నామినేషన్ ఉపసంహరించుకోకుండానే ఏకగ్రీవ ప్రకటన ఎలా? 

కొండాయపాలెంలో ఎన్నికల అధికారుల తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ అభ్యంతరం

నెల్లూరు జిల్లా: ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాయపాలెం ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవ ప్రకటన వివాదాస్పదంగా మారింది. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి కొమ్మర్ల సునీల్ కుమార్ నామినేషన్ ఉపసంహరించుకోకుండానే టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి వెంకటరెడ్డి ప్రకటించడంపై వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర నాయకుడు చేజర్ల సుబ్బారెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి కొండా రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంపై రికార్డుల పరిశీలనలో పలు అంశాలు వెలుగులోకి వచ్చినట్లు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు వెల్లడించారు. మధ్యాహ్నం 12.36 గంటలకు టీడీపీ తరఫు అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ జరిగినట్లు, అనంతరం మధ్యాహ్నం 2.59 గంటలకు వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి ఉపసంహరణ పత్రంపై టీడీపీకి చెందిన అదే అభ్యర్థి సంతకం చేసినట్లు రికార్డుల్లో గుర్తించామని వారు పేర్కొన్నారు.

ఈ అంశంపై రిటర్నింగ్ అధికారిని వివరణ కోరగా, ఏకగ్రీవ ప్రకటనకు సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా పొందాలని సూచించినట్లు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు తెలిపాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ, సంబంధిత పత్రాలపై సంతకాలు, ఏకగ్రీవ ప్రకటనకు సంబంధించిన రికార్డులను పారదర్శకంగా పరిశీలించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది.

Back to Top