కూటమి పాలనలో అరాచకానికి, హింసకు ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్‌గా మారింది

కోర్టు ఆదేశాలున్నా నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటున్న టీడీపీ గూండాలు

ఏకంగా సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిపైనే పెట్రోల్ బాంబులతో దాడులా?.. ఇదేం ప్రజాస్వామ్యం?

ఆగ్రహం వ్యక్తం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ కడప జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి 

కడప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి.

కడప: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కూటమి ప్రభుత్వం పూర్తిగా అభాసుపాలు చేస్తోందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ హింస, అరాచకాలకు ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ వన్ రాష్ట్రంగా మార్చిందని వైఎస్సార్సీపీ కడప జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కడపలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలోఆయన మీడియాతో మాట్లాడుతూ, పురపాలక ఎన్నికల నుంచి ప్రస్తుతం జరుగుతున్న మండల, పంచాయతీ ఎన్నికల వరకు మంత్రులు, ఎమ్మెల్యేలే ప్రత్యక్షంగా రంగంలోకి దిగి వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లను చించేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణ కల్పించాలంటూ సాక్షాత్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ, పోలీసుల అండతో టీడీపీ గూండాలు ఏకంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పైనే పెట్రోల్ బాంబులు, రాళ్లతో దాడులకు తెగబడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కోస్తా ఆంధ్రాలో అధికారుల సాయంతో అక్రమంగా నామినేషన్లు తిరస్కరించడం, రాయలసీమలో భౌతిక దాడులకు దిగడం ద్వారా ఏకపక్ష విజయాలను ప్రకటించుకోవాలని చూస్తున్న కూటమి పార్టీలకు, వారికి వత్తాసు పలుకుతున్న అధికారులకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు.

ప్రెస్ మీట్‌లో రవీంద్రనాథ్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే...

మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్య కలను అభాసుపాలు చేశారు:

మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని, స్థానిక సంస్థల వ్యవస్థను ఈ ప్రభుత్వం పూర్తిగా అభాసుపాలు చేసింది. ప్రజలకు ఉపయోగపడే నాయకులను శాంతియుతంగా ఎన్నుకోవాల్సిన ఎన్నికలను భ్రష్టు పట్టించి, గూండాలు, రౌడీలు పదవులు దక్కించుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రభుత్వం ఉందా? అరాచకాల్లో బ్రిటిష్ పాలనను సైతం మరిపిస్తున్నారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఆంధ్రప్రదేశ్ 'ఏ'తో మొదటి స్థానంలో ఉంటే, ఇప్పుడు హింస, విధ్వంసం, దుర్మార్గాల్లో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది.

ఎంపీపైనే పెట్రోల్ బాంబులతో దాడులు.. పోలీసుల ప్రేక్షక పాత్ర:

హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసు రక్షణ కల్పించి నామినేషన్లు వేయించాలని కోరేందుకు సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాలు అడ్డగించి పెట్రోల్ బాంబులు, రాళ్లు, కత్తులతో దాడి చేసి కార్లను ధ్వంసం చేశారు. ముందు పోలీసులను పెట్టి, వెనుక నుంచి గూండాలతో దాడులు చేయిస్తున్నారు. సాక్షాత్తూ ఒక పార్లమెంట్ సభ్యుడికే రక్షణ లేకపోతే ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి? కమలాపురం మండలం పెద్దచెప్పలిలో మా అభ్యర్థికి రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశాలు ఉన్నా, ఆమె నామినేషన్ వేయడానికి వస్తే అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముందుగానే తప్పుడు కేసులు పెట్టారు.

మంత్రులు, ఎమ్మెల్యేలే దగ్గరుండి నామినేషన్లు చించేస్తున్నారు:

గత మున్సిపల్ ఎన్నికల నుంచి ఇప్పటి పంచాయతీ ఎన్నికల వరకు మంత్రులు, ఎమ్మెల్యేలే ప్రత్యక్షంగా పాల్గొని ప్రత్యర్థుల నామినేషన్ పత్రాలను చించేస్తున్నారు. పులివెందుల, కమలాపురం, బద్వేలు, జమ్మలమడుగు.. ఇలా ఎక్కడ చూసినా ఇదే అరాచకం. కోస్తా ఆంధ్రాలో అయితే నామినేషన్లు వేయనిచ్చి, ఆ తర్వాత అధికారులపై ఒత్తిడి తెచ్చి రిజెక్ట్ చేయించడం, పోలింగ్ రోజు మేనేజ్ చేయడం వంటి అక్రమాలకు పాల్పడ్డారు. ఇంత దారుణంగా ఎన్నికలు జరపడం కంటే, మీకున్న డబుల్ ఇంజిన్ సర్కార్‌తో చట్ట సవరణ చేసి, మీ వాళ్లనే నేరుగా నామినేట్ చేసుకుంటే సరిపోయేది కదా?

అబద్ధపు స్ట్రైక్ రేట్లతో మభ్యపెట్టే ప్రయత్నం:

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయింది. కేవలం ఎన్డీఏ పెద్దల వద్ద మెప్పు పొందడం కోసం, 87 శాతం, 92 శాతం స్ట్రైక్ రేట్ సాధించామని చెప్పుకోవడానికే ఈ విధ్వంసం సృష్టిస్తున్నారు. తమ చేతిలో ఉన్న మీడియా, పేపర్లు, ఛానళ్ల ద్వారా ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా జరిగాయని మభ్యపెట్టాలని చూస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలకు, దేశానికి అంతా తెలుసు. మేనిఫెస్టో హామీలను గాలికొదిలేసి, కేవలం లంచాలు, కమిషన్లు, దోపిడీ కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది.

అధికారుల తీరు మారకపోతే కోర్టు ధిక్కరణ తప్పదు:

ఈ నేపధ్యంలో పోలీసు అధికారులు కొంచెమైనా న్యాయం, ధర్మం ఆలోచించి రూల్స్ ప్రకారం పనిచేయాలని రవీంద్రనాధ్ రెడ్డి హితవు పలికారు.  ఈ ప్రభుత్వం శాశ్వతం కాదని.. మరో రెండేళ్ల తర్వాత కూడా మీరంతా మళ్లీ పనిచేయాల్సిందే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్, ఎస్పీ, ఇతర పోలీసు అధికారులు ఇప్పటికైనా హైకోర్టు ఆదేశాలను అమలు చేసి, మా అభ్యర్థులకు పూర్తి రక్షణ కల్పించి నామినేషన్లు వేయించాలని... లేనిపక్షంలో కచ్చితంగా కోర్టు ధిక్కరణ (కంటెంప్ట్) పిటిషన్లు వేస్తామని హెచ్చరించారు.  ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఈ దుష్ట శక్తులను రాబోయే ఎన్నికల్లో ప్రజలు బంగాళాఖాతంలో కలపడం ఖాయమని రవీంద్రనాధ్ రెడ్డి తేల్చి చెప్పారు.

Back to Top