ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి

రాళ్లు, పెట్రోల్‌ బాంబులతో దాడి

 సింహాద్రిపురం అంకాలమ్మగూడూరులో ఉద్రిక్తత

వైయ‌స్ఆర్ జిల్లా: కడప ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీ సర్పంచ్‌, వార్డు సభ్యుల అభ్యర్థులకు మద్దతుగా వెళ్తుండగా వైయ‌స్‌ఆర్‌ జిల్లా సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడూరులో ఆయన కాన్వాయ్‌పై దాడి జరిగింది. రాళ్లు, పెట్రోల్‌ బాంబులతో దాడి చేయడంతో ఓ కారు ధ్వంసమైంది. ఈ దాడిలో టీడీపీ నేత బీటెక్‌ రవి అనుచరులు పాల్గొన్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు.

పోలీసుల సమక్షంలోనే దాడి: అవినాష్‌రెడ్డి

“నాపై దాడి జరిగింది. కేవలం ఐదు వాహనాలతోనే వెళ్లా. సీఐ, ఎస్‌ఐలకు ముందుగానే సమాచారం ఇచ్చా. బీటెక్‌ రవి ఆధ్వర్యంలోనే దాడులు చేశారు. పెట్రోల్‌ బాంబులతో దాడికి తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయి” అని వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు. దాడి అనంతరం అవినాష్‌రెడ్డి సర్పంచ్‌, వార్డు సభ్యుల అభ్యర్థులతో కలిసి పులివెందుల పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసు రక్షణతో నామినేషన్లు వేసేందుకు వెళ్లేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. మరోవైపు వేంపల్లిలోనూ నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారులను పోలీసులు అడ్డుకున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

పోలీసుల తీరుపై ఆగ్రహం

దాడిపై ఫిర్యాదు చేసేందుకు పులివెందుల పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఎంపీ అవినాష్‌రెడ్డిని డీఎస్పీ మురళీనాయక్‌ కలవకుండా కాలయాపన చేశారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. అనంతరం నామినేషన్లకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. ఘటనపై కేసులు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కోరుతున్నారు.

Back to Top