ఎన్నికలు నిర్వహించడంలో ఎస్‌ఈసీ పూర్తిగా విఫలం

టీజేఆర్‌ సుధాకర్‌బాబు ధ్వజం

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు. 

స్థానిక ఎన్నికలపై వైయస్‌ఆర్‌సీపీ ముందస్తు హెచ్చరికలను ఎస్‌ఈసీ పట్టించుకోలేదు

కేంద్ర, పారా మిలటరీ బలగాలు, వెబ్‌కాస్టింగ్, సీసీటీవీ ఏర్పాటు చేయాలని కోరినా ఎస్‌ఈసీ స్పందించలేదు

రాయలసీమ నుంచి ప్రకాశం జిల్లా వరకు నామినేషన్ల అడ్డంకులు, దాడులు, పోలీసుల దౌర్జన్యాలు

మహిళా అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు చింపివేత.. హౌస్‌ అరెస్టులతో భయభ్రాంతులు

ఇకనైనా ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను చాటుకుని బాధ్యులైన అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలి

ప్రెస్‌మీట్‌లో టీజేఆర్‌ సుధాకర్‌బాబు డిమాండ్‌

తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) పూర్తిగా విఫలమైందని వైయస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు మండిపడ్డారు. ఎన్నికల్లో అశాంతి, నామినేషన్లకు అడ్డంకులు, అధికార యంత్రాంగం దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని వైయస్సార్‌సీపీ ముందుగానే ఎస్‌ఈసీని ఆధారాలతో హెచ్చరించినా పట్టించుకోలేదని ఆయన అన్నారు. వైయస్‌ఆర్‌ కడప, అనంతపురం, శ్రీకాకుళం, పల్నాడు, చిత్తూరు, నంద్యాల తదితర ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలే ఎస్‌ఈసీ వైఫల్యానికి నిదర్శనమని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడంలో ఎస్‌ఈసీ పూర్తిగా విఫలమైందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఆక్షేపించారు.
మీడియా సమావేశంలో టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఏమన్నారంటే..:

ఎన్నికల కమిషన్‌ చూస్తూ ఉండిపోయింది:
    స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఇంత పెద్ద స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికలు, పరిషత్‌ ఎన్నికల మాదిరిగానే పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార కూటమి పార్టీల అరాచకాలకు అంతు లేకుండా పోయింది. ఇవాళ కమలాపురం, వేంపల్లి, చక్రాయపేట, తొండూరు, పల్నాడు, పెదకూరపాడు, రొంపిచర్ల, పుంగనూరు, బనగానపల్లి తదితర ప్రాంతాల్లో నామినేషన్లను అడ్డుకోవడం, అభ్యర్థులను బంధించడం, మహిళలను అడ్డుకోవడం, దాడులు, బెదిరింపులు జరిగాయి. ఇన్ని ఘటనల తర్వాత ఎస్‌ఈసీ 12 జిల్లాల ఎస్పీలతో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించాల్సి వచ్చింది. ఎన్నికల కమిషన్‌ స్వయంగా ఘటనలు జరిగినట్లు చెబుతున్నప్పుడు వాటిని నివారించాల్సిన బాధ్యత కూడా అదే కమిషన్‌దే కదా? ముందుగానే మేము కోరిన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. 

ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎస్‌ఈసీదే:
    నామినేషన్లకు ముందే సర్టిఫికెట్ల దగ్గర నుంచి సమస్యలు మొదలయ్యాయి. సర్టిఫికెట్లు సాధించి నామినేషన్‌ వేయడానికి వెళ్తే అడ్డుకున్నారు. నామినేషన్లు వేస్తే పత్రాల్లో లోపాల పేరుతో తిరస్కరించారు. అభ్యర్థులుగా నిలబడిన తర్వాత ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్న ఘటనలు కూడా చూశాం. ఇవన్నీ దాటుకుని వైయస్‌ఆర్‌సీపీ బలంగా నిలిచింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఇకనైనా ఎన్నికల కమిషన్‌ స్వతంత్రంగా వ్యవహరించి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సుధాకర్‌బాబు స్పష్టం చేశారు.

Back to Top