు చెప్పదల్చుకున్నాం. మా రాయలసీమ, ఉత్తరాంధ్ర, కృష్ణా డెల్టా ప్రాంతం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి సమగ్ర ప్రణాళిక విషయంలో మేం ఎక్కడా రాజీపడేది లేదు. రాయలసీమ లిఫ్ట్ విషయంలోనూ మిగతా 10 శాతం పనులు పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాయలసీమ ప్రాంతమంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష? రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు కోసం 90 శాతం డబ్బుల్ని కూడా మా హయంలో చెల్లించాం. ఆ మోటార్లు తెచ్చి బిగించడం ఒక్కటే మిగిలి ఉంది. దీని వల్ల తెలంగాణలో ఉన్న మీ శిష్యుడికి వచ్చిన నష్టమేమీ లేదు. చంద్రబాబు రాయలసీమకు కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. దీన్ని అడ్డుకోకపోతే చాలు. అందుకే ఇప్పటికైనా రాయలసీమ లిఫ్ట్ ను ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమలో భూములకు సాగునీరు, ప్రజలకు తాగునీటికి ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయనే తాము ఈ డిమాండ్ చేస్తున్నట్లు పుత్తా శివశంకర్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

Back to Top