ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. ప్రతి గడపకు `వైయ‌స్ఆర్‌సీపీ`

 కాఫీ విత్ కేడర్‌ కార్యక్రమంలో మాజీ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్‌

పెనుకొండ: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని దర్గా పేట, ఉప్పరబాడ 8, 9వ వార్డుల్లో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో “కాఫీ విత్ కేడర్‌” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షురాలు కేవీ ఉషశ్రీచరణ్‌ పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి గడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ప్రజల సమస్యలు, స్థానిక అవసరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్‌ మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వ హయాంలో పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించి పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానిదేనని తెలిపారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వైయ‌స్‌ఆర్‌ రైతు భరోసా, వైయ‌స్‌ఆర్‌ చేయూత, పెరిగిన పింఛన్లు, ఆరోగ్యశ్రీ, ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచామని వివరించారు.

ప్రత్యేకంగా చేనేత కార్మికుల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టి చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించిందని తెలిపారు. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేసిన నాయకుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, చేనేతలు, రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన అనేక హామీలను అమలు చేయకుండా తీవ్ర అన్యాయం చేస్తోందని ఉషశ్రీచరణ్‌ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ప్రజలతో మమేకం కావడం, ప్రజల పక్షాన నిలబడటం వైయ‌స్ఆర్‌సీపీ విధానమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గ, మున్సిపాలిటీ నాయకులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

Back to Top