నెల్లూరు జిల్లా, ఆత్మకూరు: మర్రిపాడు, ఎపిలగుంట ఎంపీటీసీ స్థానాల్లో తాము నామినేషన్లు ఉపసంహరించుకోకపోయినా, టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడంపై వైయస్ఆర్సీపీ అభ్యర్థులు బోయపాటి మహేశ్వరి, కొలకాని చిన్న అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఏకగ్రీవ ప్రకటనను రద్దు చేసి, రెండు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. తిక్కవరం గ్రామానికి చెందిన బోయపాటి మహేశ్వరి మర్రిపాడు ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి, కొలకాని చిన్న ఎపిలగుంట ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి వైయస్ఆర్సీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈ నెల 22న మర్రిపాడు ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావుకు నామినేషన్ పత్రాలు అందజేశామని, వాటిని స్వీకరించిన అనంతరం అధికారి సంతకంతో రసీదు కూడా ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు. ఈ నెల 27న మధ్యాహ్నం ఒంటి నుంచి రెండు గంటల మధ్య వైయస్ఆర్సీపీ ఎంపీపీ అభ్యర్థి, ఇతర ఎంపీటీసీ అభ్యర్థుల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తమకు ఇచ్చిన బీ-ఫారాలను రిటర్నింగ్ అధికారికి అందజేశామని వెల్లడించారు. అనంతరం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల జాబితా విడుదల కాగా, అందులో మర్రిపాడు, ఎపిలగుంట ఎంపీటీసీ స్థానాల టీడీపీ అభ్యర్థుల పేర్లు ఉండటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము నామినేషన్లు ఉపసంహరించుకోలేదని, ఉపసంహరణకు సంబంధించిన ఏ పత్రంపైనా సంతకం చేయలేదని స్పష్టం చేశారు. తమ నామినేషన్లు ఎలా ఉపసంహరణకు గురయ్యాయని, రిటర్నింగ్ అధికారికి అందజేసిన బీ-ఫారాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉపసంహరణ పత్రాలపై తమ సంతకాలు ఉన్నాయని చెబితే, వాటిని మరోసారి పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మర్రిపాడు, ఎపిలగుంట ఎంపీటీసీ స్థానాల్లో ఏకగ్రీవ ఎన్నికల ప్రకటనను రద్దు చేసి, ఎన్నికలు నిర్వహించాలని బోయపాటి మహేశ్వరి, కొలకాని చిన్న కోరారు. తమకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.