ప్రకాశం జిల్లా: నాగులుప్పలపాడు మండలం కనపర్తి గ్రామంలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని రాజ్యసభ సభ్యులు వై.వి. సుబ్బారెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు చుండూరు రవి, వైయస్ఆర్‌సీపీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వై.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా వైయస్‌ఆర్ పాలన సాగిందని తెలిపారు. రైతుల కోసం ఎన్నో ప్రాజెక్టులు నిర్మించిన ఘనత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిదేనని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేశారని గుర్తుచేశారు. జలయజ్ఞం ద్వారా 86 ప్రాజెక్టులను ప్రారంభించి సాగునీటి రంగానికి కొత్త ఊపిరి పోసిన ఘనత వైయస్‌ఆర్‌దేనన్నారు. పావలా వడ్డీ, ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలతో రైతులు, మహిళలకు అండగా నిలిచారని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టులో రెండు టన్నెళ్లను పూర్తి చేసి అభివృద్ధి పథంలో నిలిపిన ఘనత వైయస్‌ఆర్‌దేనని వై.వి. సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టును తానే పూర్తిగా పూర్తి చేసినట్లు చంద్రబాబు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం దారుణమని అన్నారు. వైయస్‌ఆర్ అందించిన సంక్షేమ పాలన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని, అలాంటి గొప్ప నాయకుడికి మరణం లేదని వై.వి. సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మహానీయుడి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు పాల్గొన్నారు.