కుప్పం: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పలు జిల్లాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కుప్పం మండలం వానగుట్టపల్లి పంచాయతీలో వైయస్ఆర్‌సీపీ మద్దతుతో పోటీ చేసిన బసవరాజు 25 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించినప్పటికీ, డిక్లరేషన్ ఇవ్వకుండా టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారని వైయస్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల రూట్ అధికారి కారుపై దాడి జరిగిన సమయంలో కారు దూసుకెళ్లడంతో వైయస్ఆర్‌సీపీ కార్యకర్త రాజేంద్ర(60) మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. బి.యాలేరులో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం బి.యాలేరు గ్రామంలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు కార్లు, ఆయుధాలతో దాడికి పాల్పడ్డారని పార్టీ వర్గాలు తెలిపాయి. తీవ్రంగా గాయపడిన బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నాయి. చిన్నకాకానిలో పోలీసుల లాఠీచార్జి మంగళగిరి నియోజకవర్గం చిన్నకాకానిలో ఎన్నికల సందర్భంగా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తుల ఓట్లపై స్థానికులు ప్రశ్నించడంతో పోలీసులు లాఠీచార్జి చేశారని స్థానికులు తెలిపారు. ఇళ్లలోకి వెళ్లి మరీ లాఠీచార్జి చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. నల్లగొండ్లలో వైయస్ఆర్‌సీపీ మద్దతుదారుడి విజయం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం నల్లగొండ్లలో వైయస్ఆర్‌సీపీ మద్దతుతో పోటీ చేసిన అన్నపురెడ్డి శ్రీనివాసులురెడ్డి 201 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా విజయం సాధించారు. అనంతరం టీడీపీ వర్గీయులు గ్రామస్తులను దూషించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాణాలలో లాఠీచార్జి.. పసురపాడులో రీకౌంటింగ్‌పై అభ్యంతరం నంద్యాల జిల్లా కాణాల గ్రామంలో వైయస్ఆర్‌సీపీ మద్దతు అభ్యర్థికి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం సృష్టించి వైయస్ఆర్‌సీపీ నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. పసురపాడులో వైయస్ఆర్‌సీపీ మద్దతు అభ్యర్థి గెలుపొందిన అనంతరం రీకౌంటింగ్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ మహిళలు, వైయస్ఆర్‌సీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. పొదిలిలో రిగ్గింగ్‌పై ఆరోపణలు ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పొదిలి నగర పంచాయతీ 14వ వార్డులో మార్కాపురానికి చెందిన టీడీపీ నాయకులు చిట్యాల చంద్రశేఖర్‌రెడ్డి అలియాస్ ఇసుక శేఖర్ తదితరులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వైయస్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. మార్కాపురానికి చెందిన వ్యక్తులు పొదిలిలో ఓట్లు వేయడంపై ప్రశ్నలు లేవనెత్తారు. పెద్దులపల్లిలో గెలుపు డిక్లరేషన్‌పై గోవిందరెడ్డి అభ్యంతరం కడప జిల్లా బి.కోడూరు మండలం పెద్దులపల్లి పంచాయతీలో వైయస్ఆర్‌సీపీ మద్దతుదారు సిద్ధమూర్తి లక్ష్మీదేవి గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించినప్పటికీ డిక్లరేషన్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఎమ్మెల్సీ డి.సి.గోవిందరెడ్డి ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఎన్నికల నిబంధనల ప్రకారం విజేతకు డిక్లరేషన్ ఫారం అందించాలని కోరారు. రాత్రి కౌంటింగ్ కేంద్రం వద్ద వైయస్ఆర్‌సీపీ నాయకులతో కలిసి ఉండి అధికారులతో చర్చించారు.