దాడి ఘ‌ట‌న‌పై ఎంపీ అవినాష్‌రెడ్డి ఫిర్యాదు 

 
వైయస్సార్‌ జిల్లా: సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడూరులో వైయ‌స్ఆర్‌సీపీ సర్పంచ్‌ అభ్యర్థులకు మద్దతుగా వెళ్లిన ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. అల్లరి మూకలు కాన్వాయ్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డారని, పెట్రోల్‌ బాంబులతోనూ దాడి చేసినట్లు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు తెలిపారు. ఈ దాడి బీటెక్‌ రవి వర్గీయులే చేయించారని వారు ఆరోపించారు.

పులివెందుల అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎంపీ అవినాష్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు చూపించిన సమయంలో పూర్తి దృశ్యాలు చూపించాలని ఆయన పట్టుబట్టారు. అభ్యర్థులతో నామినేషన్లు వేయించినట్లు చూపించిన వీడియోలో సగం మాత్రమే చూపించారని, మిగిలిన దృశ్యాల్లో నామినేషన్‌ పత్రాలు చించేసిన ఘటనలు ఉన్నాయని అవినాష్‌రెడ్డి ప్రశ్నించారు.

ఎస్ఈసీకి వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు

అంకాలమ్మగూడూరు ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తమ పార్టీ సానుభూతిపరులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుని పెట్రోల్‌ బాంబులతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. చివరి రోజు నామినేషన్లు వేసేందుకు తమ అభ్యర్థులకు వెంటనే అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరింది. 

Back to Top