శ్రీకాకుళం: రాష్ట్రంలో రెండో విడత మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ శ్రీకాకుళంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కార్పొరేషన్ ఎన్నికలకు వైయస్ఆర్‌సీపీ జనరల్ ఏజెంట్‌గా ఉన్న ఆయనను బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంపై పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరు వైయస్ఆర్‌సీపీ నేతలను అదుపులోకి తీసుకుని ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శ్రీకాళహస్తిలోనూ వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లు, నేతలపై ఆంక్షలు కొనసాగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. 18వ వార్డులో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్ ఫరీద్‌ను అరెస్ట్ చేయడంతో పాటు 24, 26వ వార్డుల్లో ఏజెంట్లను బయటకు పంపించారని పేర్కొన్నారు. ఊరందూరులో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్ నవీన్‌పై దాడి జరిగిందని, ఐదుగురు ఏజెంట్లను అరెస్ట్ చేశారని తెలిపారు. నెల్లూరు జిల్లాలో కావలి, గూడూరు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను అడ్డుకున్నారని, కావలి రూరల్ మండలం చెన్నైపాళెంలో వైయస్ఆర్‌సీపీ నేత ప్రసాద్‌ను కిడ్నాప్ చేశారని పార్టీ నేతలు ఆరోపించారు. కావలి ప్రాంతంలో ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేసి, బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. నంద్యాలలో కానాల గ్రామంలోని పోలింగ్ కేంద్రాల వద్ద మున్సిపల్ చైర్మన్ డాక్టర్ బాబన్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారని వైయస్ఆర్‌సీపీ వర్గాలు ఆరోపించాయి. పోలీసులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం 10వ వార్డులో వైయస్ఆర్‌సీపీ నాయకుడు వడ్డి రఘురామ్ నాయుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లాలో 21 ఏళ్ల తర్వాత రాజాం పురపాలక ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు తదితర జిల్లాల్లో చోటుచేసుకున్న పరిణామాలతో రెండో విడత మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వేడి కొనసాగుతోంది.