శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేయిస్తూ, పోలింగ్ ఏజెంట్లను విధులకు దూరంగా ఉంచుతోందని తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి మండిపడ్డారు. శ్రీకాళహస్తిలోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచే ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని నిర్బంధాలు ప్రారంభించారని తెలిపారు. వైయస్ఆర్‌సీపీ మైనారిటీ నాయకుడు పఠాన్ ఫరీద్‌తో పాటు పార్టీ నేతలు రామచంద్రారెడ్డి, సిరి నాగేశ్వరరావు, పగడాల రాజులను పోలీసులు నిర్బంధించారని ఎంపీ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లినా అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించడం దారుణమన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వైయస్ఆర్‌సీపీకి అడ్డంకులు 20, 26వ వార్డుల పరిధిలో బయటి ప్రాంతాల నుంచి సుమారు 200 మంది వ్యక్తులు గుమిగూడి వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పోలింగ్ కేంద్రాల వద్దకు రానీయకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదులు అందాయని గురుమూర్తి తెలిపారు. 34వ వార్డులో పోలింగ్ ఏజెంట్ నవీన్‌ను కొట్టి బయటకు పంపించారని పేర్కొన్నారు. శరవణతో పాటు ఆరుగురు ముఖ్య నాయకులకు బైండోవర్ నోటీసులు ఇచ్చి పట్టణంలో ఉండకూడదంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారని ఎంపీ తెలిపారు. సూరా సురేష్, పఠాన్ ఫరీద్, షేక్ మహమ్మద్ బాషా తదితర నాయకులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీ జనరల్ పోలింగ్ ఏజెంట్ నియామక పత్రాల విషయంలోనూ అధికారులు ఇబ్బందులు సృష్టించారని, జిల్లా కలెక్టర్ జోక్యంతో అనుమతి లభించిందన్నారు. భయరహితంగా ఓటు వేసే అవకాశం కల్పించాలి ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులు కల్పించాలని గురుమూర్తి కోరారు. పోలీసు అధికారులు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్ట ప్రకారం వ్యవహరించాలని, నిర్బంధంలో ఉన్న వైయస్ఆర్‌సీపీ నాయకులను విడుదల చేయాలని కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారులు తక్షణమే పరిశీలించాలని స్పష్టం చేశారు. అక్రమాలు కొనసాగితే వైయస్ఆర్‌సీపీ ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేపడుతుందని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.