ఆస్ప‌త్రి కోసం రోడ్డు అలైన్మెంట్ మార్చ‌గా.. 

ఏళ్ల చరిత్ర ఉన్న ఆల‌యం కోసం మార్చ‌లేరా? 

 తిరుప‌తిలో అభయ ఆంజనేయ స్వామి ఆలయ కూల్చివేత హిందూ ధర్మంపై దాడే

  వైఎస్సార్‌సీపీ నాయ‌కులు మ‌ల్లాది విష్ణు, వెలంప‌ల్లి శ్రీనివాస్ ధ్వ‌జం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు

 బుల్డోజర్లతో కొండను కొట్టినట్టు ఆలయాన్ని కూల్చడం అత్యంత హేయం

 ఆగమశాస్త్రం ప్రకారం ధ్యానాధివాసం, జలాధివాసం ఎందుకు పాటించలేదు?

 చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం

  మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హెచ్చ‌రిక 

తాడేపల్లి: తిరుపతి సమీపంలోని అంజనాపురంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన అభయ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని బుల్డోజర్లు, జేసీబీలతో నిర్దాక్షిణ్యంగా కొండను కొట్టినట్టు కొట్టేయడం హిందూ ధర్మంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని వైఎస్సార్‌సీపీ నేతలు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వారు మీడియాతో మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పేరుతో వందల ఏళ్ల చరిత్ర గల ఆలయాన్ని కూల్చడం కంటే రోడ్డు అలైన్‌మెంట్ మార్చుకోవచ్చు కదా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అదే రోడ్డులో పైన ఉన్న ఆసుపత్రి కోసం రోడ్డు అలైన్‌మెంట్ మళ్లించిన కూటమి ప్రభుత్వం, దేవాలయం విషయంలో ఎందుకు అదే విధంగా వ్యవహరించలేకపోయిందని నిలదీశారు. ప్రభుత్వ దుర్మార్గపు చర్యతో కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయని మండిపడ్డారు. దేవాలయాన్ని తొలగించే ముందు ఆగమశాస్త్ర ప్రకారం పాటించాల్సిన ధ్యానాధివాసం, జలాధివాసం వంటి సంప్రదాయాలను ఎందుకు పాటించలేదని నిలదీశారు. శాస్త్రోక్తంగా జరగాల్సిన కార్యక్రమాన్ని దౌర్జన్యపూరితంగా చేయడం అత్యంత హేయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంజనాపురంలో ఆంజనేయ స్వామి ఆలయ కూల్చివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు, దేవాదాయ శాఖ తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. కూల్చిన చోటే ఆలయాన్ని యథాతథంగా పునర్నిర్మించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇదే ధోరణిని కొనసాగిస్తే హిందూ భక్తులు, పీఠాధిపతులు, స్వామీజీలందరినీ కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు హెచ్చరించారు.   

ఎవ‌రెవరు ఏం మాట్లాడారంటే... 

ఆలయాల విధ్వంసమే కూటమి ప్రభుత్వ విధానం:  
- మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే

పల్లవుల కాలం నాటి చారిత్రక నేపథ్యం ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం క్షేత్రపాలకుడు అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని 'చిన్నపాటి టెంపుల్' అంటూ టీడీపీ నేతలు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమర్థించుకోవడం సిగ్గుచేటు. పెళ్లిళ్లు కానివారు, సంతానం లేనివారు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచే ఆలయ గోపురాలు, ప్రాకారాలు, శిల్పాలను అరాచకంగా నేలమట్టం చేశారు. రాష్ట్రంలో అసలు దేవాదాయ శాఖ ఉందా, లేక నిద్రపోతోందా అని అడుగుతున్నాం. మా నాయకుడు వైఎస్ జగన్ గారి హయాంలో ధూపదీప నైవేద్యాల పథకం, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేల ఆలయాల నిర్మాణం జరిగితే.. కూటమి ప్రభుత్వంలో మాత్రం ఆలయాల విధ్వంసం జరుగుతోంది. గతంలో కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో చంద్రబాబు కూల్చేసిన ఆలయాలను మేము అధికారంలోకి వచ్చాక పునర్నిర్మించాం. ఈ ప్రభుత్వంలో దేవుడి సొమ్ముకు, భక్తుల ప్రాణాలకు, గోమాతలకు, అర్చకులకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది.

- వరుస అపచారాలకు నిలయంగా ఆలయాలు: 

వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోవడం, శ్రీకూర్మంలో తాబేళ్లు మృత్యువాత పడటం, కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట, చోరీ జరగడం, సింహాచలంలో గోడ కూలి భక్తులు చనిపోవడం, సింహాచలం, చిన్న తిరుపతిలో గోవులు మరణించడం, శ్రీశైలంలో శివభక్తులపై లాఠీఛార్జి చేయడం, కాశీనాయన ఆలయంపై బుల్డోజర్లు నడపడం, శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించడం... ఇవన్నీ ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా?

- బూట్లతో ఆలయంలోకి వెళ్లి అర్చకుడిపై దాడి: ⁠
ఏలూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీడీపీకి చెందిన ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఏతకోట శ్రీనివాసరావు ఏకంగా బూట్లు వేసుకుని గుడిలోకి వెళ్లి, అర్చక స్వామిపై దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తిపై కంప్లైంట్ ఇవ్వొద్దని స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చి రాజీ చేయించే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. రాజకీయ అవసరాల కోసం తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, ఎన్డీఏ నేతలు కపట నాటకాలు ఆడారు. కానీ అక్కడ ఎలాంటి కల్తీ జరగలేదని సిట్, సీబీఐ నివేదికల ద్వారా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేవాదాయ భూములను కట్టబెట్టేందుకు నియంత ధోరణిలో తీసుకొచ్చిన 139 జీవోను తక్షణమే విత్‌డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

సనాతన ధర్మం అంటూ ఊగిపోయిన పవన్ ఇప్పుడేమయ్యారు?: 
- వెలంప‌ల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి

కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో బుల్డోజర్ల రాజ్యం నడుస్తోంది. అధికార దర్పంతోనే దేవాలయాలను అడ్డగోలుగా కూల్చే ఘనత చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఆలయాన్ని కూల్చేసి 'మేము రూ. 50 లక్షలు ఇచ్చేశాం, చేతులు దులిపేసుకుంటున్నాం' అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడటం సమంజసం కాదు. భూమన కరుణాకర్ రెడ్డి గారు అక్కడికి వెళ్లి వీడియో తీసి మీడియాకు చూపెట్టకపోతే ఈ ఘోరాలు బయటికి వచ్చేవి కాదు. పక్క రాష్ట్రంలోని ఆంజనేయ స్వామి గుడికి తిరుపతి నుంచి డబ్బులు ఇప్పించానని ఘనత చెప్పుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆయ‌న అధికారంలో ఉన్న రాష్ట్రంలో వారి ఇలవేల్పు ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లతో కూల్చేస్తుంటే ఎందుకు మాట్లాడట్లేదు? మొన్న తిరుపతిలో 'అన్ అపాలజెటిక్ సనాతని' అంటూ ఊగిపోయిన ఆయ‌న‌, ఈ దేవాలయం కూల్చినప్పుడు ఏమైపోయారు? సింహాచలం కొండలను ప్రైవేట్ కంపెనీలు బోడిగుండ్లు చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అక్కడికి వెళ్లడం లేదు?

అధికారంలో లేనప్పుడు మాత్రమే హిందూ దేవాలయాలు, భక్తుల గురించి మాట్లాడే బీజేపీ నేతలు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి ఆలయాల కూల్చివేతపై ఎందుకు నోరు మెదపడం లేదు. ఓట్ల కోసం 'జై శ్రీరామ్' అనడం కాదు.. ఆంజనేయ స్వామి గుడికి నీడ లేకుండా చేస్తుంటే సమాధానం చెప్పాలి. గతంలో మా నాయకుడు జగన్ గారు విజయవాడ అమ్మవారి ఆలయానికి మాస్టర్ ప్లాన్ తెచ్చి అభివృద్ధి చేస్తే, నేడు కూటమి పాలనలో టికెట్ల రీసైక్లింగ్ దందా నడుస్తోంది. మచిలీపట్నంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులను కేశినేని చిన్నికి రాసిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

Back to Top