తాడేపల్లి: రాయలసీమ ప్రజల నీటి అవసరాలకు భరోసా కల్పించే ఇన్సూరెన్స్‌లాంటి రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని అనవసరంగా భూతద్దంలో చూపిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తనకు పేరు వస్తుందనే కారణంతో దాదాపు పూర్తయిన ప్రాజెక్టు పనులను ఆపేశారని, హాట్‌లైన్ రాజకీయాల కోసం రాయలసీమ ప్రయోజనాలను బలిపెట్టారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. - వైయస్ జగన్ ఎక్స్ వేదికగా.. రాయలసీమ లిఫ్ట్ స్కీంపై, తెలంగాణలో పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం వాస్తవాలను మరుగున పరుస్తోంది. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన చంద్రబాబు తన హాట్‌లైన్ కాంగ్రెస్‌తో దోస్తీ రాజకీయాలకోసం మౌనంగా ఉన్నాడు. మా ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ స్కీం కొత్త ప్రాజెక్టు కాదు! దీనికి అదనపు నీటి కేటాయింపులు లేవు, కొత్త కాల్వలు లేవు, అదనపు రిజర్వాయర్లు లేవు, అదనపు ఆయకట్టూ లేదు! అదే కృష్ణానది, అవే నీళ్లు, అవే కేటాయింపులు, అదే పోతిరెడ్డిపాడు నుంచి అవే కాల్వల ద్వారా దుర్భిక్ష పరిస్థితులను తరచుగా ఎదుర్కొనే, అవే రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన, అవే జలాలనే సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఒక ఇన్సూరెన్స్ స్కీం లాంటిదే ఈ పథకం. కొన్ని దశాబ్దాలుగా కృష్ణానది ద్వారా రాష్ట్రానికి వచ్చే నీళ్లు తగ్గిపోతున్న నేపథ్యంలో, పైనుంచి నీళ్లు రాకపోవడం ఒక సమస్య అయితే, వచ్చిన ఆ నీటిని కూడా తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఇష్టానుసారంగా దిగువకు వదిలేయడం మరొక తీవ్రమైన సమస్య. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా, శ్రీశైలం నుంచి పూర్తిస్థాయిలో, అంటే 44వేల క్యూసెక్కుల నీళ్లు పారాలంటే శ్రీశైలంలో నీటిమట్టం కనీసం 880 అడుగులపైన ఉండాలి. ఆ నీటి మట్టం 854 అడుగుల దిగువకు పడిపోతే అసలు నీళ్లే పంపలేం. ఆ 880 అడుగులపైన రిజర్వాయర్ లెవల్ ఎన్నిరోజులు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. దీనివల్ల రాయలసీమ తాగునీటి, సాగునీటి అవసరాలు తీరడం అసాధ్యంగా మారుతూ వస్తోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రం శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని తీసుకునేందుకు, పాలమూరు-రంగారెడ్డి ద్వారా రోజుకు 1.5 టీఎంసీలు, డిండి ద్వారా 0.5 రోజుకు టీఎంసీ, కల్వకుర్తి ద్వారా రోజుకు 0.4 టీఎంసీ , ఎస్‌ఎల్‌బీసీ ద్వారా రోజుకు 0.5 టీఎంసీ, మొత్తంగా దాదాపుగా రోజుకు 3 టీఎంసీలు తరలించే సామర్థ్యంతో జోరుగా ముందుకెళ్తోంది. వీటికి తోడు 800 అడుగుల నుంచే విద్యుత్ ఉత్పత్తి పేరిట నీటిని వదిలేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రత్యామ్నాయంగా వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్ స్కీంను చేపట్టాం. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకోలేని సంక్లిష్టమైన పరిస్థితుల్లో లిఫ్ట్ చేసి, అదే పోతిరెడ్డిపాడు కాల్వలోకి నీటిని ఎత్తిపోసి, ఇప్పటికే ఉన్న పాత రిజర్వాయర్లకు చేరవేయడమే ఈ పథకం ఉద్దేశం. నీటి కేటాయింపులు ఉన్నా, వినియోగించుకునే అవకాశం లేకపోతే ఆ కేటాయింపులకు సార్థకత ఏముంటుంది? అదనపు నీటి కేటాయింపులు, అదనపు రిజర్వాయర్లు లేనప్పుడు ఈ పథకం వల్ల ఎవరికి, ఏం నష్టం వస్తుంది? ప్రజల దాహార్తిని తీర్చే ఇన్సూరెన్స్ లాంటి రాయలసీమ లిఫ్ట్ స్కీంను భూతద్దంలో చూపించడం భావ్యమా? దురదృష్టవశాత్తూ, దాదాపుగా పూర్తయిన రాయలసీమ లిఫ్ట్ పనులను చంద్రబాబుగారు అధికారంలోకి రాగానే, ఎక్కడ జగన్‌కు పేరువస్తుందోనని ఆపేశారు. ఈ పథకాన్ని పూర్తిచేయాల్సింది పోయి, ఎవరైనా అభ్యంతరం చెప్తే, దాని ఆవశ్యకతను బలంగా వినిపించాల్సిందిపోయి, హాట్‌లైన్ రాజకీయాలకోసం బలిపెట్టారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరువులాంటి విపత్కర పరిస్థితుల్లో హక్కుగా కేటాయించిన నీటిని కూడా వినియోగించుకునే అవకాశాన్ని దెబ్బతీసి, రాయలసీమ ప్రజల ప్రాణాధారానికే ఉరివేశాడు.