తాడేపల్లి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు సాగిస్తున్న ఆటవిక దాడులపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై పోలీసులు చూస్తుండగానే టీడీపీ నేతలు రాళ్లు, కర్రలు, పెట్రోల్ బాంబులతో హత్యాయత్నానికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. నామినేషన్లు వేయడానికి వెళ్తున్న వైయస్సార్‌సీపీ మద్ధతిచ్చిన అభ్యర్ధులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే టీడీపీ గూండాలకు కొమ్ముకాయడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయని ఈ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఆయన ఏమన్నారంటే.. - రాష్ట్రంలో రావణకాష్ఠాన్ని మించిన అరాచకం: ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో రావణకాష్ఠాన్ని మించిన అల్లకల్లోలం నడుస్తోంది. పాకిస్తాన్-ఇండియా సరిహద్దుల్లోని పీవోకే వద్ద కూడా ఇటువంటి ఘటనలు జరిగి ఉండవు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడా జరగనటువంటి అరాచకం నేడు మన రాష్ట్రంలో కొనసాగుతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు పార్లమెంటు సభ్యులపై హత్యాయత్నాలు జరుగుతున్నాయంటే రాష్ట్రంలో అసలు పరిపాలన సాగుతుందా? లేక ఆటవిక సామ్రాజ్యంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోంది. - పోలీసుల సాక్షిగానే ఎంపీ అవినాష్ రెడ్డిపై పెట్రోల్ బాంబుల దాడి: పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం అగుడూరు వద్ద వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు నామినేషన్లు వేయడానికి వెళ్తుండగా, హైకోర్టు ఆదేశాలతో వారికి రక్షణగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు అక్కడికి వెళ్లారు. వారు ఊరిలోకి అడుగు పెట్టకముందే తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బీటెక్ రవి పోలీసులను అడ్డుపెట్టుకొని, బయట నుంచి తెప్పించిన కిరాయి గూండాలు, గంజాయి బ్యాచ్‌లతో ఎంపీ కాన్వాయ్‌పై దాడికి తెగబడ్డారు. రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లు, పెట్రోల్ బాంబులతో ఎంపీ గారిని హతమార్చడానికి పక్కా ప్రణాళికతో దాడి చేశారు. ఆ విజువల్స్ చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. పులివెందుల రూరల్ సీఐ శాంతిలాల్, ఎస్ఐ మద్దిలేటి తదితర పోలీసు అధికారులు అక్కడే ఉండి ఈ దాడులను ప్రోత్సహించడం దారుణం. - కంచే చేను మేసినట్లు పోలీసుల తీరు: నిన్న బీటెక్ రవి ఏకగ్రీవాలు కాలేదని అలిగి కూర్చుంటే.. డీఎస్పీ, ఎస్పీ సరిపోలేదని ఏకంగా డీఐజీ వచ్చి ఆయనకు సర్దిచెప్పి పంపించారు. ఆయన ఏం సర్ధిచెప్పారో గానీ, మరుసటి రోజే ఎంపీపై ఇంతటి దారుణమైన దాడి జరిగింది. గతంలో మున్సిపల్ ఎన్నికలప్పుడు వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులపైనే ఏకే-47లు, టియర్ గ్యాస్‌తో విరుచుకుపడిన డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ మురళీ నాయక్‌లకు.. నేడు ఎంపీని చంపడానికి టీడీపీ గూండాలు వస్తుంటే తుపాకుల్లో బుల్లెట్లు అయిపోయాయా? లేక చంద్రబాబు, లోకేష్‌ల నుంచి ఆర్డర్లు రాలేదా? కంచే చేను మేసినట్లు, దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్లు పోలీసులు రౌడీలకు కొమ్ముకాస్తున్నారు. - ఓటమి భయంతోనే విష సంస్కృతి: స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగితే వార్డు మెంబర్ల నుంచి సర్పంచుల వరకు వైఎస్సార్‌సీపీ వన్ సైడ్‌గా స్వీప్ చేస్తుందనే భయం కూటమి ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. అందుకే కడప, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, సత్యసాయి జిల్లాల్లో బాంబుల కల్చర్‌ను తీసుకొచ్చారు. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నుంచి తాడేపల్లిగూడెం వరకు నామినేషన్లు వేసిన వారి ఇళ్లు తగలబెడుతున్నారు. గతంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తిలపైనా ఇలాగే దాడులు చేశారు. ప్రజలు కసితో ఫ్యాన్ గుర్తుపై ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఏజెంట్లే భయపడుతున్నారు. - కోర్టులంటే లెక్కలేదు.. ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి: ఒకవైపు రెడ్ బుక్ పేరుతో లోకేష్ గతంలో చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అరెస్టయితే 24 గంటల్లో బెయిల్ ఇప్పిస్తామన్న హామీలే నేడు గూండాలకు ఇంతటి తెగింపునిచ్చాయని శివశంకర్ మండిపడ్డారు. వేంపల్లె ఘటనలో నామినేషన్లకు రక్షణ కల్పించాలని హైకోర్టు బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చినా పోలీసులు లెక్కచేయడం లేదని... పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలను కూడా ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్‌లు పెట్టి, జిల్లా అధ్యక్షుల లెటర్ హెడ్లపై అభ్యర్థులను ప్రకటిస్తూ గ్రామాలను కలుషితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎంపీకే రక్షణ లేని ఈ రాష్ట్రంలో ఇక సామాన్య ఓటర్లకు, వారి ఆస్తులకు రక్షణ ఎక్కడుంటుందని ప్రశ్నించారు.? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి నాటి బీహార్ కంటే దారుణంగా తయారైందని...ఈ నేపధ్యంలో రాజ్యాంగాన్ని, న్యాయస్థానాలను గౌరవించని ఈ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.