పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ కూటమి అక్రమాలు

అయినా మరోసారి చోద్యం చూస్తూ ఉండిపోయిన ఎస్ఈసీ

ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం తప్పదు

వైయ‌స్ఆర్‌సీపీ నేతల హెచ్చరిక

విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఎస్ఈసీని కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అక్రమాలపై ఫిర్యాదు చేసిన వైయ‌స్సార్సీపీ నేతలు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం ) నలమారు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు. అనంతరం మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి శ్రీనివాస్, కొమ్మూరి కనకారావు, నలమారు చంద్రశేఖర్ రెడ్డి..

విజయవాడ:    రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల తొలిదశ, మున్సిపల్ ఎన్నికల రెండో దశ పోలింగ్ సందర్భంగా పోలీసులు, ఎన్నికల అధికారుల సాయంతో కూటమి అక్రమాలు నిరాటంకంగా కొనసాగాయని, అయినా ఎస్ఈసీ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని వైఎస్సార్సీపీ నేతలు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం ) నలమారు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు.  ఇవాళ ఎన్నికల సందర్భంగా జరిగిన అక్రమాలపై ఎస్ఈసీని కలిసి మరోసారి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎస్ఈసీ ఇప్పటికైనా చర్యలు తీసుకుపోతే న్యాయపోరాటం తప్పదని వారు హెచ్చరించారు. 
ప్రెస్ మీట్లో వైఎస్సార్సీపీ నేతలు ఏం మాట్లాడారంటే..
    
- ఎస్ఈసీ స్పందించకపోతే న్యాయపోరాటం
: వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి

స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై ఇప్పటికే పలుమార్లు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాం. రాష్ట్రంలో ఎన్నికల్ని చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో అర్దమవుతోంది. పోలీసులే వైఎస్సార్సీపీ అభ్యర్ధుల్ని ఎలా అడ్డుకుంటున్నారో అందరూ చూస్తున్నారు. ఎన్నికల ఏజెంట్ గా ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారిని ఇవాళ హౌస్ అరెస్టు చేశారు. రాప్తాడులో 200 బ్యాలెట్ పేపర్లు ఎత్తుకుపోతే, ఎవరు తీసుకెళ్లారో తెలియదని ఆర్వో చెప్తున్నారు. ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే మహిళలపై కార్లు పోనిచ్చేస్తున్నారు. మంగళగిరిలో లోకేష్ గారు రిగ్గింగ్ ల మీద రిగ్గింగ్ లు చేయిస్తున్నారు. అంటే మంగళగిరిలో కూడా గెలుపు మీద నమ్మకం లేదన్నమాట. అటువంటప్పుడు ఎన్నికలు పెట్టడం ఎందుకు, నేరుగా మీ పార్టీ నేతల్నే విజేతలుగా ప్రకటించుకుంటే సరిపోయేదిగా. ఎన్నికల కమిషన్ గానీ, స్థానిక ఎన్నికల అధికారులు కానీ మా ఫిర్యాదుల్ని మొక్కుబడిగా తీసుకోవడమే తప్ప చర్యలు లేవు. ఓ ఎమ్మెల్యే కారుతో గుద్దేస్తే, ఆమెకు మద్దతుగా టీడీపీ నాయకులు ఎస్ఈసీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చారంటే అంతకన్నా అరాచకం ఎక్కడన్నా ఉంటుందా? ఎమ్మెల్యే స్థానిక ఓటర్లపై దాడులు చేస్తుంటే మందలించాల్సింది పోయి ఎదురు ఫిర్యాదులు చేస్తారా? ఓ పక్క డబ్పుప్రయోగం, మరోపక్క అధికారుల అండతో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, వేసినా తిరస్కరించేలా చేయడం చేస్తున్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రానికి మచ్చగా మారిపోయాయి. సుప్రీంకోర్టు, హైకోర్టులు మందలించినా అధికారుల్లో మార్పులు కనిపించడం లేదు. ఏ ఒక్క అధికారిపై అయినా చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? గతంలో వైఎస్సార్సీపీ హయాంలో తప్పు చేయకపోయినా ఎంతో మంది అధికారుల్ని మార్చేసారు. ఇవాళ తప్పు చేస్తున్నా అధికారులపై చర్యల్లేవు. వైఎస్సార్సీపీ అభ్యర్ధులు గెలుస్తున్నా డిక్లరేషన్ ఫారాలు మాత్రం టీడీపీ వాళ్లకు ఇచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శాంతిభద్రతల వైఫల్యంలో, అరాచకంలో, రౌడీయిజం, గూండాయిజంలో తప్ప పాలనలో నంబర్ వన్ గా లేదు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోకపోతే మేం న్యాయపోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం.

- నిరాటంకంగా కొనసాగుతున్న అక్రమాలు
: కొమ్మూరి కనకారావు, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్

ఇవాళ జరిగిన పంచాయతీ తొలిదశ, మున్సిపల్ రెండో దశ ఎన్నికల్లో కూటమి అక్రమాలు నిరాటంకంగా సాగాయి. అయినా ఎస్ఈసీ నుంచి ఎలాంటి చర్యల్లేవు. దీన్ని బట్టి చూస్తే ఎన్నికల కమిషన్ పూర్తిగా చంద్రబాబు చేతుల్లోకి వెళ్లిపోయినట్లు అర్థమవుతోంది. సహజంగా చంద్రబాబుకు స్థానిక సంస్థల ఎన్నికలంటే భయం. ప్రతిపక్షంలో ఉంటే ఎన్నికల్ని బహిష్కరించాడు. అధికారంలో ఉండగా ఎన్నికల కమిషన్ ను తన చెప్పుచేతల్లో ఉంచుకుని నామినేషన్ల నుంచి ఎన్నికల వరకూ ప్రతీ చోటా అక్రమాలకు పాల్పడుతున్నాడు. పోలీసులు, ఎన్నికల వ్యవస్థల్ని అడ్డుపెట్టి చంద్రబాబు ఎన్నికల్ని నెగ్గాలని చూస్తున్నాడు. అభివృద్ధి చేస్తున్నా, సూపర్ సిక్స్ ఇస్తున్నా అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఎన్నికల నిర్వహణలో మాత్రం ఎందుకు విఫలమవుతున్నారో చెప్పాలి. మంగళగిరి మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్ధికి ఏజెంట్ అయిన దొంతిరెడ్డి వేమారెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. లోకేష్ నియోజకవర్గంలో 39, 40 పోలింగ్ బూత్ ల్లో రిగ్గింగ్ చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవాళ అధికారం చేతుల్లో ఉందని చంద్రబాబు గెలిచినట్లు చెప్పుకుంటున్నారే తప్ప ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు. ఇవి సక్రమంగా జరిగిన ఎన్నికలే కావు. ఎస్ఈసీ చంద్రబాబు జేబు సంస్థగా మారిపోవడం సిగ్గుచేటు. 

- ఇంత అన్యాయంగా ఎన్నికలు నిర్వహిస్తారా?
: నలమారు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి (ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం) 

ఇవాళ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలను ఎన్నికల కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్లాం. ఎస్ఈసీకి 46 వినతిపత్రాలు ఇచ్చాం. రాయచోటి, శ్రీకాళహస్తి, గురజాల, మంగళగిరి, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో టీడీపీ గూండాలు ఎలా రిగ్గింగ్ చేసుకున్నారు, మా వాళ్లపై ఎలా దాడులు చేశారన్న దానిపై ఫిర్యాదులు చేసినా ఎస్ఈసీ పట్టించుకోలేదు. మా వినతిపత్రాల్ని అధికారులకు ఫార్వార్డ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఎస్ఈసీ ఉండటం సిగ్గుచేటు. నామినేషన్ల దగ్గరి నుంచీ ప్రతీ చోటా కూటమి నేతలు రకరకాలుగా అక్రమాలకు పాల్పడ్డారు. ఇంత దుర్మార్గంగా ఎన్నికలు జరుగుతుండటం చూస్తుంటే రాక్షసపాలన ఎలా ఉందో అర్దమవుతోంది. అనంతపురం జిల్లా రాప్తాడులో 200 బ్యాలెట్ పేపర్లు టీడీపీ వ్యక్తి ఎత్తుకుపోయాడని ఫిర్యాదు చేస్తే రీపోలింగ్ కు ఆదేశించకుండా ఎస్ఈసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇంత బహిరంగంగా బ్యాలెట్ పేపర్లు ఎత్తుకుపోతుంటే, అక్కడే ఉన్న అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారు, అంత న్యాయంగా మీరు ఎన్నికలు నిర్వహిస్తున్నారని అర్దమవుతోంది. ఇంత రిగ్గింగ్ జరుగుతున్నా అక్కడున్న అధికారులు, పోలీసులు అడ్డుకోకపోగా.. మా వాళ్లను అడ్డుకుని కేసులు పెడుతున్నారు. మీ దుర్మార్గాలను ప్రజలు గమనిస్తున్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే అందరు అభ్యర్ధులు స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనేలా చేసి అప్పుడు గెలుపు గురించి మాట్లాడండి.

Back to Top