టీడీపీకి ఊడిగం చేయాలనుకుంటే పోలీసు ఉద్యోగాలకు రాజీనామా చేయండి  

 పచ్చ కండువాలు కప్పుకుని ఎన్నికల్లో పనిచేయండి

 పంచాయతీ ఎన్నికల్లో పోలీసుల తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ నేతల ధ్వజం

పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో జరుగుతున్న అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఫిర్యాదు.

అనంతరం మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నంద‌మూరి లక్ష్మీపార్వతి, ఎంవీఎస్‌ నాగిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు.

 డీజీపీ నుంచి కొంత మంది ఎస్పీలు, డీఐజీలు, సీఐలు, ఎస్ఐల వరకు టీడీపీ నేతలు చెప్పినట్టే పనిచేస్తున్నారు

 ప్రజాస్వామ్యాన్ని కాపాడలేని పోలీసులు ఇక యూనిఫాం, టోపీలు ఎందుకు ధరించాలి?

 ప్రజలకు రక్షణ కల్పించలేని పోలీసులు ఉద్యోగాల్లో కొనసాగడం ఎందుకు?

 నామినేషన్ల ప్రక్రియను అడ్డుకోకుండా ప్రతి అభ్యర్థికి రక్షణ కల్పించాలి

 ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాలి

 ఇప్పటికైనా పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలి

  వ్యవస్థలు బాధ్యతగా వ్యవహరించకపోతే ప్రజల్లో తీవ్ర తిరుగుబాటు తప్పదు

 మీడియా సమావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతల హెచ్చరిక 

విజ‌య‌వాడ‌: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పోలీసుల వ్యవహరిస్తున్న తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు  మండిపడ్డారు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలోని కొంతమంది సీఐలు, ఎస్‌ఐల వరకు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి ఊడిగం చేయాలనుకుంటే పోలీసు ఉద్యోగాలకు రాజీనామా చేసి పచ్చ కండువాలు కప్పుకుని ఎన్నికల్లో పనిచేయాలని ఘాటుగా సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడకుండా అధికార పార్టీకి వత్తాసు పలికితే ప్రజల్లో తీవ్ర తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. పంచాయతీ నామినేషన్ల ప్రక్రియను స్వేచ్ఛగా కొనసాగించి, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడంతో పాటు ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ ఇప్పటికైనా తన బాధ్యతను నిర్వర్తించాలని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో జరుగుతున్న అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఫిర్యాదు. అనంత‌రం మీడియాతో వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లక్ష్మీపార్వతి, ఎంవీఎస్‌ నాగిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాట్లాడారు.
మీడియాతో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఏమ‌న్నారంటే..

- నామినేషన్లు వేయించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలి: మనోహర్‌రెడ్డి, లీగ‌ల్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు

డీజీపీ నుంచి ఎస్పీలు, డీఐజీలు, ఎస్‌ఐలు, సీఐల వరకు పోలీసులు టీడీపీకి ఊడిగం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ నాయకులు ఎలా చెబితే అలా వింటున్నారు. మీకు సిగ్గు, శరం ఉంటే పోలీసు ఉద్యోగాలకు రాజీనామా చేసి పచ్చ కండువాలు కప్పుకుని ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేయండి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించలేని వ్యక్తులు పోలీసులుగా పనిచేయడానికి ఎలా అర్హులు? ప్రజలకు రక్షణ కల్పించలేని మీరు ఆ పోలీసు టోపీలు ఎందుకు పెట్టుకున్నారు? ఇప్పటికైనా పోలీసులు తమ బాధ్యతను గుర్తించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి. నామినేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగించాలి, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలి, ప్రజల మానప్రాణాలకు రక్షణ కల్పించాలి. లేదంటే ప్రజల్లో తీవ్ర తిరుగుబాటు, వీధి పోరాటాలు తప్పవు. ఈరోజు సాయంత్రం 5 గంటల్లోపు రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్లు వేయించేందుకు పోలీసు వ్యవస్థ చర్యలు తీసుకోవాలి. 

- ప్ర‌జ‌లు వైయ‌స్ఆర్‌సీపీకి అండ‌గా ఉన్నార‌ని బాబుకు భ‌యం : నంద‌మూరి లక్ష్మీపార్వతి, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

టీడీపీ కూట‌మి ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో వ్యవహరిస్తున్న తీరు చూస్తే ప్రజాభిమానాన్ని ఎంతగా కోల్పోయారో స్పష్టమవుతోంది. ప్రజలు వైయ‌స్ఆర్‌సీపీకి అండగా ఉన్నారని తమ వద్ద ఉన్న నివేదికలతోనే చంద్ర‌బాబుకు తెలుసు. అందుకే స్థానిక ఎన్నికల్లో పరువు నిలబెట్టుకోవడానికి పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను నామినేషన్ కేంద్రాలకు రానివ్వకుండా చేస్తున్నారు. కొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థులకు ఏజెంట్లలా వ్యవహరిస్తూ మా అభ్యర్థుల నామినేషన్ పత్రాలను లాక్కొని చింపేస్తున్న పరిస్థితి ఉంది. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించి, తన ఆదేశాలను అమలు చేయని పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. పులివెందుల వంటి ప్రాంతాల్లో పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఎన్నికలను అప్రజాస్వామ్యంగా నడిపిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా పోలీసులు అమలు చేయకపోవడం దారుణం. నిజమైన ప్రజా మద్దతు ఉంటే టీడీపీ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి. ప్రజా తీర్పు ఎప్పటికీ ప్రజలదే. 

- ఎంపీ అవినాష్‌రెడ్డి దాడిని ఖండిస్తున్నాం: రమేష్‌యాదవ్‌, ఎమ్మెల్సీ

 పులివెందులలో హైకోర్టు ఆదేశాలు ఉన్నా పోలీసు వ్యవస్థ టీడీపీకి కొమ్ముకాస్తోంది. రౌడీ మూకలను పెట్టి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నామినేషన్ కేంద్రాల్లో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు ఉండి మా అభ్యర్థుల పత్రాలను చించేస్తున్నారు. మూడు రోజులుగా ఎస్ఈసీకి ఫిర్యాదు చేస్తున్నా సమర్థవంతమైన చర్యలు కనిపించడం లేదు. సింహాద్రిపురం అభ్యర్థులతో వెళ్తున్న మా ఎంపీ అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై వందలాది మంది గూండాలతో పెట్రోల్ బాంబులు, కట్టెలు, రాళ్లతో దాడి చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. దాడి చేసిన వారిని వదిలేసి మా ఎంపీని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లడం దారుణం. ఎంపీపై దాడిని ఖండిస్తున్నాం. ఎన్ని దాడులు చేసినా నామినేషన్లు వేయించే మా ప్రయత్నం ఆగదు. సాధ్యమైనన్ని నామినేషన్లు వేసి ప్రజా క్షేత్రంలోనే మా బలాన్ని తేల్చుకుంటాం. 

- నామినేషన్ల‌ను అడ్డుకోవ‌డం తొలిసారి చూస్తున్నాం: ఎంవీఎస్‌ నాగిరెడ్డి, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

ప్రజాస్వామ్యం నామినేషన్‌తో ప్రారంభమవుతుంది. అలాంటి నామినేషన్లను ప్రభుత్వమే అడ్డుకోవడం చరిత్రలోనే తొలిసారి చూస్తున్నాం. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల వరకు నామినేషన్లు వేయనివ్వకుండా అరాచకం కొనసాగుతోంది. ప్రతిరోజూ 20 నుంచి 30 ఫిర్యాదులు ఇస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. నిద్రపోయే వారిని లేపొచ్చు.. నిద్ర నటించే అధికార యంత్రాంగాన్ని లేపలేం. జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం కూటమికి అనుకూలంగా పనిచేస్తూ నామినేషన్లు పడనివ్వడం లేదు. పులివెందులలో సర్పంచ్ అభ్యర్థులను తీసుకెళ్తున్న ఎంపీ అవినాష్‌రెడ్డి వాహనాలపై దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడే. ఎన్నికల సమయంలో ఎస్ఈసీనే సుప్రీం. వెంటనే జోక్యం చేసుకుని నామినేషన్లు వేయించేలా చర్యలు తీసుకోవాలి. గ్రామ స్వరాజ్యం పేరుతో సాగాల్సిన పాలనలో గ్రామాల్లోనే అరాచకం సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వారి పర్యవసానాలను భవిష్యత్తులో వారే అనుభవించాల్సి వస్తుంది.

- ఎన్నికలంటే చంద్రబాబుకు ఎందుకంత భయం?: కొమ్మూరి కనకారావు, ఎస్సీ సెల్ రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌

చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్లో పూర్తిగా మద్దతు కోల్పోయిందనే దానికి ఎన్నికలను అడ్డుకోవడమే నిదర్శనం. పులివెందుల నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు జరగడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? ఫ్యాక్షనిజాన్ని తుదముట్టించామని చెప్పే చంద్రబాబు పాలనలోనే ఎన్నికల వేళ ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోంది. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న పోలీసులు, టీడీపీ కార్యకర్తలపై ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? నిజమైన ప్రజా మద్దతు ఉంటే టీడీపీ పారదర్శకంగా, నిక్కచ్చిగా ఎన్నికలు నిర్వహించాలి. నామినేషన్ల దశలోనే ఎన్నికలను అడ్డుకుంటున్నారంటే కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత ఎంతగా పెరిగిందో స్పష్టమవుతోంది.

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేసిన వారిలో వైయ‌స్ఆర్‌సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు అంకంరెడ్డి నారాయ‌ణ‌మూర్తి, ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ యోహ‌న్‌రాజు, బొందిలి విభాగం నాయ‌కుడు న‌రేంద్ర‌సింగ్ త‌దిత‌రులు ఉన్నారు.

Back to Top